పౌరసత్వ చట్ట సవరణలు దేశాన్ని కుదిపేయడానికి కొద్ది రోజుల ముందు రేపిస్టులకు వ్యతిరేకంగా మన తెలుగు గడ్డపై జరిగిన ఉద్యమం యావత్ దేశానికి పాకింది. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఈ ఏడాది దేశంలో ప్రకంపనలు రేపింది. నవంబర్ 27 రాత్రి షాద్‌నగర్‌లో ఒక అమాయకురాలిపై వలపన్ని టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో నలుగురు మృగాళ్లు అత్యాచారం చేయడమే కాకుండా, బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టడం సామాన్యుల్ని దహించి వేసింది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపిస్టులకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలకు వ్యతిరేకంగా యువతరం స్వచ్ఛందంగా కదిలిరావడం ఇదే.
దిశపై అఘాయిత్యం జరిగి వారం తిరక్కుండానే డిసెంబర్ 6న నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినిపించినప్పటికీ సామాన్యులు శభాష్ అన్నారు. మన న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలా మారడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష విధిస్తారు. ఇప్పుడు ఈ దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహారాష్ట్ర కూడా ఈ తరహాలో చట్టం చేయాలని భావిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment