సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు రాకతో నగరంలో క్రమంగా రవాణా సదుపాయాల ముఖచిత్రం మారుతోంది. అతి పెద్ద ప్రజా రవాణా సంస్థగా వెలుగొందే ఆర్టీసీ ఇప్పటికే ఎల్‌బీనగర్–మియాపూర్ మార్గంలో ఏసీ సర్వీసులను తగ్గించింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ఈ రూట్‌లో ఆర్టీసీ ఆక్యుపెన్సీ తగ్గుముఖం పట్టింది. తాజాగా క్యాబ్‌లు సైతం సిటీ బస్సుల బాటలో నడుస్తున్నాయి. రాత్రింబవళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండే ఓలా, ఉబర్ తదితర సంస్థలకు చెందిన క్యాబ్ సర్వీసులకు ఎల్‌బీనగర్–మియాపూర్ మార్గంలో 30 శాతం వరకు డిమాండ్ పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ రూట్‌లో క్యాబ్ డ్రైవర్‌లు బుకింగ్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మెట్రో రైలునడిచే ఉప్పల్ –సికింద్రాబాద్–అమీర్‌పేట్ రూట్‌లో కొంతకాలంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్లు ఎల్‌బీనగర్– మియాపూర్ రూట్‌లో దివాలా తీశారు. మరోవైపు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు క్యాబ్ డ్రైవర్లను మరింత కుంగదీశాయి.
దీంతో ఎల్‌బీనగర్–మియాపూర్ రూట్ అంటేనే డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. భారీగా పెరిగిన డీజిల్ ధరల కారణంగా ప్రతి నెలా ఇంధనం వినియోగంపైన కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవైపు బుకింగ్‌లు లేక, మరోవైపు ఆదాయం బాగా పడిపోయి, ప్రయాణికుల ఆదరణ కొరవడుతూండడంతో క్యాబ్ డ్రైవర్లు సైతం రూట్ మారుస్తున్నారు. ఎల్‌బీనగర్–అమీర్‌పేట్–కూకట్‌పల్లి–మియాపూర్ మార్గంలో క్యాబ్ బుకింగ్‌లు తగ్గిపోవడంతో డ్రైవర్లు నగర శివార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మరికొందరు ఓలా, ఉబెర్ భాగస్వామ్యం నుంచి వైదొలగి దూరప్రాంతాలకు సర్వీసులను నడుపుతున్నారు. నిజానికి ఎల్‌బీనగర్–మియాపూర్ ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న రూట్. ఆర్టీసీ బస్సులే కాకుండా ఆటోలు, క్యాబ్‌లకు ఎంతో డిమాండ్ ఉండేది. కానీ మెట్రో రాకతో ఈ రూట్‌లో దూరం బాగా తగ్గిపోయింది. పైగా ప్రయాణికులు ఎలాంటి అలసట, ఒత్తిడి లేకుండా నిమిషాల్లో గమ్యం చేరగలుగుతున్నారు.‘ గతంలో ఈ రూట్‌లో ప్రతి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలకు ఒక బుకింగ్ చొప్పున లభించేది. ఇప్పుడు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది’ అని విస్మయం వ్యక్తం చేశారు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్. చాలా మంది డ్రైవర్లు క్యాబ్‌లను వదిలేసి ప్రత్యామ్నాయం వెదుక్కుంటున్నట్లు తెలిపారు.
క్యాబ్‌ల స్థానంలో బైక్‌లు...
అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు చాలామంది సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు క్యాబ్‌లను ఆశ్రయించేవారు. ఎల్‌బీనగర్–మియాపూర్, ఉప్పల్–అమీర్‌పేట్ వంటి మెట్రో సమాంతర మార్గాల్లో క్యాబ్‌లకు డిమాండ్ తగ్గినప్పటికీ ఐటీ కారిడార్‌లకు మాత్రం బాగానే ఉండేది. కానీ మెట్రో స్టేషన్‌ల నుంచి క్యాబ్ తరహాలో ఇప్పుడు బైక్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఈ ట్రాన్స్‌పోర్టు బైక్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ రద్దీ ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలను చేర్చే సదుపాయం బైక్‌ల వల్ల అందుబాటులోకి వచ్చింది. ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన సుమారు 500 బైక్‌లు ప్రస్తుతం మెట్రో స్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బైక్‌లు ప్రతి రోజు 2000 నుంచి 3000 ట్రిప్పుల వరకు తిరుగుతున్నాయి. 3 కిలోమీటర్‌ల కనీస దూరం నుంచి 50 కిలోమీటర్‌ల వరకు కూడా బైక్ రైడింగ్ సదుపాయం వచ్చింది. అలాగే మెట్రో స్టేషన్‌లలో ఉండే ‘ మై బైక్’లకు కూడా క్రమంగా డిమాండ్ ఏర్పడుతుంది. మియాపూర్, పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ స్టేషన్‌లలో 60 మై బైక్‌లను అందుబాటులో ఉంచారు.
ఇదీ పరిస్థితి...
♦ ఉప్పల్–సికింద్రాబాద్–అమీర్‌పేట్–మియాపూర్ రూట్‌లో రాకపోకలు సాగిస్తున్న మెట్రో ప్రయాణికులు : 50 వేలు
♦ ఎల్‌బీనగర్–మియాపూర్ మార్గంలో మెట్రో సేవలను వినియోగించుకుంటున్న వాళ్లు : 1.25 లక్షలు
♦ మెట్రో వల్ల రద్దయిన ఏసీ బస్సుల ట్రిప్పులు:100 నుంచి 120
♦ మెట్రో ప్రభావం వల్ల తగ్గిన క్యాబ్‌లు 30 శాతం మెట్రో స్టేషన్‌ల నుంచి నడిచే బైక్‌ల ధరలు...
♦ మొదటి 3 కిలోమీటర్‌లకు రూ.20.
♦ 3 నుంచి 5 కిలోమీటర్‌లకు రూ.30
♦ 5 నుంచి 8 కిలోమీటర్‌లకు రూ.50
చాలా కష్టంగా ఉంది
చాలామంది డ్రైవర్లు క్యాబ్‌లు నడిపేందుకు భయపడుతున్నారు. మెట్రో వల్ల డిమాండ్ తగ్గడం ఒక కారణమైతే, డీజిల్ ధరలు పెరగడం మరో కారణం. ఒకప్పుడు నెలకు రూ.9 వేల వరకు డీజిల్ కోసం ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు అది రూ.13 వేల వరకు పెరిగింది. బుకింగ్‌లు తగ్గిపోవడంతో ఆదాయం రావడం లేదు. పైగా ఇప్పుడు ఉన్న డ్రైవర్ల ఉపాధికి దిక్కులేదంటే ఓలా, ఉబెర్ సంస్థలు ఎడాపెడా కొత్త క్యాబ్‌లను చేర్చుకుంటున్నాయి. దీంతో మరింత నష్టపోవాల్సి వస్తోంది.– సలావుద్దీన్, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment