బేల శివారులో లేఅవుట్లలోని బండరాళ్లను తొలగింపజేస్తున్న అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ఇన్నాళ్లు గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 7 మండలాల్లో 9 బృందాలుగా ఏర్పడి అనుమతిలేకుండా వేసిన లేఅవుట్లలోని హద్దురాళ్లను గురువారం తీసేయించారు. ఇలాంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనరాదని బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 130 అక్రమ లేఅవుట్లను గుర్తించగా.. డీటీసీపీ అనుమతులున్నవి కేవలం 6 మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ లేఅవుట్లు అత్యధికంగా జిల్లా కేంద్రం పరిధిలో 90 వరకు ఉండగా, మిగతావి ఆయా మండలాల పరిధిలో ఉన్నాయి. కాగా ఆదిలాబాద్ మండలంలో మూడు అధికార బృందాలు ఈ లేఅవుట్లలోని హద్దురాళ్లను తొలగింపజేశారు. నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, జైనథ్, బేల మండలాల్లో ఒక్కో అధికార బృందం ఈ లేఅవుట్లలోని రాళ్లను తీసేయించింది. ఈ లేఅవుట్లు పట్టా భూముల్లో ఉండగా, ఆదిలాబాద్ మండలంలో 10 చోట్ల ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోనూ ఉండటం గమనార్హం. దీంతోపాటు మావల శివారు పరిధిలోని బడా రియల్ వ్యాపారుల భూముల జోలికి వెళ్లకుండా అధికారులు దూరంగా ఉన్నట్లు తెలిసింది.
నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 అమలులో భాగంగా నిబంధలన ప్రకారం అనుమతి లేని లేఅవుట్లలో ఈ బండరాళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి కఠినమైన నియమ, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పంచాయతీల పరిధిలో అక్రమంగా లేఅవుట్లు వేసినా, పంచాయతీ పాలకవర్గాలు అనుమతులు జారీ చేసినా చర్యలు తీసుకుంటారు. ఇక నుంచి..ఇంతకాలం మున్సిపాలిటీల పరిధిలోనే ఈ లేఅవుట్లతోపాటు ప్రస్తుతం వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ఆయా మండల కేంద్రాలు, అక్కడక్కడ అంతర్రాష్ట్ర రహదారిని అనుకుని గ్రామ పంచాయతీల్లో కూడా వేసిన లేఅవుట్లకు సైతం చెక్ పడనుంది.
నూతన పంచాయతీరాజ్ చట్టం కఠినతరం
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. దీంతో ‘పంచాయతీ’ల్లోనూ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది. కాగా గతంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ లేఅవుట్‌కు నిర్ణయించినదే అనుమతిగా పరిగణించబడేది. ఇప్పుడు గతంలో లాగా కాకుండా నూతన చట్టంలోని 113 సెక్షన్ ప్రకారం సాంకేతిక అనుమతి, అధికారి అనుమతి లేకుండా లేఅవుట్ చేయరాదని, ఒకవేళ మంజూరు చేస్తే ఈ చట్టం సెక్షన్ 268 కింద గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేయవచ్చని పేర్కొనబడింది.
అనుమతులు తప్పనిసరి..
గ్రామ పంచాయతీల్లో అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాల కింద వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలకు, వ్యాపారాలకు, ఇతరత్ర వాటికి వినియోగించాలనుకుంటే వ్యవసాయ భూమి చట్టం కింద ముందుగా నాలా రుసుము చెల్లించాలి. భూమి మార్పిడి ఆర్డీవో నుంచి అనుమతులు పొందాలి.
ఆ తర్వాతనే లేఅవుట్ ప్రతిపాదన దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో గ్రామ పంచాయతీకి అందజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను బాధ్యతగా గ్రామ పంచాయతీ వారు జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్ అనుమతి జారీ చేసే ప్రాధికార సంస్థకు పంపించాలి. ఇలా వారం రోజుల వ్యవధి పడుతుంది. ఇందులో కమర్షియల్‌గా మార్చే భూమి రెండున్నర ఎకరాలైతే జిల్లా స్థాయిలో, ఐదు ఎకరాలలోపు అయితే రీజనల్ స్థాయి, ఆపైన అయితే రాష్ట్రస్థాయి ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి అనుమతులు పొందాలి. గడువులోపు గ్రామ పంచాయతీ ఏ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాలని నూతన చట్టంలో పేర్కొనబడింది. డీటీసీపీ ఆదేశాలు లేకుండా లేఅవుట్‌కు అనుమతులు ఇస్తే, పంచాయతీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
లేఅవుట్ ఆమోదం కోసం కనీస నిబంధనలు ఇలా..
ముందుగా నాలా అనుమతి తీసుకుని ఈ లేఅవుట్ వేయదలిచిన మొత్తం స్థలంలో కనీసం 10శా తం ఖాళీ స్థలాన్ని పాఠశాలతోపాటు గుడి, పార్కు, ఇతరత్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తప్పకుండా విడిచిపెట్టాలి. ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇంతేకాకుండా ప్రజాప్రయోజనాల కోసం అంటే 40 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారి, 33 అడుగుల వెడల్పుతో అంతర్గత రహదారులు, మురికికాలువలు, తదితర వాటికోసం మరో 15శాతం కేటాయించాలి. అప్పుడు లేవుట్‌కు అనుమతి లభిస్తుంది. లేఅవుట్ ఉంటేనే సబ్‌రిజిస్ట్రార్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేస్తారు.
నెలలోపు అనుమతులు..
ప్రతిపాదించిన భూమిని సర్వే చేసి, అప్పుడు డ్రెయినేజీలు, తాగునీటి వ్యవస్థ, రహదారులు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లేఅవుట్ నిర్వాహకులకు సూచిస్తుంది. లేఅవుట్ పరిధిలోని స్థలాలను, రహదారులను పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత జిల్లా టౌన్, కంట్రీప్లానింగ్(డీటీసీపీ) నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. అనుమతులు జారీ చేసి, ప్రతిపాదనలను నివేదికను రెవెన్యూ, గ్రామ పంచాయతీలకు పంపుతారు. దానిపై గ్రామ పంచాయతీ సమావేశం జరిపి, తీర్మానం చేసి ఆమోదించాలి. లేఅవుట్‌లో గ్రామ పంచాయతీకి, ప్రజాప్రయోజనాల కోసం కేటా యించిన మొత్తం 25శాతం స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే, చట్ట ప్రకారం లేఅవుట్ నిర్వాహకులు(భూయజమాని)పై కఠిన చర్యలు తీసుకుంటారు.
అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనద్దు
అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దు. నియమ, నిబంధనలను పాటిస్తూ లేఅవుట్లకు డీటీసీపీ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. లేదంటే ఆ లేఅవుట్ చెల్లదు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో నిబంధల ప్రకారం అనుమతి లేని 4 లేఅవుట్లలో రాళ్లు తొలగింపజేశాం. ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రెవెన్యూశాఖ నుంచి నాలా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేని లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు.
– మహేందర్‌కుమార్, బేల ఎంపీడీవో
Comments
Please login to add a commentAdd a comment