Published
Thu, May 15 2014 2:08 AM
| Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
నిబంధనల ప్రకారమే విభజన
ఆర్టీసీ కార్మిక సంఘాలకు విభజన కమిటీ వివరణ
అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్తులపై సీమాంధ్రకు వాటా కల్పించే విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ కార్మిక సంఘాలతో బుధవారం ఆర్టీసీ విభజన కమిటీ సమావేశమైంది. నగరంలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్, ఆర్టీసీ ఆసుపత్రి, ప్రింటింగ్ ప్రెస్, బస్‌బాడీ కేంద్రం.. తదితర స్థిరాస్తులపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉంటున్నందున వాటి విలువలో సీమాంధ్రకు వాటా ఇస్తే మెరుపు సమ్మెకు దిగుతామంటూ తెలంగాణ ప్రాంత కార్మిక సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అయితే తమ ముందుంచిన విధివిధానాల మేరకే ఆస్తుల పంపణీ పూర్తి చేశామని కమిటీ ప్రతినిధులు కార్మిక సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆస్తులుగా తాము పేర్కొన్న వాటి విషయంలో భవిష్యత్తులో రెండు రాష్ట్రప్రభుత్వాలు చర్చించుకుని, తీసుకున్న నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు వారికి వివరించారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడిగా ఉండనున్నందున వాటిని ఇరు ప్రాంతాల సిబ్బంది వినియోగించుకుంటారని, సీమాంధ్రకు పూర్తిస్థాయి రాజధాని ఏర్పడ్డ తర్వాతే వాటి విలువ చెల్లించాల్సి ఉన్నందున, ఆప్పడు రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి తదుపరి చర్యలు ఉంటాయని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం.
ఆసుపత్రి, ప్రింటింగ్‌ప్రెస్, ఇతర సేవలు పొందినందుకు సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ్రపభుత్వానికి రుసుము చెల్లించేలా నిబంధన విధించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై తాము హామీ ఇవ్వలేమని, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వటంతో కార్మిక నేతలు వెనక్కు తగ్గారు. అయితే, నివేదికను గురువారం యథాతథంగా ఆర్టీసీ బోర్డు ముందుంచితే మాత్రం సమ్మె తప్పదని కార్మిక నేతలు మరోసారి హెచ్చరించారు.