కొయ్యలగూడెంలో బస్సు డ్రైవర్, స్థానికులతో చింతమనేని అనుచరుల వాగ్వివాదం
పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు స్థానిక మెయిన్ సెంటర్‌లో ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ఢీకొట్టి, ఆర్టీసీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్న గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గణేష్ సెంటర్‌లో జంగారెడ్డిగూడెం వైపునకు వెళుతోంది. ఆ సమయంలో చింతమనేని అనుచరులు జీపులో వస్తూ బస్సుకు కుడివైపుగా ఓవర్ టేక్ చేస్తూ వేగంగా బస్సును ఢీకొట్టారు. వాహనం ఆపకపోగా కొద్ది దూరం వెళ్లడంతో సెంటర్‌లో ఇది గమనించిన యువకులు జీపును ఆపారు. యువకులకు, జీపులోని చింతమనేని అనుచరులకు వాగ్వివాదం చోటు చేసుకుంది.
చింతమనేని అనుచరులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై తమ జులుం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌టేక్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని బస్సుకు కలిగిన నష్టాన్ని భరించాలని ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు చింతమనేని అనుచరులకు చెప్పడంతో వారు ఘర్షణకు దిగారు. చెక్‌పోస్టు సెంటర్‌లోని కొందరు టీడీపీ నాయకులు చింతమనేని అనుచరులకు వత్తాసు పలకడంతో గొడవ తీవ్ర రూపం దాల్చి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు.చివరకు రెండు వర్గాల మధ్య రాజీ కుదరడంతో ఏ విధమైన కేసు నమోదు చేయలేదు. చింతమనేని అనుచరులకు అనుకూలంగా పై స్థాయి నుంచి ఫోన్ రావడంతో పాటు ఆర్టీసీ అధికారులు సైతం ప్రమాదానికి లోనైన బస్సు సిబ్బందితో చర్చించి గొడవను సర్దుబాటు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment