సిటీ బస్సుల్లోనూ ‘స్వైపింగ్‌’ | swiping missions will going to issue on city busses | Sakshi
Sakshi News home page

సిటీ బస్సుల్లోనూ ‘స్వైపింగ్‌’

Published Wed, Dec 7 2016 4:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సిటీ బస్సుల్లోనూ ‘స్వైపింగ్‌’ - Sakshi

సిటీ బస్సుల్లోనూ ‘స్వైపింగ్‌’

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ ఆర్టీసీలో త్వరలో స్వైపింగ్‌ మిషన్ లు అందుబాటులోకి  రానున్నాయి. అన్ని రకాల క్రెడిట్, డెబిట్‌ కార్డుల  ద్వారా  ప్రయాణికులకు  రవాణా సదుపాయాన్ని  అందజేసేందుకు  ఆర్టీసీ  చర్యలు  చేపట్టింది. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌  బస్‌స్టేషన్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు  నగరంలోని సిటీ బస్సుల్లో  సైతం స్వైపింగ్‌ ఆధారిత  టిక్కెట్‌  ఇష్యూయింగ్‌ (టిమ్స్‌) మిషన్లను  ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు  చేపట్టారు.

ఈ  దిశగా  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌తో  పాటు మరికొన్ని బ్యాంకులతోనూ  సంప్రదింపులు  ప్రారంభించినట్లు  ఆర్టీసీ  గ్రేటర్‌  హైదరాబాద్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌  పురుషోత్తమ్‌  ‘సాక్షి’తో  చెప్పారు. ఈ  నెల  15 కల్లా  మొదటి  విడుత  స్వైపింగ్‌ సేవలను  అందుబాటులోకి  తెచ్చేందుకు  ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన మార్గాలతో పాటు, బస్‌పాస్‌ కేంద్రాల్లో  కూడా స్వైపింగ్‌  సేవలను  ఏర్పాటు చేస్తారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆక్యుపెన్సీ రేషియో పడిపోయింది. 

తీవ్రమైన నష్టాల్లో  కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీ  మరిన్ని నష్టాలను మూటగట్టుకోవలసి వచ్చింది. ప్రజల వద్ద చిల్లర అందుబాటులో లేకపోవడం, పెద్ద నోట్లు రద్దు కావడం,కొత్తవి  డిమాండ్‌కు అనుగుణంగా  అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాల  దృష్ట్యా  ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. ఆక్యుపెన్సీ రేషియే  69 శాతం నుంచి 65 శాతానికి పడిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా  4 శాతం ఓఆర్‌ తగ్గిపోవడంతో  ఆర్టీసీ  గ్రేటర్‌ అధికారులు ఆలస్యంగానైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

బస్‌పాస్‌ కేంద్రాల్లో మొదట ఏర్పాటు...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో 8 లక్షల స్టూడెంట్‌ బస్‌పాస్‌లు, మరో 4 లక్షల సాధారణ బస్‌పాస్‌లు ఉన్నాయి. ఈ బస్‌పాస్‌లపైనే ఆర్టీసీకి ఏటా రూ.20 కోట్ల ఆదాయం లభిస్తుంది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఒక్కసారిగా రెన్యూవల్స్‌ పడిపోయాయి. చాలామంది రెగ్యులర్‌  ప్రయాణికులు తమ పాస్‌లను పునరుద్ధరించుకొనేందుకు వెనుకడుగు వేశారు. మొదట్లో పాత  రూ.500, రూ.1000 నోట్లను కేవలంటిక్కెట్‌లకు మాత్రమే పరిమితం చేసి పాస్‌లకు నిరాకరించారు.

దీంతో చాలామంది రెన్యూవల్‌  చేసుకోలేపోయారు. పెద్ద నోట్లను రద్దు చేసిన 15 రోజుల తరువాత బస్‌పాస్‌లకు సైతం పాతవాటిని స్వీకరించనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. కానీ అప్పటికే చాలా నష్టం జరిగింది. పెద్ద నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు కేవలం బస్‌పాస్‌లపైనే  రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ  నష్టాలను అధిగమించేందుకు  నగరంలోని  అన్ని బస్‌పాస్‌ కౌంటర్‌లలో త్వరలో స్వైపింగ్‌ మిషన్లను  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో సికింద్రాబాద్‌ రెతిఫైల్‌ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, కోఠీ, చార్మినార్, వీఎస్‌టీ, సనత్‌నగర్, హయత్‌నగర్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లోని ప్రధాన కేంద్రాల్లో  స్వైపింగ్‌ సేవలను అందుబాటులోకి తెస్తారు. దశలవారీగా గ్రేటర్‌లోని 63 కౌంటర్‌లకు విస్తరించనున్నారు.

రిజర్వేషన్ కేంద్రాల్లో ఇలా...
మహాత్మాగాంధీ,జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్లలోని  ఆన్ లైన్  ప్యాసింజర్‌ రిజర్వేషన్  సిస్టమ్‌(ఓపీఆర్‌ఎస్‌)  కౌంటర్‌లలో  కూడా  30 స్వైపింగ్‌  యంత్రాలను  ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్రెడిట్, డెబిట్‌ కార్డుల  ద్వారా   ప్రయాణికులు  ఇక్కడ నుంచి టిక్కెట్‌లు రిజర్వ్‌  చేసుకోవచ్చు. సిటీ నుంచి ప్రతి  రోజు 3500 బస్సులు  తెలంగాణ, ఏపీ, ముంబయి, చెన్నై, బెంగళూర్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. 1.3 లక్షల మంది  ప్రయాణికులు ఒక్క ఎంజీబీఎస్‌ నుంచే బయలుదేరుతారు.

నోట్ల రద్దు తరువాత  దూరప్రాంతాలకు వెళ్లే  బస్సుల్లోనూ  ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. దీంతో  స్వైపింగ్‌ యంత్రాల ద్వారా  ప్రయాణికులను తిరిగి ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. మరోవైపు  నగరంలో  ఇప్పుడు  వినియోగిస్తున్న టిమ్స్‌ యంత్రాలకు స్వైపింగ్‌ మిష¯ŒSలను జోడించి  క్యాష్‌లెస్‌ సేవలను  అందుబాటులోకి తేనున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement