బాలలపై అత్యాచారాలకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడినా, వారిని పోర్నోగ్రఫీ కోసం వినియోగించుకున్నా ఐపీసీ సెక్షన్లతో పాటు ‘పోక్సో’ చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చి కేసులు దాఖలు చేస్తారు. ‘పోక్సో’ చట్టం కింద నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష మొదలుకొని మరణశిక్ష వరకు విధించే అవకాశాలు ఉంటాయి.
తెలంగాణరాష్ట్రంలోని శంషాబాద్ శివార్లలో 2019, నవంబరు 27న జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్, హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదమూ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం.
ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు :
►కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు, మరణదండన శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ చట్టం.. దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది.
►నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21 రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడాలి.
►లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు.
►లైంగికదాడి నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ చేశారు.
►మెయిల్స్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను చేర్చారు.
►లైంగిక దాడులకు సంబంధించి 376 సెక్షన్‌లో సవరణ తెచ్చి, కచ్చితమైన సాక్ష్యాధారాలతో నిందితులు దోషులుగా తేలితే వారికి మరణశిక్ష విధించే వెసులుబాటు కల్పించింది.
►‘నిర్భయ’ చట్టం ప్రకారం లైంగిక నేరాలపై తీర్పు వెలువడటానికి నాలుగు నెలలుగా ఉన్న వ్యవధిని 21 పని దినాలకు కుదించింది.
►ఐపీసీ 354 సెక్షన్‌లో కొత్తగా 354–ఎఫ్, 354–జీ సబ్‌సెక్షన్లను చేర్చి, పిల్లలపై అత్యాచారం కాని ఇతర లైంగిక నేరాలకు యావజ్జీవ శిక్ష విధించేందుకు వెసులుబాటు కల్పించింది.
►మహిళలు, పిల్లలపై జరిగిన నేరాల సత్వర విచారణకు దేశంలో కొన్ని చోట్ల తప్ప ఇంకెక్కడా ప్రత్యేక కోర్టులు లేవు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పిల్లలపై జరిగిన నేర విచారణలో జాప్యం లేకుండా.. రాకుండా వేగంగా విచారణ జరిగి దోషికి శిక్షపడేలా చేస్తాయి ఈ ప్రత్యేక కోర్టులు. రేప్, గ్యాంగ్‌రేప్, యాసిడ్ దాడులు, సోషల్ మీడియా ద్వారా వేధించడం, అసభ్యంగా చూపించడం వంటి నేరాలతోపాటు , పోక్సో పరిధిలోని అన్ని నేరాలనూ ఈ ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరిగేలా చేశారు.
►ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరు నెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 45 రోజులకు తగ్గించారు.
►మహిళలు, పిల్లలపై జరిగే నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటి వరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు. అయితే జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఏపీ దిశ చట్టం ద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.
►మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నమోదుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్ పద్ధతిలో డేటా బేస్ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరస్తుడు ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అటువంటి డిజిటిల్ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతోపాటు ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులో ఉంచడంద్వారా నేరస్తుల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.
తక్షణ చర్యలు ఇవి...
►ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా... రాష్ట్రంలో 18 మహిళా పోలీస్ స్టేషన్లను సమన్వయం చేసేందుకు, దిశ చట్టం అమలును పర్యవేక్షించేలా ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు.
►మరిన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
►మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు.
►విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
►గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్‌ఏ, సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు
►డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని ‘దిశ కంట్రోల్’ రూంగా పిలవనున్నారు. అంతేకాదు డయల్ 100, 112లను కలిపి ఒకే టోల్ ఫ్రీ నెంబర్‌గా తెచ్చేందుకు కసరత్తూ జరుగుతోంది.
►దిశ యాప్ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నారు.
►ప్రతి వన్ స్టాప్ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు.
►ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు.
►ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.
►2020 జనవరి నెలాఖరు నాటికి అన్ని జిల్లాల్లోని బోధనాసుపత్రిల్లో దిశా ప్రత్యేక కేంద్రాలు, దిశా మహిళా పోలీస్ స్టేషన్‌లు, దిశా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దిశకు యంత్రాంగం
ఏపీ దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. స్త్రీ. శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసింది.
సైబర్ మిత్ర
ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘సైబర్ మిత్ర’ పేరుతో వాట్సాప్ నెంబర్ 9121211100కు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దిశ చట్టం తెచ్చిన ప్రభుత్వం మహిళలకు సత్వర న్యాయం, రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ మొబైల్ అప్లికేషన్(యాప్)ను తేనుంది.
Comments
Please login to add a commentAdd a comment