ముంబై: కుబేరుడు గౌతమ్ అదానీ షేర్ల కొనుగోలు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలంటూ కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భిన్నమైన వాదన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘విపక్షాల జేపీసీ డిమాండ్‌తో నేను పూర్తిగా విభేదించడం లేదు. కానీ జేపీసీ కంటే సర్వోన్నత న్యాయస్థానం కమిటీ ఈ వివాదాన్ని మరింత అర్థవంతంగా, ప్రభావవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.
‘గతంలో కొన్ని జేపీసీలకు అధ్యక్షత వహించిన అనుభవం నాకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ ఉదంతంలో ఒకవేళ జేపీసీ వేస్తే అందులో 21 మంది సభ్యులుంటారు. పార్లమెంట్‌లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా 15 సభ్యత్వాలు అధికార పార్టీకే దక్కుతాయి. ఇక మిగిలిన ఆరుగురే విపక్షాలకు చెందిన వారు ఉంటారు. ఇది ప్యానెల్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. జేపీసీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించట్లేను. దాని కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రభావవంతంగా పనిచేయగలదు.
నిర్ణీత కాలావధిలో నివేదించగలదు’ అని పవార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సంస్థకు పవార్ మద్దతిస్తూ హిండెన్‌బర్గ్‌ను విమర్శించడం గమనార్హం. ‘అదానీ గ్రూప్‌పై అమెరికా కేంద్రంగా పనిచేసే చరిత్రలేని ఏదో సంస్థ మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రకటనలు, నివేదికలు గతంలోనూ పలు సందర్భాల్లో వచ్చాయి. ఇలాంటి వాటి కారణంగా తాజాగా పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీనికి అనవసర ప్రాధాన్యం ఇచ్చాం. నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతు సమస్యలు ఇలా దేశంలో ఎన్నో సమస్యలున్నాయి.
వాటిని వదిలేసి ఇలా అప్రధాన అంశాలను పట్టించుకుంటే ఇవి దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. వీటిని చూస్తుంటే కావాలనే ఏదో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అంశాలను లేవనెత్తుతున్నారు అనిపిస్తోంది ’ అని పవార్ వ్యాఖ్యానించారు. జేపీసీ పట్ల పవార్ విముఖత వ్యక్తంచేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘ ఈ అంశంలో 19 భావసారూప్య పార్టీలు ఒకే డిమాండ్‌తో ముందుకెళ్తున్నాయి. అయితే ఎన్‌సీపీకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు’ అని అన్నారు. పవార్ అభిప్రాయం మహారాష్ట్రలో, దేశంలో విపక్షాల ఐక్యతకు బీటలు పడేలా చేయలేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment