AP Disha Act
-
‘సత్వర న్యాయం కోసమే దిశ చట్టం’
సాక్షి, తాడేపల్లి: మహిళలకు సత్వర న్యాయం అందించడానికే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో, ఎమ్మెల్యేపై దాడి చేస్తే కనీస చర్యలు లేవు. కానీ నేడు మహిళలకు ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. దిశ చట్టాన్ని వక్రీకరించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.80కోట్లు కేటాయించారని.. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాక స్పెషల్ ఆఫీసర్లను నియమించామని... సిబ్బంది నియమాకాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు సుచరిత. (‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్‌ముఖ్) ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.80 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని సుచరిత తెలిపారు. దిశ చట్టానికి 71,700 ఫిర్యాదులు వచ్చాయని.. 53 వేలకు పైగా మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకే దిశ చట్టం చేశామన్నారు. దిశ చట్టం తెచ్చాక గతంతో పోల్చితే మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు శిక్ష పడటం సహా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుది రాక్షస గుణం.. ఆయన కులాల మద్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బాబు అడ్డుకుంటున్నాడని ఆమె తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా దళితుడిని నియమిస్తే అడ్డుకున్నారన్నారు సుచరిత. (ఏపీ.. ట్రెండ్ సెట్టర్!) విజయవాడలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తుంటే.. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. దళితులుగా ఏవరైనా పుడతారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 82.5 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించామన్నారు. మొదటి బడ్జేట్‌లోనే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తెచ్చామని తెలిపారు. భారత దేశంలోనే ఓ దళిత మహిళను హోంమంత్రి చేయాలని ఎవరు ఆలోచన చేయలేదు. కానీ సీఎం జగన్ ఓ దళిత మహిళను హోంమంత్రిని చేశారని సుచరిత తెలిపారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను అమలు చేయలేదు.. కానీ సీఎం జగన్ ముందుగా డేట్ ప్రకటించి మరీ సంక్షమ పథకాలు అమలు చేస్తున్నారని సుచరిత ప్రశంసించారు. ముఖ్యమంత్రి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నయన్నారు సుచరిత. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
-
గృహహింస: దిశ టీం 24 గంటలు పనిచేస్తుంది
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కాలంలో గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణకు ఏర్పాటు చేసిన వన్‌స్టాప్ సెంటర్లలో దిశ టీం 24 గంటలు పనిచేస్తుందని దిశ చట్టం ప్రత్యేకాధికారి దీపికా పాటిల్ తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వన్‌స్టాప్ సంటర్ల నుంచే బాధితులకు నిపుణులైన ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయం అందుతుందన్నారు. 24 గంటలు పోలీసుల సంరక్షణ, వసతి సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు. (గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం) రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో బాధిత మహళలకు వసతి, రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం ఉమెన్ హెల్స్‌లైన్ 181 రౌండ్ దీ క్తాక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. లాక్డౌన్లో పోలీసు స్టేషన్లకు వెళ్లలేరని మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని దీపికా హెచ్చిరించారు. మహిళా రక్షణ కోసం దిశ సిబ్బంది 24 పనిచేస్తున్నారని, బాధిత మహిళల తక్షణ సహాయం కోసం ప్రతీ జిల్లాలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని దీపికా పాటిల్ తెలిపారు. (గృహ హింసా.. ఫోన్ చేస్తే రక్షణ) జిల్లా పేరు డయల్ చేయాల్సిన నెంబరు శ్రీకాకుళం 9110793708 విశాఖపట్టణం 6281641040 పశ్చిమ గోదావరి 9701811846 గంటూరు 9963190234 పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821 కర్నూలు 9701052497 అనంతపురం 8008053408 విజయనగరం 8501914624 తూర్పుగోదావరి 9603231497 కృష్ణ 9100079676 ప్రకాశం 9490333797 చిత్తూరు 9959776697 వై.యస్.ఆర్ . కడప 8897723899 -
మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
సాక్షి, అమరావతి: 2020ని 'ఉమెన్ సేఫ్టీ ఇయర్’గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మరో 12 దిశ పోలీస్స్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుంచి దిశ పోలీస్స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సీఎం లక్ష్యానికి అనుగుణంగా పనిచేసేందుకే ‘దిశ’ ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో మహిళా మిత్రలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పోలీస్స్టేషన్లకు మహిళలు నిర్భయంగా వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లకు రావాలంటే మహిళలు భయపడే రోజులు పోవాలన్నారు. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి చేపట్టిన ‘దిశ’లో భాగస్వాములు కావటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని.. పూర్తిస్థాయి భద్రతతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో గతం కంటే ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు. నేటి నుంచి అందుబాటులో 18 దిశ పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో నేటి నుంచి 18 దిశ పోలీస్స్టేషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ‘దిశ చట్టం’ ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ అన్నారు. ‘దిశ ఎస్ ఓ ఎస్ యాప్’కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే 122 కాల్స్ వచ్చాయని 37 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని తెలిపారు. తమ పొరుగు మహిళలు ఆపదలో ఉన్నారని పురుషుల నుంచి సైతం కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఈచ్ ఫర్ ఈక్వల్’ అనే నినాదం ఇస్తున్నామని చెప్పారు. పొరుగు మహిళల కష్టాలు చూసి తోటి మహిళలు సైతం ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈవ్టీజర్ల బెడద తప్పింది.. వీక్లీ ఆఫ్‌తో వారంలో ఒక రోజు కుటుంబం అంతా కలిసే అవకాశం కలుగుతుందని ‘దిశ’ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. దిశ యాప్‌తో ఈవ్టీజర్ల బెడద చాలా వరకు తప్పిందని డీజీపీకి మహిళా మిత్రలు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో మహిళలు నిర్భయంగా ఉన్నారన్నారు. అఘాయిత్యాలు, వేధింపులకు చెక్ పెట్టడంతో మహిళల్లో భరోసా కనిపిస్తోందని తెలిపారు. ‘దిశ యాప్’పై విస్తృత ప్రచారం కల్పించి.. అధిక మంది డౌన్లోడ్ చేసుకునేవిధంగా కృషి చేయాలని డీజీపీని మహిళా మిత్రలు కోరారు. ఏలూరు: మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కోటదిబ్బలో దిశ మహిళా పోలీస్టేషన్‌ను కలెక్టర్ ముత్యాలరాజు, డీఐజీ కేవీ మోహన్‌రావు, ఎస్పీ నవదీప్ సింగ్గ్రేవాల్ ప్రారంభించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు. -
ఏపీలో మరో 12 ‘దిశ’ పోలీస్స్టేషన్లు
సాక్షి, విజయవాడ: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు జిల్లాల్లో ‘దిశ’ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని.. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. దిశ-2019 చారిత్రాత్మక బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించిందని.. రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఏపీ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. దిశా చట్టానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్) మహిళా పీఎస్‌లు అప్‌గ్రేడ్.. ‘దిశ’ చట్టం అమలులో భాగంగా 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులతో పాటు విశాఖ, తిరుపతిలో ‘దిశ’ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పీఎస్‌లను ‘దిశ’ ఉమెన్ పోలీస్స్టేషన్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ‘దిశ ఎస్ఓఎస్ యాప్’ కు ఇరవై ఐదురోజుల్లో 86 క్రియాశీలక కాల్స్ వచ్చాయన్నారు. ఇరవై ఆరు కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. భర్త వేధింపులు,ఈవ్ టీజింగ్ మెసేజ్ లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ‘దిశ యాప్’ను రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. 14 వేల కాల్స్ వచ్చాయన్నారు. స్పందనలో 52 శాతం మహిళలు ఫిర్యాదు ఇవ్వడం మార్పుకు నిదర్శనమన్నారు. నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సైబర్ మిత్రా ఏర్పాటు చేసామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 206 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయన్నారు. సైబర్ మిత్రకు ‘9121211100’ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని డీజీపీ పేర్కొన్నారు. (దశ 'దిశ'లా స్పందన) -
‘దిశ చట్టం గురించి ప్రతి ఒక్కరికి వివరించాలి’
సాక్షి, కృష్ణా : మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు దిశ చట్టం గురించి, మహిళల రక్షణ గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్నాని, కొడాలి నాని, మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, రక్షణనిధి, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. (‘దిశ యాప్’తో మహిళలకు రక్షణ: సుచరిత) చదవండి: కడప జైలులో దేశంలోనే తొలిసారిగా.. -
కామాంధునికి ‘దిశ’ బేడీలు
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): గౌరవప్రదమైన ఉద్యోగం, మంచి కుటుంబం ఉన్నా కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు పాల్పడ్డాడు. డబ్బు, వస్తువులు ఆశ చూపి అభంశుభం తెలియని యువతులను మోసం చేశాడు. శృతిమించిన అతని చేష్టలతో విసిగిపోయిన భార్య దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది. అతని బారి నుంచి ఓ విద్యార్థినిని కాపాడింది. కామాంధుడి చెర నుంచి విద్యార్థినిని రక్షించినందుకు మేరీ జెస్సికాను అందరూ అభినందించారు. వివరాలివీ.. - గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి.అనిల్‌కుమార్ విజయవాడలో రైల్వే గార్డు. - మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి ఆడపిల్లలను వలలో వేసుకుంటాడు. వారి జీవితాలను నాశనం చేస్తాడు. - తన ఇంటి సమీపంలోనే డిగ్రీ చదివే ఓ విద్యార్థినికి మొబైల్ ఫోన్ ఆశ చూపి వశపరుచుకున్నాడు. ఏకాంతంలో ఉండగా తీసిన ఫొటోలను చూపి బెదిరించి తన కోరికలు తీర్చుకున్నాడు. - విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా వారించింది. - అతనిలో మార్పు రాకపోవడంతో ఆ విద్యార్థిని కుటుంబాని అక్కడి నుంచి దూరంగా పంపేసింది. - అయినా అనిల్ ఆ విద్యార్థినిని వదలలేదు. ఆదివారం మధ్యాహ్నం విజయవాడలో ప్రైవేటు క్లాసుకు వెళ్లి వస్తున్న విద్యార్థినిని బెదిరించి, హోటల్‌కు తీసుకువెళ్లేందుకు యత్నించాడు. - విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా అక్కడికి చేరుకుంది. దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. - రెండు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనిల్‌కుమార్‌ను, విద్యార్థినిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. - ఆరు నెలలుగా అనిల్‌కుమార్ తనను ఏ విధంగా వేధిస్తున్నదీ విద్యార్థిని పోలీసులకు వివరించింది. - విద్యార్థిని ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం స్టేషన్ మహిళా ఎస్ఐ స్వాతి కేసు నమోదు చేశారు. అనంతరం కేసును తాడేపల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు. - అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
దిశ కంట్రోల్ రూమ్: తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి
సాక్షి, విజయవాడ: దిశ కంట్రోల్ రూమ్‌లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్‌కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. దిశ అప్లికేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు ఎలా స్పందించాలి, సమాచారాన్ని దిశ ఎమర్జెన్సీ టీమ్‌లకు ఎలా చేరవేయాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. కీలక పాత్ర పోషించాలి : డీజీపీ శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పలు సూచనలు చేశారు. దిశ కంట్రోల్ రూమ్, దిశ ఎస్ఓఎస్ అప్లికేషన్ ప్రాముఖ్యతను, ఆపదలో ఉన్న మహిళల్ని ఎలా రక్షించాలో ఆయన వివరించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ విధులలో కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. ముఖ్యంగా మహిళల రక్షనే బాధ్యతగా భావించాలని, ఉద్యోగంలా కాకుండా సేవా గుణంతో బాధ్యతయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
‘రాజకీయ లబ్ధి కోసమే ఆ ఆరోపణలు’
సాక్షి, గుంటూరు: తల్లి గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో.. అలాంటి రక్షణ ఏపీలో ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం ఆమె నరసరావుపేటలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామూల్ ఆనంద్, రేంజి ఐజీ వినీత్ బ్రిజిలాల్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని.. ఇలాంటి సంఘటనలు ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. (చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం) రాష్ట్ర్రంలో మొత్తం 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘దిశ’ ఎస్ ఓ ఎస్ యాప్ ను కూడా రూపొందించామని చెప్పారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని.. కానీ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పోలీస్ శాఖపై నిందలు వేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. -
మహిళల భద్రతే సీఎం జగన్ మోదటి ప్రాధాన్యత
-
చట్టం 'దిశ'గా!
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారుల రక్షణతోపాటు బాధితులకు సత్వర న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ చట్టంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్టరూపం కల్పించే చర్యలను ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందచేసింది. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. న్యాయ కోవిదులతో సంప్రదింపులు ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడి, వేధింపులను తీవ్ర నేరాలుగా పరిగణిస్తూ ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. నిర్భయ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం రుజువైతే దోషులకు ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా చట్టాల్లో కేంద్రం మార్పులు తెచ్చింది. ఈ కేసుల దర్యాప్తు, విచారణ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019 ద్వారా 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించేలా ప్రతిపాదించింది. అత్యాచారానికి పాల్పడే నిందితులకు ఉరిశిక్ష విధించేలా మార్పులు చేసింది. ఈ క్రమంలో త్వరితగతిన విచారణ, శిక్ష అమలులో వెసులుబాటు, ప్రత్యేక కోర్టులు, యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని కేంద్ర హోంశాఖ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన దిశ బిల్లు, కేంద్ర హోంశాఖ ప్రస్తావించిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలన ప్రక్రియ ప్రారంభించింది. దిశ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలను చట్టపరంగా, న్యాయపరంగా ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై కేంద్ర హోంశాఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మహిళలపై వేధింపులకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో మార్పులు, కొత్తవి రూపకల్పన, అమలు తీరు తదితర అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం గత నెలలో అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఐపీసీ 1860, ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) 1973 చట్టాల్లో మార్పులు తెచ్చి కేసుల దర్యాప్తు, విచారణ, తీర్పు వేగంగా పూర్తయ్యేలా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే చట్టరూపం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును చట్ట రూపంలోకి తేవటంపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాలు ప్రతిపాదించే సవరణలకు కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం. ఇప్పటికే ఈ బిల్లును పరిశీలించి న్యాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు పంపింది. బిల్లును ఏ సబ్జెక్ట్ ప్రకారం ప్రతిపాదించారు? ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లకు సంబంధించి ఏ మార్పులు చేశారు? అనే కొన్ని ప్రాథమిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. దిశ బిల్లు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని ఆశిస్తున్నాం. – దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
దిశ చట్టంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపెడుతున్నాయి
-
ఏపీ.. ట్రెండ్ సెట్టర్!
సాక్షి, అమరావతి: అనుసరించడం కాదు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాలను తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందని నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం తీసుకున్న అనేక సంచలన, సాహసోపేత నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతోపాటు వాటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రధానంగా.. పాలనా వికేంద్రీకరణ, దిశ బిల్లు, పోలీస్ వీక్లీ ఆఫ్, స్పందన వంటి నిర్ణయాలను అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. దశ‘దిశ’లా.. మహిళలు, బాలికల రక్షణకు దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన దిశ బిల్లు తరహాలో చట్టం తెచ్చేందుకు పలు రాష్ట్రాలు సీరియస్‌గా పరిశీలిస్తున్నాయి. ఏపీ తరహాలో దిశ బిల్లు తెస్తామంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం కూడా అమరావతికి వచ్చి ఏపీ కీలక అధికారులు, మంత్రులతో దిశ బిల్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు దిశ బిల్లు అద్భుత నిర్ణయమని ప్రశంసించారు కూడా. పాలనా వికేంద్రీకరణపై.. మూడు రాజధానులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపి పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ పాలిత కర్ణాటక కూడా తాజాగా ఇదే బాట పట్టడం గమనార్హం. ఇందులో భాగంగా అక్కడి యడియూరప్ప ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ఆమోదించింది కూడా. అక్కడ బెంగళూరుతోపాటు బెళగాలిలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఉత్తర కర్ణాటకకు తరలించాలని ఆ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ బాటలోనే బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప నడుస్తున్నారంటూ విద్యావంతులు, మేధావులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని కూడా అనుసరిస్తూ కర్ణాటక సర్కారు కొద్ది రోజుల క్రితం తీర్మానం చేయడం విశేషం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఓ సంచలనం.. ఇక 24 గంటలు కష్టపడే పోలీసులకు వారంలో ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలనే ప్రతిపాదనను అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరో నిర్ణయాన్ని కూడా అనుసరించేందుకు పలు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగాదీనికి సంబంధించి వివరాలు కోరిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ పోలీసు అధికారులు ఇప్పటికే నివేదించారు. అపూర్వ ‘స్పందన’.. ప్రజల కష్టాలు తీర్చే ‘స్పందన’ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్పందన అమలుచేస్తున్న తీరుతెన్నులపై కూడా అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే ఏపీ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. కాగా.. ఇటీవల గుజరాత్‌లోని వదోదరాలో నిర్వహించిన పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్లో ఏపీ పోలీస్ స్టాల్లో ‘స్పందన’ అమలుతీరును అడిగి తెలుసుకుని ప్రశంసించారు. అంతేకాక.. దీనిపై పూర్తిస్థాయి నివేదికను ప్రధాని కోరడం గమనార్హం. -
మీ ఫోన్లో దిశ యాప్ ఉందా?
-
సీఎం జగన్‌ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం
-
‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్‌ముఖ్
సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులను ఆయన అభినందించారు. సచివాలయం సీఎస్ సమావేశం మందిరంలో గురువారం దిశ బిల్లుపై జరిగిన సమావేశంలో అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. దిశ లాంటి బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ’దిశ’ బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించడం అభినందనీయమన్నారు. దిశ చట్టంపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. (దిశ.. కొత్త దశ) దేశంలోనే మొదటిసారిగా.. దేశంలోనే మొదటిసారిగా చిన్నారులు,మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు ‘దిశ బిల్లు’ను తీసుకువచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దిశ బిల్లు అమలుకు ప్రభుత్వం రూ. 87 కోట్లు ఇప్పటికే కేటాయించిందని వెల్లడించారు. 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ప్రత్యేక కంట్రోల్ రూం, వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని సుచరిత పేర్కొన్నారు. (‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ ) చారిత్రాత్మకమైన బిల్లు.. బాలికలు, మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను చారిత్రాత్మకమైన బిల్లుగా మహిళా శిశు,సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అభివర్ణించారు. 2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వనిత తెలిపారు. కసరత్తు చేసిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాతే ‘దిశ బిల్లు’ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. ఈ బిల్లు అమలులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ‘దిశ చట్టం’ అమలుకు ప్రత్యేకంగా ఇద్దరు మహిళా అధికారులను నియమించామని ఆమె చెప్పారు. -
సీఎం జగన్‌ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ’చట్టం గురించి అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారుల బృందం సీఎం జగన్‌ను కలిసి దిశా చట్టం గురించి అడిగి తెలుసుకుంది. (చదవండి :మహారాష్ట్రలో దిశ చట్టం!) ఈ సందర్భంగా సీఎం జగన్ ఆ బృందానికి దిశ చట్టం గురించి వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన బృందంలో మహారాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, డీజీపీ సుబోత్ కుమార్, అదనపు సీఎస్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీకి మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం
సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ' చట్టం గురించి అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక అధికారుల బృందం గురువారం వచ్చింది. దేశవ్యాప్తంగా అందరి మన్నలను పొందుతున్న దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, డీజీపీ సుబోత్‌కుమార్ జైశ్వాల్, అడిషనల్ చీఫ్ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం ఏపీకి చేరుకుంది. కాసేపట్లో ఏపీ హోంమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, దిశ స్పెషల్ ఆఫీసర్లతో మహారాష్ట్ర బృందం భేటీ కానుంది. (దేశంలోనే తొలిసారిగా..) (మహారాష్ట్రలో దిశ చట్టం!) -
ఐపీఎస్ దీపికకు ఎస్పీగా పదోన్నతి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక దిశ చట్టం పటిష్ట అమలుకై ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఐపీఎస్ దీపికకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికకు ఎస్పీగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ హోదాలో మంగళగిరి డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా దీపికను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా దిశ చట్టం అమలులో భాగంగా ఇద్దరు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్ విభాగంలో దీపిక దిశ ప్రత్యేక అధికారిణిలుగా నియమితులయ్యారు. (‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ) దిశ చట్టంలో ప్రత్యేకతలు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం రేప్, గ్యాంగ్ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్లైన్) రిజిస్టర్లో నమోదు చేస్తారు. మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునికీకరణ తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్ఏ సెంటర్లు బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్‌లు దిశ పోలీస్ స్టేషన్లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్. ఒక డీఎస్పీ, మూడు ఎస్ఐ పోస్టులు మంజూరు బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్ఐఆర్ సౌకర్యం. -
దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది. (చదవండి : ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్) ‘ఇంత గొప్ప పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేటి సమాజంలో మహిళలకు, బాలికలను రక్షణ కరువైంది. ఒక అన్నలా, తమ్ముడిలా, తండ్రిలా, మామయ్యాలా ఆలోచించి దిశ పోలీస్ స్టేషన్లను ప్రవేశ పెట్టారు. ఆడవాళ్లనే కాకుండా నాలాంటి పేద విద్యార్థులకు రక్షణ కల్పించారు. ఆడవాళ్లందరి తరపున మన మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, మన కర్నూలును న్యాయ రాజధానిగా ఎంచుకున్నందుకు మన మామయ్య గారికి మనమెంతో రుణపడి ఉండాలి’అని జ్యోతిర్మయి పేర్కొంది. చిన్నారి ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్ ముగ్ధుడయ్యారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. -
‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ
గుమ్మఘట్ట: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ మారుమూల గ్రామాల్లో సైతం సకాలంలో సేవలను అందిస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ బాలిక అర్ధరాత్రి వేళ దిశ యాప్ ద్వారా రక్షణ పొందింది. స్థానిక ఎస్ఐ తిప్పయ్యనాయక్ తెలిపిన పూర్తి వివరాల మేరకు.. గుమ్మఘట్ట మండలంలోని 75–వీరాపురం తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతి వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఊరు ఊరంతా ఉత్సవంలో పాల్గొంది. మహిళలు ఉత్సాహంగా కోలాటమాడారు. ఓ 16 ఏళ్ల బాలికకు నిద్ర వస్తోండడంతో రాత్రి 12:45 నిమిషాలకు పక్క వీధిలో ఉన్న ఇంటికి వెళ్లసాగింది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన గ్రామానికి చెందిన తిరుపాల్‌నాయక్ (21) అనే యువకుడు వెంటపడ్డాడు. కోరిక తీర్చాలని చెయ్యి పట్టుకున్నాడు. అమ్మాయి చెంప మీద కొట్టి గట్టిగా కేకలు పెట్టింది. వెంటనే తక్షణ సాయం కోసం ‘దిశ యాప్’కు మెసేజ్ చేసింది. ఆ లోపు అటువైపు ఇంటికి వెళ్తున్న బాలిక చిన్నాన్న ఈ ఘటనను గమనించి అక్కడికి చేరుకునేలోగా యువకుడు పరారయ్యాడు. విజయవాడ ‘దిశ’ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బాధితురాలి సమాచారం అందింది. అక్కడి నుంచి రాయదుర్గం రూరల్ సీఐ పి.రాజ, ఎస్ఐ తిప్పయ్యనాయక్‌లను ఎస్పీ అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఓ ఇంట్లో దాక్కున్న తిరుపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మారుమూల గ్రామాల్లోని యువతులు కూడా ‘దిశ యాప్’ గురించి తెలుసుకోవడం వల్లే నిందితున్ని వెంటనే పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. -
అత్యాచార బాధితులకు వేగంగా సేవలు
వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెబుతుంది. అయితే మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఏ ఒక్కరూ.. ఎంతటి వారైనా సరే తప్పించుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన వైద్య పరీక్షలపై దృష్టి సారించింది. పక్కా ఆధారాలతో దోషులను కోర్టు బోనులో నిలిపేందుకు అత్యంత ప్రొఫెషనల్‌గా ముందుకు అడుగులు వేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘దిశ’ చట్టం రూపొందించిన తర్వాత అత్యాచార బాధితులకు వైద్య శాఖ తరఫున అందాల్సిన సేవలకు మరింత పదును పెంచారు. అర్ధరాత్రి, అపరాత్రి ఇలా ఏ సమయంలో వచ్చినా అలాంటి బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించడం, వారి స్టేట్మెంట్ రికార్డు చేయడం, పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు చేయడం వంటి వాటిపై దృష్టి సారించారు. దీనికోసం 23 మంది గైనకాలజీ వైద్యులకు 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యాచారం జరిగిందని నిర్ధారించడానికి బాధితులకు కొన్ని రకాల పరీక్షలు చేయడం ద్వారా తేలిన ఫలితాలే నిందితులకు శిక్ష పడేందుకు ఊతమిస్తాయి. అలాంటి నిర్ధారణ పరీక్షలు తారుమారు కాకుండా చూడటం, పకడ్బంధీగా రక్త పరీక్షలు నిర్వహించడంలో భాగంగా గైనకాలజిస్ట్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 11 బోధనాసుపత్రులు ఉండగా, విజయవాడ ఆసుపత్రి నుంచి ముగ్గురు, మిగతా ఆసుపత్రుల నుంచి ఇద్ద్దరు చొప్పున మొత్తం 23 మంది వైద్యులకు శిక్షణ పూర్తయింది. ఈ బృందంలో ఫోరెన్సిక్ డాక్టర్లూ ఉంటారు. ‘దిశ’ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బాధితులకు సత్వర న్యాయం అందించడంలోగానీ, నిందితులకు శిక్షలు వేయడంలో గానీ మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని, ఆ తరహాలో వైద్యులు పని చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు బోధనాసుపత్రుల్లో బాధితులకు సేవలందించడంలో పటిష్ట చర్యలు చేపడుతున్నామని వైద్య విద్యా సంచాలకులు డా.కె.వెంకటేష్ ‘సాక్షి’తో అన్నారు. పక్కాగా రికార్డుల నిర్వహణ ఇలా.. - నిర్ధారణ పరీక్షల ఫలితాల నివేదికలను గతంలో కొంత మంది నిందితులు తారుమారు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇకపై అలా జరగకుండా వైద్యులు రాత పూర్వకంగా ఇచ్చే నివేదికతో పాటు అవే అంశాలను ఎలక్ట్రానిక్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారు. ఈ నివేదికలను ఎవరూ ఎలాంటి పరిస్థితుల్లోనూ తారుమారు చేయకుండా చూస్తారు. - బాధితులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్య సేవలు అందించడంలో భాగంగా గైనకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్లు మూడు షిఫ్టులూ పని చేసేలా ఆదేశాలు. - బాధితులకు వైద్యం, నిర్ధారణా పరీక్షలు, నివేదికలపై తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. - ప్రతిరోజూ ఇలాంటి బాధితులకు అందుతున్న వైద్యం, కేసుల వివరాలు, నివేదికలపై పురోగతి, ఆ నివేదికలను పోలీసులకు సకాలంలో అందించడం.. తదితర విషయాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నోడల్ అధికారిగా డా.నీలిమను నియమించింది. - బోధనాసుపత్రుల్లో బాధితులకు వైద్యనిర్ధారణ పరీక్షలు అందించేందుకు ఆధునిక వైద్య పరికరాలను అమర్చుతున్నారు. -
దిశ చట్టం రూపుదాల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన్నవించారు. శుక్రవారం రాత్రి హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. 9.40 గంటల నుంచి రాత్రి 10.20 వరకు దాదాపు 40 నిమిషాల పాటు రాష్ట్ర అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి. దిశ చట్టం కోసం చేయాల్సిందంతా చేశాం ‘మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. విచారణను వేగంగా పూర్తి చేసి, నిర్దేశిత సమయంలోగా శిక్షలు విధించడానికి దిశ చట్టం తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేశాం. అందువల్ల ఏపీ దిశా చట్టం త్వరిత గతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలి. శాసనమండలి రద్దును ఆమోదించాలి శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెచ్చిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి అపహాస్యం చేసింది. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖకు సూచించి ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదించేలా చూడాలి. ఏపీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వాలి పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. ఈ విషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వ్యవస్థ సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నా.. నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యం చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. హోంమంత్రిత్వ శాఖ రూ.253.40 కోట్ల అంచనా వ్యయంతో దీనిని 2017లో ఆమోదించింది. ఇందులో రూ.152 కోట్లు కేంద్ర వాటా కాగా, రూ.101.40 కోట్లు రాష్ట్ర వాటా. కానీ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడంతో ఈ ప్రాజెక్టు మూత పడింది. ఈ విషయంలో చొరవ చూపి ఆదుకోవాలి. సీనియర్ అధికారులను కేటాయించండి శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రత కోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత కేడర్ సామర్థ్యం పెంచాలి. ఇందులో భాగంగా 79 సీనియర్ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలి. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పని చేసేందుకు వీలుగా డీఐజీ, ఐజీపీ, ఏడీజీపీ ర్యాంకుల్లో పని చేస్తున్న ఐపీఎస్ అధికారులను కేటాయించాలి. రాష్ట్ర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున ఈ అంశాల పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలి. దీంతోపాటు స్టేట్ ఆపరేషనల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సెంట్రలైజ్డ్ డేటా సెంటర్, ఏపీ పోలీస్ అకాడమి ఏర్పాటుకు తగిన సహాయం చేయాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి కొనసాగేలా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయంలో అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం–2020కి కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. రెండు మూడు నెలల్లో ఇది చట్టంగా మారనుంది. ఈ దిశగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం మీకు తెలిసిందే. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రాజెక్టులకు సాయం ఏపీ విభజన చట్టంలో పొందు పరిచిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి చేయూత ఇవ్వాలి. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం – చెన్నై కారిడార్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగు పరచడానికి గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలి. ఆ మేరకు సంబంధిత శాఖలకు సిఫారసు చేయాలి. పోలవరం నిధులు త్వరగా విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.838 కోట్లు ఆదా చేశాం. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోంది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉంది. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,549 కోట్లుగా కేంద్ర జల వనరుల శాఖలోని సాంకేతిక కమిటీ 2019 ఫిబ్రవరిలో ఆమోదించింది. దీనికి సంబంధించిన పాలనా పరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. సహాయ, పునరావాస వ్యయం రూ.3,200 కోట్ల నుంచి రూ.33,010 కోట్లకు పెరగడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,320 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వినియోగపత్రాలు అందజేసినప్పటికీ, ప్రభుత్వ సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆడిట్ చేసినప్పటికీ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జల వనరుల శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. గ్రాంట్లు, నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ. 10,610 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమే. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. వెనకబడిన జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అయితే గత మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఈ నిధులు వస్తున్నా.. ఏపీకి రావడం లేదు. ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో తలసరి సగటున రూ.4,000 ఇస్తే, ఏపీలో వెనకబడిన ఏడు జిల్లాల్లో కేవలం రూ.400 చొప్పున మాత్రమే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ఖండ్ తరహాలో పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన జరిగిన తొలి ఏడాది 2014–15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటును భర్తీ చేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 సంవత్సర రెవిన్యూ లోటును రూ.22,949 గా కాగ్ నిర్ధారించింది. ఇందులో ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. ఈ మేరకు నిధులు విడుదల చేయించాలి. రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేయగా.. ఇందులో రూ.1,000 కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయి. ఇది 15వ ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన ఆదేశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని స్పష్టం చేసింది. అందువల్ల దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమిత్ షాకు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగం సురేష్ ఉన్నారు. మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చండి.. ఢిల్లీ తెలుగు పాత్రికేయుల వినతి ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందేలా మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చాలని ఢిల్లీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అక్రిడేటెడ్ తెలుగు జర్నలిస్టులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని కలిసేందుకు ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రిని ఢిల్లీ తెలుగు పాత్రికేయులు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. వీరితో ఆత్మీయంగా మాట్లాడిన వైఎస్ జగన్.. ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. ఈ సౌకర్యాన్ని అందించే దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, సీఎం శనివారం ఉదయం తిరిగి ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు.