సాక్షి, అమరావతి: మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ‘దిశ’ చట్టం ముఖ్య ఉద్దేశమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన ‘దిశ’ చట్టంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టంపై జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులతో ‘వర్క్ షాప్’ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ‘దిశ ’చట్టం ఉద్దేశమని.. వేగంగా కేసు దర్యాప్తు జరపడంతో పాటు నిందితులను తక్షణమే అరెస్ట్ చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదికలు, డీఎన్‌ఏ రిపోర్ట్స్ వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నిర్ణీత సమయంలో వయస్సు నిర్ధారణ, పోస్ట్ మార్టం, అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్‌ను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ సదుపాయం ఏర్పాటు చేయబోతున్నామని డీజీపీ వెల్లడించారు. విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను మరింతగా పటిష్టపరచనున్నామని ఆయన తెలిపారు. అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలలో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment