ఎలక్ట్రిక్ బస్సులుగా పాత డీజిల్ బస్సులు
మార్చేందుకు ఆర్టీసీ మళ్లీ ప్రయత్నాలు
రెండేళ్ల నాటి ప్రణాళికకు తిరిగి ప్రాణం
రెట్రో ఫిట్‌మెంట్ పాలసీ కోసం కేంద్రానికి లేఖ
తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు లభిస్తాయని సూచన
సాక్షి, హైదరాబాద్: ఖర్చులు తగ్గించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) అన్ని మార్గాలను వెదుకుతోంది. ఇంధన భారం తడిసి మోపెడవుతుండటంతో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుచూపింది. ఆ బస్సులుఖరీదైనవి కావటంతో అద్దెకు తీసుకొని నడుపుతోంది.
అదే సమయంలో సంస్థకు గుదిబండగా మారుతున్న పాత డీజిల్ బస్సులనూ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రెట్రో ఫిట్‌మెంట్ టెక్నాలజీ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చటానికి రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. కానీ, ప్రభుత్వం స్పందించకపోవటంతో తాజాగా కేంద్రం తలుపు తట్టింది. రెట్రో ఫిట్‌మెంట్‌కు ఆర్థిక సాయం చేయాలని లేఖ రాసింది.
ఆ ప్రయోగం సక్సెస్..
డీజిల్ వ్యయాన్ని భరించలేక ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపాలని మూడేళ్ల క్రితం ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం కింద 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసింది. వాటిని ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు నడుపుతోంది. ఆ సమయంలో ఒక్కో బస్సు ధర రూ.2 కోట్ల వరకు ఉండటంతో సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనటం సాధ్యం కాదని చేతులెత్తేసింది.
రెట్రో ఫిట్‌మెంట్ ద్వారా రూ.60 నుంచి రూ..65 లక్షలతోనే డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చవచ్చని గుర్తించి, అందుకోసం టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ రైల్ లోకోమోటివ్‌లు తయారు చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ రెట్రో ఫిట్‌మెంట్‌కు ఆసక్తి చూపింది.
శాంపిల్‌గా ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక బస్సును ఆ సంస్థ రెట్రో ఫిట్‌మెంట్ చేసి ఇచ్చింది. ప్రస్తుతం అది ఉప్పల్ డిపో పరిధిలో తిరుగుతోంది. ఈ ప్రాజెక్టు భారాన్ని మొత్తం మోయలేనని భావించిన ఆర్టీసీ.. రేండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. ప్రభుత్వం కూడా సాయం చేయలేనని చేతులెత్తేయటంతో ప్రాజెక్టు అంతటితో ఆగిపోయింది.
కేంద్రం వైపు ఆర్టీసీ చూపు
నగరంలో డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఈ–డ్రైవ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాలకు 11 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయాలని నిర్ణయించింది.
వాటిలో తనకు 2,500 బస్సులు కావాలని ఆర్టీసీ దరఖాస్తు చేసుకుంది. పనిలో పనిగా రెట్రో ఫిట్‌మెంట్ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్రి్టక్ బస్సులుగా మార్చేందుకు కూడా ఓ విధానం ప్రకటించాలని లేఖ రాసింది. రెట్రో ఫిట్‌మెంట్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా తిరుగుతున్న బస్సును ఉదహరించింది. ఈ లేఖపై కేంద్రం ఇంకా స్పందించలేదు. కేంద్రం గనుక రాయితీ పద్ధతిలో రెట్రో ఫిట్‌మెంట్‌కు పాలసీ అందుబాటులోకి తెస్తే, ఆర్టీసీ వద్ద ఉన్న పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి నిర్వహించేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది.
కొత్త ఎలక్ట్రిక్‌బస్సు ఖరీదు రూ.1.50కోట్లు
పాత డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేందుకు అయ్యే వ్యయం రూ.60 లక్షలు
డీజిల్ బస్సుఖర్చు కి.మీ.కు రూ.20
ఎలక్ట్రిక్ బస్సుకు అయ్యే వ్యయం రూ.6
Comments
Please login to add a commentAdd a comment