కష్టకాలంలో గ్రేటర్‌ ఆర్టీసీ | RTC Losses With Heavy Maintenance In Hyderabad | Sakshi
Sakshi News home page

నష్టకష్టాలు

Published Fri, Aug 17 2018 10:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

RTC Losses With Heavy Maintenance In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ ఆర్టీసీ భారీ నష్టాల రూట్‌లో పరుగులు తీస్తోంది. వేలకొద్దీ బస్సులు, లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నా.. రోజుకు రూ.కోటి చొప్పున నష్టం వస్తోంది. ప్రయాణికులకు అందజేసే సేవల ద్వారా ప్రతిరోజు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుంటే.. ఖర్చు మాత్రం రూ.4.5 కోట్లు ఉంటోంది. ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు ఆర్టీసీపై పిడుగుపాటుగా మారాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గ్రేటర్‌ నష్టాలు రూ.426 కోట్లకు చేరుకోగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే మరో రూ.96 కోట్ల నష్టాలు వచ్చాయి. నష్టాల రూట్‌లో వెళుతున్న గ్రేటర్‌ ఆర్టీసీపై మెట్రో రైలు దూసుకొస్తోంది. దీంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది. 

నిపుణుల కమిటీకి సవాలు..
పీకల్లోతు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి సైతం గ్రేటర్‌ పరిణామాలు సవాల్‌గా మారాయి. ఈ నెల 10వ తేదీన బస్‌భవన్‌లో మొదటిసారి సమావేశమైన కమిటీ 21వ తేదీన మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీపైనే ప్రధానంగా సమీక్షించనున్నారు. ఈ కమిటీ ఆర్టీసీపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను  అందజేయాల్సి ఉంది. ఈ నివేదిక ఆర్టీసీలో జవసత్వాలను నింపి లాభాల దిశగా నడిపిస్తుందా.. మెట్రో రైలు వంటి ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థ ముందుకొస్తున్న తరుణంలో నష్టాల నివారణకు నిపుణుల కమిటీ ఎలాంటి పరిష్కారాలను చూపుతుందనేది వేచి చూడాలి. 

నష్టాలకు కారణాలు అనేకం..
తెలంగాణలో మొత్తం 10 వేలకు పైగా బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. సూపర్‌ లగ్జరీలు, డీలక్స్‌లు, గరుడ, ఇంద్ర వంటి ఏసీ, నాన్‌ ఏసీ దూరప్రాంతాల బస్సులన్నీ లాభాల బాటలో పరుగులు తీస్తుండగా పల్లెవెలుగు బస్సులు, సిటీ బస్సులు మాత్రం తీవ్రమైన నష్టాల్లో ఉన్నాయి. పైగా తెలంగాణ అంతటా రూ.274 కోట్ల మేర నష్టాలు నమోదు కాగా ఒక్క హైదరాబాద్‌లోనే ఇవి రూ.426 కోట్లకు చేరాయి. అంటే ఆర్టీసీ మొత్తంనష్టాల్లో ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీకి గ్రేటర్‌ ఆర్టీసీని గట్టెక్కించడమే ముఖ్యమైన సవాల్‌గా మారింది. కమిటీ తొలి సమావేశంలో జోన్ల వారీగా లాభనష్టాలపై గణాంకాలను సేకరించింది.

అన్ని జోన్లలో హైదరాబాద్‌ కీలకమైంది కావడం, పైగా నష్టాలు ఎక్కువగా ఇక్కడే ఉండడంతో 21వ తేదీన గ్రేటర్‌ ఆర్టీసీపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. సిటీలో రోజుకు 3,550 బస్సులు తిరుగుతుండగా సుమారు 33 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు. దూరప్రాంతాల బస్సులు ఒక లీటర్‌ డీజిల్‌కు 5.5 కిలోమీటర్ల మేర దూసుకెళ్తుండగా సిటీ బస్సుల్లో ఇది 4 కిలోమీటర్లకే పరిమితమైంది. అడుగడుగునా ట్రాఫిక్‌ రద్దీ ఆర్టీసీకి బ్రేకులు వేస్తోంది. దీంతో 12 నుంచి 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఇంధన భారం భారీగా పెరుగుతోంది. గుంతల రోడ్లు, ట్రాఫిక్‌ రద్దీ, ఇంధన భారంతో పాటు విడిభాగాలు, బస్సుల నిర్వహణ, మరమ్మతులు కూడా ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీంతో ప్రతి రోజు 3.5 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ అది ఈ నిర్వహణ ఖర్చును ఏ మాత్రం భర్తీ చేయలేకపోతోంది. 

ఇప్పుడు తప్పని మెట్రో పోటీ
రోజుకు 820 బస్సులు రాకపోకలు సాగించే ఎల్‌బీనగర్‌–పటాన్‌చెరు రూట్‌ ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్నిచ్చే మార్గం. ఈ రూట్‌లో త్వరలో మెట్రో ప్రవేశించనుంది. దీంతో ఆర్టీసీ మిగిలిన మార్గాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే మెట్రోకు రెండు వైపులా ఉన్న కాలనీలకు బస్సులు దారి మళ్లించక తప్పదు. నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌ మార్గంలో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా దశలవారీగా ఒక్కో మెట్రో కారిడార్‌ అందుబాటులోకి వచ్చేకొద్దీ ఆర్టీసీ మరింత సంక్షోభంలో పడనుంది. ఈ పరిస్థితుల్లో మెట్రోకు దీటుగా ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు నిపుణుల కమిటీ ఎలా దిశానిర్దేశం చేస్తుందనేది కూడా చర్చనీయాంశమే.

కమిటీ సభ్యులు వీరే..
ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో బీఎంటీసీ మాజీ చైర్మన్‌ నాగరాజు యాదవ్, ఆస్కీ డైరెక్టర్‌  ప్రొఫెసర్‌ శ్రీనివాసాచారి, ఏఎస్‌ఆర్టీయూ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ ఆనందరావు, ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్టు కన్సల్టెంట్‌ అంతోన్యకుమార్, ఆస్కీ అధ్యాపకులు డాక్టర్‌ పి. సుదర్శన్, సీఐఆర్‌టీలో పనిచేసిన హనుమంతరావు, ఆర్టీసీ రిటైర్డ్‌ ఈడీ వేణు తదితరులు ఉన్నారు. టీఎస్‌ ఆర్టీసీ సెక్రటరీ పురుషోత్తం నాయక్‌ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మూడు నెలల పాటు ఆర్టీసీపై అధ్యయనం చేసి కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ నివేదికపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు మరోసారి భేటీ అవుతారు. ఉన్నతాధికారుల బృందమే తుది నివేదికను అందజేస్తుంది. దీని ఆధారంగా ఆర్టీసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement