సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రూ.10 వేల కోట్ల నష్టాల మార్కును దాటిపోయింది. గతేడాది డిసెంబర్ నాటికే నష్టాలు రూ.10,762 కోట్లకు చేరగా, జనవరి కూడా కలిపితే ఆ మొత్తం రూ.11 వేల కోట్లకు చేరినట్లు తాజాగా క్రోడీకరించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే సంస్థ నష్టాలతో పరుగుపెడుతోంది. రాష్ట్రం విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసిన 2015 మార్చి 31 నాటికి టీఎస్ ఆర్టీసీ రూ.299.64 కోట్ల నష్టాలతో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరమే కావటంతో, ఆ నష్టాలు తాత్కాలిక మే అన్న భావన వ్యక్తమైంది.
కానీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నష్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఎనిమిదేళ్లలో ఒక్క 2022లోనే తక్కువ నష్టాలు నమోదయ్యాయి. గత ఏడాది చివరలో డీజిల్ సెస్‌ను ప్రారంభించటం, నెల రోజుల్లోనే దాన్ని సవరించి మళ్లీ పెంచటం, ఆదాయం పెంచేందుకు చేపట్టిన రకరకాల చర్యలు, ఖర్చును తగ్గించటం, ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై దృష్టి.. వెరసి నష్టాలు బాగా తగ్గాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.473 కోట్లు రికార్డయ్యాయి. ఇదే నష్టాల్లో అత్యుత్తమ గణాంకం కావడం గమనార్హం.
భారీ వేతన సవరణతో..
ఆర్టీసీలో 2013లో జరగాల్సిన వేతన సవరణ 2015లో జరిగింది. కార్మికులు అడిగిన దాని కంటే ఎక్కువగా ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. భారీగా జీతాల పెంపుతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల మేర కొత్త భారం పడింది. కానీ అదనపు ఆదాయం పెంపు దిశగా అధికారులు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం కూడా పర్యవేక్షణను పట్టించుకోకపోవటంతో నష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ.1,150 కోట్ల నష్టం వచ్చింది. ఇది అప్పటివరకు ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద నష్టంగా నమోదయ్యింది. ఉమ్మడి ఆరీ్టసీలో కూడా (రెండు ఆర్టీసీలు కలిపి) ఎప్పుడూ ఇంత నష్టం రాలేదు. ఆ వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో సగం ఇంకా చెల్లించలేదు. బాండ్ల రూపంలో చెల్లించాల్సిన రూ.288 కోట్ల మొత్తమూ అలాగే ఉంది. అది చెల్లిస్తే నష్టాల కుప్ప మరింత పెరుగుతుంది.
సమ్మెతో కోలుకోని స్థితికి..
2019లో ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద సమ్మె జరిగింది. కారి్మకులు ఏకంగా 52 రోజుల పాటు బస్సుల్ని స్తంభింపజేశారు. ఫలితంగా 2019–20లో రూ.1,002 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఆ వెంటనే కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లు బస్సులు సరిగా తిరగలేదు. దీనివల్ల కూడా నష్టాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 35 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మరో 20 డిపోలు బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యాయి. మిగతా డిపోల్లో నష్టాలు తగ్గాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఏప్రిల్ నాటికి కొత్త నష్టాలు పూర్తిగా నియంత్రణలోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. కానీ పరిస్థితి అంత సులభంగా మారేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం డీజిల్ సెస్ పెంపు వల్ల మాత్రమే నష్టాలు తగ్గాయన్నది సుస్పష్టం కాగా ఇప్పటికీ ప్రత్యామ్నాయ ఆదాయం పెరగక పోవడం గమనార్హం.
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు...
ఇటీవల నష్టాల లెక్కలను ఆర్టీసీ ప్రభుత్వం ముందుంచింది. ఆరీ్టసీకి రావాల్సిన బకాయిలు, సీసీఎస్, పీఎఫ్‌లకు చెల్లించాల్సిన మొత్తాలపై నివేదిక అందించింది. అయితే గతేడాది బడ్జెట్‌లో ఆరీ్టసీకి రూ.1,500 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ తాజా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కొత్త బడ్జెట్‌లో ఎక్కువ నిధులు వస్తాయని ఆశించినా, మళ్లీ అంతేమొత్తాన్ని ప్రతిపాదించటంతో సందిగ్ధత ఏర్పడింది.
నష్టాలు మరింత తగ్గిస్తాం
ఇటీవలి కొన్ని నిర్ణయాలతో ఆర్టీసీ నష్టాలను భారీగా తగ్గించగలిగాం. మరింత తగ్గించేందుకు చర్యలు చేపడతాం. డీజిల్ సెస్, సేఫ్టీ సెస్ లాంటివి సంస్థ ఆదాయాన్ని పెంచాయి. ఇక ప్రభుత్వం తన వంతుగా ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్లు ఇస్తోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవటంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవి కూడా వస్తే ఆరీ్టసీకి మరింత సాయం అందేది. పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు రానున్నందున ఆదాయం కొంత పెరిగే వీలుంది.
– బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment