ఆర్టీసీకి డీజిల్‌ పోటు | RTC Loss With Diesel Prices Hikes | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి డీజిల్‌ పోటు

Published Fri, May 11 2018 12:53 PM | Last Updated on Fri, May 11 2018 12:53 PM

RTC Loss With Diesel Prices Hikes - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2016–17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని 17–18 ఆర్థిక సంవత్సరంలో తగ్గించుకోగలిగినప్పటికీ డీజిల్‌ ధర కారణంగా లాభాల బాటలోకి మాత్రం రాలేకపోతోంది. అత్యంత ధనికవర్గాలు ప్రయాణించే విమాన ఇంధనంపై ఒక శాతం పన్ను విధిస్తుంటే సామాన్య ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ ఇంధనమైన డీజిల్‌పై దాదాపు 66 శాతం పన్ను వసూలు చేస్తుండడంతో ఆర్టీసీ నిర్వహణ భారంగా పరిణమించి నష్టాలు కొనసాగుతున్నాయి.

అంచెలంచెలుగా పెరిగిన డీజిల్‌ ధర
2016 –17 ఆర్థిక సంవత్సరంలో రూ.58.98 ఉన్న డీజిల్‌ ధర 2017 – 18 ఆర్థిక సంవత్సరంలో అంచెలంచెలుగా పెరిగింది. మొత్తం మీద ఈ ధర లీటరుకి రూ. 66.20కి చేరుకుంది. అంటే రూ.7.22 ఆర్టీసీ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రజా రవాణా కోసం ప్రయాణికులు ఉన్నా లేకపోయినా తిరగాల్సిన బస్సులు తిరుగుతుండగా ఆదాయం వచ్చినా రాకపోయినా డీజిల్‌ వినియోగం మాత్రం తగ్గడంలేదు. దీనితో ఆర్టీసీపై పెనుభారమే పడుతోంది. పశ్చిమరీజియన్‌ పరిధిలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, భీమవరం, నరసాపురం, నిడదవోలు డిపోల నుంచి నిత్యం 615 బస్సులు ప్రయాణికులను వారివారి గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. ఈ క్రమంలో ఆ బస్సులన్నీ కలిపి రోజుకు సుమారు 2.24 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. అంటే లీటరుకు సుమారు 5.40 కిలోమీటర్ల దూరం తిరిగే బస్సులు రోజుమొత్తం మీద సుమారు 41,500 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నాయి.

నిర్వహణ వ్యయం రూ.75 లక్షలు – ఆదాయం రూ.65 లక్షలు
పశ్చిమ ఆర్టీసీకి ప్రస్తుతం నిర్వహణ వ్యయం రోజుకు రూ.75 లక్షలు అవుతుండగా, ఆదాయం రోజుకు రూ.65 లక్షలు మాత్రమే వస్తోంది. దీనిలో కార్మికులు, ఉద్యోగుల జీత భత్యాలు సింహభాగం వహిస్తుండగా గ్యారేజ్‌లో మరమ్మతులకు వినియోగించే స్పేర్‌ పార్టులు, ఇతర ఖర్చులు ఉంటున్నాయి. ఇక డీజిల్‌కు మాత్రమే సుమారు రూ.27 లక్షల 50 వేల వరకూ వ్యయమౌతోంది. కాగా డీజిల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న ధర మాత్రమే ఉంటే ఆర్టీసీకి కేవలం రూ.24 లక్షల 50 వేలు మాత్రమే ఖర్చు అయ్యేది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ ఆర్టీసీకి రూ.41 కోట్లు నష్టం రాగా 2017 –18 ఆర్థిక సంవత్సరంలో రూ.27 కోట్లుకు తగ్గింది.అయితే డీజిల్‌ ధర పెరిగినా ఆర్టీసీ అధికారులు తమ స్థలాలను లీజుకు ఇవ్వడం, కార్గో సేవలను ప్రారంభించడం వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవడంతో నష్టాలు తగ్గాయి.

డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ప్రస్తుతం డీజిల్‌పై ఉన్న 66 శాతం పన్ను 28 శాతానికి లోపు మాత్రమే పడుతుంది. దీనితో డీజిల్‌పై పెట్టే ఖర్చు దాదాపు సగం మేర తగ్గిపోతుంది. దీనికితోడు ఆయిల్‌ కార్పొరేషన్లపై ప్రభుత్వం పూర్తి నియంత్రణతో కట్టుదిట్టం చేసినా తరచూ పెరిగే ధరలు నిలకడకు వస్తాయి. ఇంధనంపై రాష్ట్రాలు పన్ను తగ్గిస్తే ఏర్పడే నష్టాన్ని కేంద్రం భరించాలి. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారమే దేశంలో ఇంధన ధరలు నిర్ణయించాలి.– టి.పట్టాభిరాం దొర, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రీజనల్‌ కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement