
న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వోద్యోగం పొందేందుకు వాటిని హక్కుగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఈ మేరకు వెలువరించింది.
‘‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగి మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దన్నది మాత్రమే కారుణ్య నియామకాల వెనక ఉన్న సదుద్దేశం. అందుకోసం సదరు నియామకానికి అవసరమైన నియమ నిబంధనలను విధిగా సంతృప్తి పరచాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది.