అయ్యో.. ఆర్టీసీ! | rtc in loss due to cancelation of big notes | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఆర్టీసీ!

Published Wed, Nov 16 2016 12:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

అయ్యో.. ఆర్టీసీ! - Sakshi

అయ్యో.. ఆర్టీసీ!

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌ ఆర్టీసీని సైతం కరెన్సీ కష్టాలు చుట్టుముట్టాయి. ప్రతి రోజు లక్షలాది మంది  ప్రయాణికులకు  రవాణా సదుపాయాన్ని అందజేసే అతి పెద్ద  ప్రజా రవాణా సంస్థ  చిల్లర సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతోంది. అటు ప్రయాణికుల వద్ద, ఇటు ఆర్టీసీలోనూ  చిల్లర కొరత నెలకొనడంతో   గత  వారం రోజులుగా    ప్రయాణికుల సంఖ్య గణనీయంగా  తగ్గింది.  సగటున  ప్రతి రోజు  34 లక్షల  మంది సిటీ బస్సుల్లో  పయనిస్తుండగా  ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా  30  లక్షలకు పడిపోయింది.

జేబులో చిల్లర ఉంటే తప్ప బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ  ఆదాయంతోపాటు ఆక్యుపెన్సీపైన  తీవ్ర ప్రభావం పడింది. ప్రతి రోజు 15 నుంచి  20 శాతం వరకు ఆదాయం తగ్గినట్లు  అంచనా. ఆక్యుపెన్సీ రేషియో సైతం 68 శాతం నుంచి  65కు పడిపోయినట్లు ఆర్టీసీ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వారం రోజుల్లోనే  అనూహ్యమైన రీతిలో  ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అసలే గత రెండేళ్లుగా తీవ్రమైన నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీకి రూ.500, రూ.1000 నోట్ల రద్దు పిడుగు పాటుగా మారింది.

రోడ్లు కొద్దిగా బాగుపడ్డాయనుకొంటే....
నగరంలో  కురిసిన వర్షాల కారణంగా రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో  వివిధ మార్గాల్లో  ఆర్టీసీ ట్రిప్పులు  తగ్గాయి. ఇటీవల పలు మార్గాల్లో రోడ్లకు మరమ్మతులు  చేయడంతో  సిటీ బస్సుల స్పీడ్‌ పెరిగింది. అలాగే  ట్రిప్పుల రద్దు  కూడా తగ్గింది. మెట్రో రైల్‌ నిర్మాణ పనులు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా  రోజుకు  10 వేల వరకు ట్రిప్పులు రద్దయ్యాయి. తాజాగా  రోడ్ల పరిస్థితి మెరుగుపడడంతో  ట్రిప్పుల సంఖ్య పెరిగింది. నగరంలోని  సుమారు 1050  రూట్లలో  3850  బస్సులు  రోజుకు  42 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి.

కండక్టర్లు,.డ్రైవర్ల గైర్హాజరు, బస్సుల బ్రేక్‌ డౌన్స్ వంటి సాంకేతిక కారణాల వల్ల  సగటున  2 శాతం నుంచి  5 శాతం  వరకు సహజంగానే ట్రిప్పులు రద్దవుతాయి.  అధ్వాన్నపు రోడ్ల కారణంగా పెద్ద సంఖ్యలో ట్రిప్పులు రద్దు కావడంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఆర్టీసీ ఆదాయం పైనా  ప్రభావం పడింది. రోడ్లు మెరుగుపడుతున్న క్రమంలో  ట్రిప్పులు పెరిగాయి. కానీ అనూహ్యంగా వచ్చిపడ్డ  నోట్ల రద్దు మరోసారి ఆర్టీసీపై పెనుప్రభావాన్ని చూపింది.

రూ.1.26 కోట్ల నష్టం
గత సంవత్సరం నవంబర్‌ నెల 15వ తేదీ వరకు గ్రేటర్‌  ఆర్టీసీకి రూ. 10.41 కోట్ల  ఆదాయం లభించగా, ఈ నెల  ఒకటో తేదీ నుంచి  15వ తేదీ  వరకు  రూ.9.15 కోట్ల  ఆదాయం మాత్రమే లభించింది. అంటే  15 రోజులలో  రూ.కోటీ  26 లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. అందులో ఎక్కువ శాతం ఈ వారం రోజుల్లోనే  చవి చూసినట్లు  అధికారులు  పేర్కొంటున్నారు.

ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి, ఆక్యుపెన్సీ రేషియో పడిపోవడం వల్ల  ప్రతి రోజు  15 శాతం వరకు ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని  ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తమ్‌  ‘సాక్షి’తో అభిప్రాయడ్డారు. ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉన్న తమకు ఇది మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుందన్నారు. ప్రజలకు చిల్లర అందుబాటులోకి వచ్చే వరకు  పరిస్థితిలో మార్పు రాకపోవచ్చునన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement