తిరుపతి ప్రయాణం వాయిదా! | TTD Samprokshanam Effect On RTC And Railway Bookings | Sakshi
Sakshi News home page

‘సంప్రోక్షణ’ ఎఫెక్ట్‌

Published Wed, Aug 15 2018 7:48 AM | Last Updated on Mon, Oct 8 2018 4:55 PM

TTD Samprokshanam Effect On RTC And Railway Bookings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయే తిరుపతి రైళ్లు, బస్సుల్లో రద్దీ తగ్గిపోయింది. మహా సంప్రోక్షణ ప్రభావంతో నగరవాసులు తిరుపతి ప్రయాణం వాయిదా వేసుకోగా.. చాలామంది రద్దు చేసుకున్నారు. తిరుపతి సమీప ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారు, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం, ఇతర పనులపై తిరుపతి వైపు వెళ్లే వారు మినహా భక్తుల రద్దీ మాత్రం తగ్గిపోయింది. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి తిరుపతికి తిరిగే రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు గణనీయంగా తగ్గింది. ప్రతిరోజు 150 నుంచి 180 వరకు వెయిటింగ్‌ లిస్టుతో దర్శనమిచ్చే నారాయణాద్రి, వెంకటాద్రి వంటి రైళ్లలో రెండు రోజుల క్రితం ప్రయాణికులు అప్పటికప్పుడు స్లీపర్‌ క్లాస్‌ బెర్తులు (కరెంట్‌ బుకింగ్‌) బుక్‌ చేసుకొని మరీ వెళ్లడం తగ్గిన రద్దీకి అద్దం పడుతోంది. మహా సంప్రోక్షణ పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆ తరువాత ఒక్కసారిగా రద్దీ పెరిగే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఈ నెల 16వ తేదీ మహా సంప్రోక్షణ అనంతరం బయలుదేరే రైళ్లలో మాత్రం వెయిటింగ్‌ లిస్టు వందల్లోనే కనిపించడంగమనార్హం. 

రెగ్యులర్‌ రైళ్లకూ తగ్గిన డిమాండ్‌
తిరుపతికి వెళ్లే అన్ని రైళ్లలోనూ సాధారణంగా ఒక బెర్తుకు 10 మంది ప్రయాణికులు ఎదురు చూస్తారు.  కానీ మహా సంప్రోక్షణ నేపథ్యంలో ఒక సీటుకు ఒకరు మాత్రమే ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. దీంతో పలు రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు బాగా తగ్గిపోయింది. నగరం నుంచి ప్రతి రోజు ఆరు రైళ్లు రెగ్యులర్‌గా తిరుపతి వెళ్తాయి. మరో నాలుగు హైదరాబాద్‌ నుంచి తిరుపతి మీదుగా ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి.

నాగర్‌సోల్‌–మద్రాస్, కాచిగూడ–మంగళూరు, శబరి ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చెంగల్పట్టు రైళ్లతో పాటు క్రిష్ణా, రాయలసీమ, సెవెన్‌హిల్స్, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రైల్లో సుమారు 1500 మంది రిజర్వేషన్‌ ప్రయాణికులు, మరో 300 మందికి పైగా జనరల్‌  ప్రయాణికులు ఉంటారు. సిటీ నుంచి బయలుదేరే రైళ్లలోనే ప్రతి రోజు సుమారు 18,000 మంది ఉంటారు. మరో 50 వేల మంది వెయిటింగ్‌ జాబితాలో ఉంటారు. ప్రస్తుతంసంప్రోక్షణ దృష్ట్యా వెయిటింగ్‌ జాబితా అన్ని రైళ్లలో కలిపి 10 వేల వరకు ఉంది. కొన్ని రైళ్లలో కరెంట్‌ బుకింగ్‌కు కూడా అవకాశం ఉండడం గమనార్హం. తిరుపతికి తిరిగే రైళ్లలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం చాలా అరుదని రైల్వే అధికారులు చెబుతున్నారు. 

బస్సుల్లోనూ అదే పరిస్థితి..  
తెలంగాణ ఆర్టీసీతో పాటు ఏపీఎస్‌ ఆర్టీసీ నుంచి ప్రతి రోజు 40 బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల నుంచి తిరుపతికి వెళుతుంటాయి. ఇంచుమించు ప్రైవేట్‌ బస్సులు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి. సంప్రోక్షణతో ఈ రెండు సర్వీసుల్లోనూ ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సాధారణంగా ప్రతిరోజు 3000 నుంచి 5000 మంది తిరుపతికి వెళుతుంటారు. ప్రస్తుతం ఈ సంఖ్య 1500 దాటలేదు. వీరిలోనూ తిరుపతి మీదుగా వెళ్లే వారు, చుట్టుపక్కల ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ముందస్తు బుకింగ్‌లు 30 శాతానికి పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న మొదలైన మహా సంప్రోక్షణ 16వ తేదీ వరకు కొనసాగుతుంది. అప్పటికి ఆర్టీసీ సుమారు రూ.30 లక్షల మేర ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement