goutham savang
-
గ్రూప్–1 దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్‌లోని 92 పోస్టులకు నియామక ప్రక్రియ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షల కోసం అక్టోబర్ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 2వ తేదీతో(బుధవారంతో) గడువు ముగిసింది. అయితే గడువు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వందలాదిగా ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. సంబంధిత ఫీజును 4వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 18న ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టుల నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ(స్క్రీనింగ్ టెస్టు)ని డిసెంబర్ 18న నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించినా పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మెయిన్స్ పరీక్షలను మార్చి రెండో వారం తర్వాత చేపడతామని వెల్లడించారు. -
డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన సవాంగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం అత్యధిక కాలం డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారిగా గౌతం సవాంగ్ రికార్డు సృష్టించారు. ఆయన రెండు సంవత్సరాల ఎనిమిది నెలల 18 రోజులపాటు రాష్ట్ర పోలీస్ బాస్‌గా కీలకమైన స్థానంలో కొనసాగారు. డీజీపీలుగా విధులు నిర్వహించిన వారెవరూ ఇంత కాలం ఆ పోస్టులో కొనసాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి అంటే 2014 జూన్ 2 నుంచి 2022 ఫిబ్రవరి 18 వరకు ఏపీలో ఐదుగురు డీజీపీలుగా వ్యవహరించారు. ప్రస్తుతం నియమితులైన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆరో డీజీపీ. టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో అంటే 2014 జూన్ నుంచి 2019 మే 30 వరకు నలుగురు పోలీసు అధికారులు డీజీపీగా పని చేశారు. అంటే సగటున ఒక్కో డీజీపీ కేవలం 15 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. గత ప్రభుత్వంలో కుర్చీలాట! టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీ పోస్టును ఓ కుర్చీలాటగా మార్చారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. చీటికిమాటికి డీజీపీలను మార్చడం, లేదా తక్కువ సర్వీసు ఉన్న పోలీసు అధికారులను ఆ పోస్టులో నియమించడం టీడీపీ రాజకీయ వ్యూహమని చెబుతున్నారు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ గౌతం సవాంగ్‌ను రికార్డు స్థాయిలో అత్యధిక కాలం ఆ పోస్టులో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. దాంతో పోలీసు అధికారుల నైతిక స్థైర్యం పెరగడంతోపాటు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టమైందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీజీపీగా చేసిన అనంతరం కూడా గౌతం సవాంగ్‌ను రాజ్యాంగ బద్ధమైన ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
శాంతిభద్రతలకు అగ్ర ప్రాధాన్యం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే తన ప్రధాన లక్ష్యాలని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, సామాన్యుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పూర్తి అదనపు బాధ్యతలతో రాష్ట్ర డీజీపీగా శనివారం ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గౌతం సవాంగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. మత సామరస్యానికి భంగం కలిగించే, ఇతరత్రా అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పోలీసు వ్యవస్థ పూర్తి బాధ్యత, జవాబుదారీతనంతో పని చేసేలా సమన్వయపరుస్తామని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి నిబద్ధతతో వ్యవహరించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. దిశ యాప్, దిశ మహిళా పోలీసు వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసుల నియామకం.. తదితర చర్యలతో క్షేత్ర స్థాయిలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమైందని చెప్పారు. గంజాయి సాగు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలైనవి పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తదనుగుణంగా కొత్తగా పోలీసు జిల్లాలు, యూనిట్లను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. అందుకోసం ఇప్పటికే ఓ కమిటీని నియమించామని తెలిపారు. ప్రముఖుల పర్యటనల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అదనపు డీజీ (శాంతి భద్రతలు) నేతృత్వంలో ఓ కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. దుర్గమ్మ పంచ హారతుల సేవలో డీజీపీ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణితో కలిసి అమ్మవారి పంచ హారతుల సేవలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: సవాంగ్ రాష్ట్ర ప్రజలకు డీజీపీగా రెండేళ్ల 8 నెలల పాటు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గౌతం సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని నిష్పక్షపాతంగా పనిచేసి, పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేశామన్నారు. బదిలీని పురస్కరించుకుని పోలీసు అధికారులు మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో శనివారం సవాంగ్ దంపతులున్న ప్రత్యేక వాహనాన్ని అధికారులు తాళ్లతో లాగుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దిశ యాప్‌ను 1.10 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని, స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై 40 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 7,552 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం దేశంలోనే రికార్డని చెప్పారు. తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం తమ పోలీస్ కుటుంబానికి తీరని లోటు అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ప్రమాద ఘటనపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డీఐజీ, ఎస్పీని ఆదేశించారు. (చదవండి: ‘హీరోయిన్లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరణించిన పోలీస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని ప్రకటించారు. కలకత్తాలో మరణించిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి) -
ఈ ఫేస్బుక్ పేజీ ‘మానవత్వ ధీర’
విజయనగరం క్రైమ్: కోవిడ్‌తో బాధపడుతూ మృతి చెందిన వారిని ‘విజయనగరం యూత్ ఫేస్బుక్ పేజీ’ పేరుతో తమవంతు బాధ్యతగా అంత్యక్రియలు నిర్వహించి పలువురి మన్ననలు పొందిన ఫేస్బుక్ పేజీ బృందాన్ని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విశేషమైన సేవలందించిన స్వచ్ఛంద సంస్థలతో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్ సమయంలో సంస్థలు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని, అభినందించి, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ఉన్నతికి పాటుపడాలన్నారు. జాతి, కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా మానవత్వమే పరమావధిగా వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించి, బాధితుల కుటుంబాల పట్ల ఆపద్బాంధువులయ్యారన్నారు. (విజయనగరం యూత్ ఫేస్బుక్ పేజీ) ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా పోలీసుశాఖకు పంపిన ‘మానవత్వ ధీర’ అవార్డును ఎస్పీ బి.రాజకుమారి విజయనగరం యూత్ ఫేస్బుక్ బృందం సభ్యులు షేక్ ఇల్తమాష్, నడుకూరి ఈశ్వరరావు (శివ), అయ్యప్ప, అమర్‌లకు అందజేశారు. వారిని అభినందించి, శాలువాలతో సత్కరించారు. రెండేళ్లుగా అనేక రకమైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను ఈ పేజీ సభ్యులు పొందారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఎస్పీ పీఏ కె.కృష్ణమూర్తి, పోలీసు పీఆర్ఓ కోటేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మానవత్వ ధీర అవార్డును ఫేస్బుక్ పేజీ ప్రతినిధులకు అందిస్తున్న ఎస్పీ రాజకుమారి -
పోలీస్ శాఖలో సంస్కరణలతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల క్రితం మొదలైన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. శనివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న పోలీసు శాఖలో క్రమం తప్పకుండా అర్హత ప్రాతిపదికన ప్రతి ఒక్కరికీ సకాలంలో పదోన్నతులు కలిగే పరిపాలన వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 181 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పించడం పోలీస్ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ‘రూల్ ఆఫ్ లా’ను పకడ్బందీగా అమలుపరిచేలా, ప్రజల ధన, మాన, ప్రాణాలకు భరోసాగా ఉండేలా పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుందన్నారు. పోలీసుల మనసెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు పోలీసుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూŠ, మరోవైపు వృత్తి పరమైన అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారని డీజీపీ తెలిపారు. సత్వర స్పందన, జవాబుదారీతనం పరమావధిగా.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు, మార్పు అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారని సవాంగ్ తెలిపారు. అందుకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర స్పందన, బాధ్యతాయుతమైన సేవలే పరమావధిగా అడుగులు వేశారన్నారు. ఏళ్ల తరబడి శాఖలో విధులు నిర్వహిస్తూ సరైన సమయంలో పదోన్నతులు లభించకపోవడంతో కానిస్టేబుల్ మొదలుకొని ఎస్పీ స్థాయి అధికారి వరకు నిరాశ, నిస్పృహలతో ఉన్నట్టు గుర్తించిన సీఎం ఏడేళ్లుగా పోలీస్ శాఖలో అసంపూర్తిగా మిగిలిపోయిన పదోన్నతులపై తాను ఇచ్చిన నివేదిక మేరకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారని గుర్తు చేశారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు రేంజ్‌ల పరిధిలోని పోలీస్ అధికారులు, పదోన్నతుల కమిటీ పలుమార్లు సమావేశం నిర్వహించి ఒకేసారి 181 మంది ఎస్సైల పదోన్నతులకు చర్యలు తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం దాదాపు ఏడేళ్ల పాటు ఇరు రాష్ట్రాల డీఎస్పీల మధ్య సీనియారిటీ సమస్య తెగక పదోన్నతులకు నోచుకోలేదన్నారు. అన్ని సమస్యలను అధిగమించి గత సెప్టెంబర్‌లో డీఎస్పీ సీనియారిటీ లిస్టులను సరిచేసి విభజన ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. దీనివల్ల వందలాది మంది డీఎస్పీలు ప్రమోషన్లు పొందినట్టు వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు వంటి వినూత్న చర్యలు తీసుకోవడంతోపాటు ఖాళీ పోస్టుల భర్తీ, పదోన్నతులు, జీతభత్యాలు, అవార్డులు, రివార్డులు, ఇంక్రిమెంట్లు వంటి అనేక విషయాల్లో మరింత ప్రోత్సాహం అందిస్తున్నారని డీజీపీ వివరించారు. -
మావోయిస్టు కీలకనేత లొంగుబాటు: రూ.20 లక్షలు ఆయనకే
సాక్షి, అమరావతి/ దుబ్బాక టౌన్: మావోయిస్టు కీలక నేత, ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ (ఏఓబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్న ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న, అలియాస్ కరుణ, అలియాస్ శరత్.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయాడు. ఇతను 22 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీలో చేరి, వివిధ హోదాల్లో పనిచేసిన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా జలంధర్ లొంగుబాటు పురస్కరించుకుని ఏపీ డీజీపీ సవాంగ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్లే.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతమై మావోయిస్టులకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి అడవి బాట.. రిటైర్డ్ వీఆర్వో ముత్తన్నగారి బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. ఇతని తాత పద్మారెడ్డి పోలీస్ పటేల్. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. గ్రామంలో పేరున్న ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1999–2000లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో పనిచేస్తూ పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో çవివిధ హోదాల్లో, పలు పేర్లతో పనిచేశాడు. 19 ఎదురుకాల్పుల సంఘటనలు, పలు పోలీస్స్టేషన్లపై దాడులతో పాటు 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనలోనూ జలంధర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతని ఇద్దరు సోదరుల్లో ఒకరు వ్యవసాయం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. బతికుండగా తమ కొడుకును చూస్తామనుకోలేదంటూ జలంధర్ లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి, సులోచన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్ -
'ఎస్వోపీ'తో సత్వర న్యాయం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో భాగంగా దళితులు, గిరిజనుల రక్షణ కోసం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)తో సత్వర న్యాయం అందుతుందని మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బుధవారం సచివాలయంలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వీటిపై అవగాహన క్పలించారు. గత ఏడేళ్లలో ఎన్నడూ జరగని ఈ కమిటీ సమావేశాలను తమ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనమన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో, మూడు నెలలకొకసారి జిల్లా స్థాయిలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆగస్టులో రాష్ట్ర స్థాయి సమావేశానికి సీఎం హాజరు కానున్నట్లు చెప్పారు. నేరాలు 13 శాతం తగ్గుముఖం: డీజీపీ సవాంగ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 13 శాతం తగ్గిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులుగా ఉన్న వారు తమ శాఖకు చెందిన వారైనా ఉపేక్షించకుండా ఇటీవల ఇద్దరు ఎస్ఐలు, ఒక సీఐపై చర్యలు తీసుకున్నామన్నారు. దర్యాప్తును 38 రోజుల్లో పూర్తి చేస్తున్నామన్నారు. ఉద్వేగానికి గురైన ఎమ్మెల్యే పద్మావతి అనంతపురంలో జోగిని, మాతంగి వ్యవస్థ పేరుతో ఎస్సీ మహిళలను బలి పశువులుగా మారుస్తున్నారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల బాలికలను సైతం విడిచి పెట్టడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. కేసుల నమోదులో నిర్లక్ష్యాన్ని సహించం: హోంమంత్రి సుచరిత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో నిర్లక్ష్యం చూపే పోలీసు అధికారులను క్షమించేది లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. అట్రాసిటీ చట్టం వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కేసు దర్యాప్తు, పురోగతిపై ఎప్పటికప్పుడు బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాలకు మంత్రులు హాజరు కావాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దీన్ని రూపొందించిన అధికారులను అభినందించారు. 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు బాధితులకు 7 రోజుల్లోగా ఎక్స్‌గ్రేíÙయా అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత పేర్కొన్నారు. 60 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించామన్నారు. -
అబ్బురపరిచిన ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్ విన్యాపాలు
-
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
సాక్షి, అమరావతి : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ పోలీస్ ఒకేసారి 48 జాతీయ అవార్డులు పొందటం గర్వించదగ్గ విషయయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోగలిగామని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశామన్నారు. 'మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా యాప్‌కి బంగారు పతకం వచ్చింది. పోలీస్ సేవలను ప్రజలకు అందించేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇంటినుంచే కావాల్సిన సమాచారం తెలుసుకొనే అవకాశం కల్పించాం. యాప్ ద్వారా 29 రోజుల్లోనే 32000 ఎఫ్ఐఆర్లు డౌన్ లోడ్ చేశారు. దాంతో పోలీస్ సేవా యాప్‌కి కూడా బంగారు పతకం వచ్చింది' అని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. (ఏపీ పోలీస్ నంబర్ వన్ ) సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సేవలు అందాలన్నది ప్రభుత్వ ఆదేశమని, టెక్నాలజీ వినియోగంతో అవినీతిని రూపుమాపాలన్నది సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు పారదర్శకత ,జవాబుదారీతనంతో ఏపీ పోలీస్ ముందుకు సాగుతోందని భవిష్యత్తులో టెక్నాలజిని పూర్తి స్థాయిలో వినియోగించి ఇంకా మార్పులు తెస్తామన్నారు. ఆన్లైన్ గేమింగ్ ,గ్యాంబ్లింగ్ ,బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని గంజాయి, డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి వాటిపై కూడా ఉక్కుపాదం మోపుతామని డీజీపీ వెల్లడించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టామని, టెక్నాలజీ వాడి తప్పించుకోవాలని చూసినా ట్రాక్ చేస్తామని హెచ్చరించారు. (48 స్కోచ్ గ్రూపు అవార్డులు దక్కించుకున్న ఏపీ ) -
పోలీస్.. మరింత ఫ్రెండ్లీ
పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసమే. వారికి మరింత సమర్థవంతంగా సేవలు అందించడంలో భాగంగా ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఇవాళ ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఈ సందర్భంగా పోలీసులు చట్టాన్ని కాపాడటం కోసమే అధికారాలు ఉపయోగించాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పోలీసులు అంటే సేవకులని, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వారు కూడా మన కుటుంబ సభ్యులే అని భావించి ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందన్నారు. పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఏపీ పోలీస్ సేవ (సిటిజెన్ సర్వీసెస్ అప్లికేషన్) యాప్’ను సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కేంద్రాల నుంచి పాల్గొన్న 46 వేల మంది పోలీస్ యంత్రాంగాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు – పోలీసులు అంటే ఒక బలగం లేదా ఒక శక్తిగా కాకుండా, సేవలందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్ ఫ్రెండ్లీకి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్ ద్వారా పౌరులకు ఆరు విభాగాలలో 87 రకాల సేవలు అందుతాయి. ఇళ్ల భద్రత మొదలు ఏ అవసరం కోసం అయినా యాప్ ఉపయోగపడుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. – సర్టిఫికెట్ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్స్‌లు రెన్యువల్ చేయించుకోవాలన్నా, ఎన్ఓసీ కావాలన్నా పోలీస్ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్ఐఆర్ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం – మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్ చేర్చారు. దిశ యాప్ కూడా అనుసంధానం చేశారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా 6 మాడ్యూల్స్ ఉన్నాయి. చిన్న ప్రమాదం జరిగినా, దాన్ని రిపోర్టు చేయడంతోపాటు, ఆస్పత్రికి తరలించే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. – సైబర్ నేరాలకు సంబంధించి కూడా దాదాపు 15 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ నేరాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా యాప్ ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంలో వాస్తవం ఏమిటన్నది కూడా తెలుసుకోవచ్చు. “ఫ్యాక్టŠస్ చెక్’ అన్న ఫీచర్ కూడా ఇందులో ఉంది. – పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్ మీడియా కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రామ పోలీసులతో అనుసంధానం – ఇప్పటికే పోలీస్ సేవలు గ్రామ గ్రామానికి చేరాయి. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వాటిలో మహిళా పోలీసులను కూడా నియమించాం. వీరి ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. ఈ యాప్‌లో గ్రామ పోలీసులను కూడా అనుసంధానం చేశాం. – దేశంలోనే తొలిసారిగా దిశ యాప్ తీసుకొచ్చాం. ఇది ఎంతో సక్సెస్ అయింది. 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది గర్వకారణం. దిశ యాప్ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం. – సైబర్ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్ నంబర్‌ను ఫేస్బుక్లో అందుబాటులోకి తెచ్చాం. – న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలో “ఇంటర్–ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్’ (ఐసీజెఎస్) ప్రవేశపెట్టాం. ఈ విధానం ద్వారా ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది. ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ – నేరాన్ని నిరోధించడం, నేరాలపై విచారణ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, సమాజంలో నేరాలు జరగకుండా చేయడమే లక్ష్యం. వారి పని ఇంకా సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థను తెచ్చాము. – వీలైనంత పారదర్శకంగా వ్యవస్థను మార్చుకోవడం, ఒక ఫిర్యాదు చేయాలన్నా, ఒక ఎఫ్ఐఆర్ కాపీ పొందాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు. – ఈ కార్యక్రమంలో సీఎం జగన్ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోలీస్ ఫీల్డ్ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లను అందజేశారు. పోలీస్ శాఖ పక్షాన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక శాటిలైట్ ఫోన్‌ను సీఎంకు అందజేశారు. మహిళలకు మరింత భద్రత మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశారు. ఇప్పుడు 6 విభాగాల్లో 87 రకాల సేవలందించేలా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ఒక వారోత్సవం నిర్వహిస్తే బాగుంటుంది. – మేకతోటి సుచరిత, హోం మంత్రి పోలీస్ చరిత్రలో మరిచిపోలేని రోజు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నందుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇవాళ ఈ యాప్ ఆవిష్కరణ వల్ల ఏపీ పోలీస్ చరిత్రలో మరిచిపోలేని రోజు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా
సాక్షి, అమరావతి: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీలను డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను జియో ట్యాగింగ్ చేయాలని సూచించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజీపీ ప్రకటనలోని అంశాలు.. ► పెట్రోలింగ్‌ను పటిష్టపరచడంతో పాటు సోషల్ మీడియా పుకార్లపై నిఘా పెట్టాలి. మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలు కాపాడేందుకు సహకరించేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం– 2013 ప్రకారం దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చాలి. సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. దేవాలయాలకు ఫైర్, ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడంతో పాటు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలి. ► ఈ అంశాలపై నిర్వాహకులకు పోలీసు సిబ్బంది అవగాహన కల్పించాలి. ► అంతర్వేది ఆలయంలో స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకరం. ► ‘ఈ ఘటనను ఆసరాగా చేసుకుని మత సామరస్యానికి ప్రతీకగా ఉండే రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. అని డీజీపీ పేర్కొన్నారు. ఈమేరకు ట్వీట్ కూడా చేశారు. -
ఈ అలజడి ఎవరి మనోరథం?
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఘటనపై తక్షణం స్పందిస్తూ వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ ఘటన దురదృష్టకరమని, బాధ్యులు ఎవరైనాసరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇంత చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తుంటే కొందరు పనిగట్టుకుని దీన్ని రాజకీయం చేస్తూ.. ప్రజల్లో అలజడి సృష్టించాలని పన్నాగం పన్నినట్లు జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ ఘటన ఆధారంగా రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సత్వరమే స్పందించిన ప్రభుత్వం – జిల్లా మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర అధికారులు ఆదివారం ఉదయమే ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంలు ఆధారాలు సేకరించాయి. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అగ్నిమాపక, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో ఓ కమిటీని నియమించారు. – విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఆలయ కార్యనిర్వాహణ అధికారి(ఈవో) నల్లం సూర్య చక్రధరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో యర్రశెట్టి భద్రజీరావును కొత్త ఈవోగా నియమించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ సిబ్బంది, భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంది. – రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు వేణగోపాలకృష్ణ, పినెపి విశ్వరూప్ రెండవసారి మంగళవారం అంతర్వేది వెళ్లి దర్యాప్తు తీరును సమీక్షించారు. – కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు వెంటనే మంజూరు చేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త రథం తయారవుతుందని మంత్రి వెలంపల్లి ప్రకటించారు. కుట్రకు యత్నిస్తున్న అసాంఘిక శక్తులు – ఈ ఘటనలో ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని కుట్రలు పన్నుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బయట నుంచి అసాంఘిక శక్తులను అంతర్వేదిలోకి పంపించి మరీ ఉద్రిక్తతలను సృష్టించడానికి యత్నించడం వారి కుట్రను తేటతెల్లం చేస్తోంది. – ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ నేతలు ముగ్గురితో కమిటీ వేశారు. ఆ కమిటీ ఆలయాన్ని పరిశీలించి రాజకీయ విమర్శలు చేయడం ద్వారా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు యత్నించడం గమనార్హం. – ఆ మర్నాడే కొందరు అసాంఘిక శక్తులు అంతర్వేదిలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు రంగంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ముగ్గురు మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు మంగళవారం నానా రభస చేయడమే కాకుండా దాడులకు తెగించడం గమనార్హం. విజయవాడ నుంచి వచ్చిన కొందరు ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. – వారు ఏకంగా అంతర్వేదిలో ఓ ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడం ఆందోళనకరంగా మారింది. ఉద్దేశ పూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించడానికే ఇంతకు తెగించారన్నది స్పష్టమవుతోంది. ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో వర్గ ఘర్షణలను రేకెత్తించడానికి రాజకీయ శక్తులు పకడ్బందీగా పన్నాగం పన్నుతున్నాయన్నది తేటతెల్లమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు అగ్రప్రాధాన్యం – ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా ఉండాలని పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదనపు పోలీసు బలగాలను అంతర్వేదికి పంపింది. – రాళ్లు రువ్వి అంతర్వేదిలో అలజడులు సృష్టించేందుకు యత్నించిన దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యాక్ట్ 30ని విధించారు. బయట వ్యక్తులు ఎవరూ అంతర్వేదిలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించారు. – అదనపు డీజీ(శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ అంతర్వేదిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మంగళవారం రాత్రి విజయవాడ వచ్చి డీజీపీ గౌతం సవాంగ్‌కు పరిస్థితిని వివరించారు. – ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావును అంతర్వేదిలో క్యాంప్ చేయాల్సిందిగా డీజీపీ సవాంగ్ ఆదేశించారు. ప్రస్తుతం అంతర్వేదిలో పరిస్థితి అంతా అదుపులో ఉంది. ఎంతటివారినైనా ఉపేక్షించం అంతర్వేది ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశాం. కేసు దర్యాప్తులో ఇప్పటికే పురోగతి సాధించాం. పూర్తి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తాం. దోషులు ఎంతటి వారైనాసరే ఉపేక్షించం. మరోవైపు ఈ సంఘటనను అవకాశంగా చేసుకుని సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించాలని యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పరిస్థితి అంతా అదుపులో ఉంది. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. – గౌతం సవాంగ్, డీజీపీ -
సైబర్ క్రైమ్‌పై అవగాహనకు ఈ-రక్షాబంధన్
సాక్షి, అమరావతి : మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి తీసుకొచ్చిన ఈ-రక్షాబంధన్ బాగా పాపులర్ అయ్యిందని సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే మీమ్స్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా 6 కోట్లమంది వీక్షించారని అయితే పలాస్ సినిమాకు వచ్చిన పాపులారిటీ ఈ-రక్షాబంధన్‌కు సైతం రావాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగినపుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలిపాం. police4u.com ద్వారా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆన్ లైన్ క్లాసులు, బ్యాంకింగ్ కోసం ఎక్కువమంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే బ్యాంకు వివరాలు ఏ ఆన్ లైన్ గేమ్‌లోనూ ఇవ్వద్దు. 80% మంది సైబర్ క్రైమ్ ద్వారా డబ్బు పోగొట్టుకున్నారు. ఇప్పటికే 2,28,982 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువకులే అధికం. సైబర్ క్రైమ్ విషయంలో పోలీసు స్టేషన్‌కు వెళ్ళాలని చాలామందిలో అవగాహన ఉందని సునీల్ కుమార్ వెల్లడించారు. (ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం) భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మహిళలకు, పిల్లలకు సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడమే ఈ-రక్షాబంధన్ ఉద్దేశమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సైబర్ స్పేస్ లో ఎక్కువగా ఉంటున్నందున ముఖ్యంగా మహిళలు ఈ అవగాహన కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. దిశ ఒక చట్టమే కాకుండా, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు కలిగి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మహిళ భద్రత కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కాలేజీలు, స్కూళ్ళ విద్యార్ధినుల చేసిన అభిప్రాయాలు అభినందనీయమన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారూ ఈ-రక్షాబంధన్ ద్వారా లబ్ధి పొందారని వివరించారు. సైబర్ బుల్లింగ్ ఎక్కువగా ఉంది : సమంత మహిళలను, పిల్లలను ఆన్ లైన్ మోసాల నుంచీ రక్షించడం చాలా అభినందనీయమన్నారు సినీనటి అక్కినేని సమంత. ప్రస్తుతం సైబర్ బుల్లింగ్ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్న సమంత..దీని అడ్డుకట్ట వేయడంలో ఈ- రక్షాబంధన్ విజయవంతమైందన్నారు. ఈ-రక్షాబంధన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం పట్ల సంతోషిస్తున్నాను.ఈ కార్యక్రమం స్త్రీలకు ఒక సోదరుడిలా పనిచేసిందని సమంత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఇచ్చిన యూట్యూబ్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ , భారత మహిళా క్రికెటర్ రావి కల్పన తెలిపారు. సీఎం జగన్ ఆలోచనల నుంచి పుట్టిన దిశా చట్టం మహిళలకి కొండంత భరోసా ఇస్తోందని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. -
సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో డీజీపీ వీడియోకాన్ఫరెన్స్
సాక్షి, విజయవాడ : సుగాలి ప్రీతి కేసుపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో సవాంగ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐకి కేసు అప్పగించడంలో జాప్యానికి గల కారణాలను లా అండ్ ఆర్డర్ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీకి తెలిపారు. కేసు విషయంలో సుగాలి ప్రీతి తల్లి అనుమానాలను రవిశంకర్ నివృత్తి చేశారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇప్పటికే సీబీఐ ఎస్పీ విక్రమాధిత్యకు కేసు వివరాలు అందించామని రవిశంకర్ తెలిపారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే సీబీఐ కేసు విచారణ మొదలుపెడుతుందని పేర్కొన్నారు. కేసుని సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎక్కడా జాప్యం చేయలేదన్నారు. -
జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ పోలీస్‌శాఖ
సాక్షి, అమరావతి : టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్‌శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకోగా తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను గెలుచుకొని పోలీస్ శాఖ సత్తా చాటింది. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ వెబినార్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. (చదవండి : స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్) -
పీఎస్‌లో యువకుడికి శిరోముండనం
సీతానగరం (రాజానగరం)/ఏలూరు టౌన్/సాక్షి, అమరావతి: కారు అద్దాలు పగులకొట్టాడంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న ఎస్సీ యువకుడికి పోలీస్‌స్టేషన్‌లోనే శిరోముండనం చేసిన ఘటనలో ఇన్చార్జ్ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను మంగళవారం సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన ఘటన వివరాలిలా.. ► ఈ నెల 18 రాత్రి మునికూడలి గ్రామం వద్ద ఇసుక లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది. ► దీంతో కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ► అదే సమయంలో కారులో అటుగా వచ్చిన మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త కవల కృష్ణమూర్తి ‘ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.. లారీని వదిలేయండి’ అని చెప్పడంతో ఆ యువకులు ఆయనతో కూడా గొడవకు దిగి కారు అద్దాలను పగులగొట్టారు. అడ్డుకోబోయిన అడప పుష్కరం అనే అతడిని కొట్టారు. ► దీంతో గొడవ పడిన ఐదుగురు యువకులపై అడప పుష్కరం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► ఆ ఫిర్యాదు మేరకు సోమవారం ఇన్చార్జ్ ఎస్సై ఫిరోజ్ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ట్రిమ్మర్ తెప్పించి అతడి గడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించి విడిచిపెట్టారు. ► ఈ విషయం వాట్సాప్‌లో హల్చల్ చేయడంతో మంగళవారం దళిత సంఘాలు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బాజ్‌పాయ్ దృష్టికి తీసుకువెళ్లాయి. ► ఘటనను మంత్రులు సుచరిత, ఆదిమూలపు సురేశ్ ఖండించారు. మంత్రి విశ్వరూప్ రాజమండ్రి ఆస్పత్రిలో బాధితుడు ప్రసాద్‌ని పరామర్శించారు. తక్షణ చర్యలకు సీఎం ఆదేశం దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన డీజీపీ యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సై ఫిరోజ్ షాతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతోపాటు ఎస్సైని అరెస్టు చేశారు. ఎస్సై, కానిస్టేబుళ్లపై సెక్షన్ 324, 323, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 3(1)(5), 3(2)(వి) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. -
ఎస్ఈబీతో మంచి ఫలితాలు
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాల నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్ఈబీ) మంచి ఫలితాలు సాధిస్తోందని ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగింది. సమావేశంలో తీర ప్రాంత గస్తీ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిజం, ఉగ్రవాద కార్యకలాపాలు, మనుషుల అక్రమ రవాణా, ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశామన్నారు. ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించిన డీజీపీ మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో ఫైరింగ్ రేంజ్‌ను శనివారం సందర్శించిన డీజీపీ సవాంగ్.. రాష్ట్ర పోలీసు శాఖ సమకూర్చుకున్న అత్యాధునిక ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించారు. ► ఇజ్రాయిల్ సహకారంతో రూపొందించిన ఆధునిక ఆయుధాలను టెస్ట్ ఫైర్ చేసి పరిశీలించి, ఐపీఎస్ అధికారులకు అందించారు. ► అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్, టెస్ట్ ఫైరింగ్ కార్యక్రమాన్ని పీఅండ్ఎల్ నాగేంద్రకుమార్, ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఐజీ ట్రైనింగ్ సంజయ్ నిర్వహించారు. -
45 మంది పోలీసులు కోలుకున్నారు
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా బారిన పడిన 45 మంది పోలీసులు పూర్తిగా కోలుకున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. లాక్డౌన్లో ఏపీ పోలీస్ పాత్రపై మీడియాకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే.. ► పోలీస్ సిబ్బందికి కావాల్సిన మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు అందిస్తూ, రెడ్జోన్లలో విధులు నిర్వహిస్తున్న వారికి పీపీఈ కిట్లను అందించాం. ► 55 ఏళ్లు పైబడిన వారిని, ఆరోగ్య సమస్యలున్న సిబ్బందిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాం. రాష్ట్రంలో కోవిడ్ విధులు నిర్వహిస్తున్న 45 మంది పోలీస్ సిబ్బందికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడంతో వారికి వైద్య చికిత్సలు అందించి కోలుకునేలా చేశాం. తగిన జాగ్రత్తల వల్ల గత రెండు వారాలుగా పోలీసు సిబ్బంది ఎవరికీ వైరస్ సోకలేదు. -
‘తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు’
-
అబద్ధపు ప్రచారం క్రాస్ చెక్ ఇలా
సాక్షి, అమరావతి: కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని క్రాస్‌చెక్ చేసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చింది. సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఈ వాట్సాప్ నంబర్‌ను డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తదితరులు బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ వీడియో ద్వారా బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్ధార్థ, అడవి శేషు, సామాజిక కార్యకర్త కొండవీటి సత్యవతిలు ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ► సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు వాట్సాప్ చేస్తే ...ఆయా వర్గాల వివరణ తీసుకొని వాస్తవ సమాచారం అందిస్తాం. ► నిజాలను ప్రచారం చేసి ప్రజలకు భరోసా కల్పిస్తాం. సమాచారంలో నాణ్యత కావాల్సిన సమయం ఇది. ► చాలా మంది కావాలని తప్పుడు ప్రచారం చేసేవారు తప్పించుకోలేరు. ఆలస్యమైనా శిక్ష తప్పకుండా పడుతుంది. ► లాక్డౌన్ సమయంలో మహిళా బాధితులకు అండగా ఉంటాం. ఎంతో మందికి ఉపయోగం కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేసేందుకు పోలీసు శాఖ వాట్సాప్ నంబర్ తీసుకరావడం ఎంతో మందికి ఉపయోగం. –పీవీ సింధు, బాడ్మింటన్ క్రీడాకారిణి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి సెలబ్రిటీలు, మహిళలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో కుటుంబ పెద్దలు కూడా చాలా సార్లు తప్పుడు ప్రచారాన్ని నమ్ముతుంటారు. వీటిని అధిగమించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. – అడవి శేష్, సినీ నటుడు -
తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: తనను, తమ పార్టీని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌ను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. ట్విట్టర్, ఫేస్బుక్, హెలో తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లకు సంబంధించిన ఆధారాలు, వాటి అడ్రస్ లింక్‌లు, పోస్టింగ్‌లను డీజీపీకి మంగళవారం ఆయన అందజేశారు. తన ఫొటోతో కార్టూన్స్ పెట్టి అసభ్య పదజాలంతో కొందరు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. రాజ్యసభ ఎంపీగా, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనను కించపరిచేలా, మనసును గాయపరిచేలా, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ పోస్టులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అత్యవసరమైతే పోలీస్ పాస్ తీసుకోండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ. ► లాక్డౌన్ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం. ► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది. ► పాస్ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. ► పాస్ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. -
కోవిడ్-19 టెస్ట్ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తయారైనా కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ భార్గవ్ ఇతక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’ కాగా.. రాష్ట్రంలో తాజాగా మరో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. కొత్తగా నమోదైన 15కేసుల్లో నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. -
మీ రక్షణ.. మా బాధ్యత
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ కట్టడికి తమ వంతు ప్రయత్నంగా అలుపెరుగని యుద్ధం చేస్తున్న ఏపీ పోలీస్ శాఖ ‘మీ రక్షణ.. మా బాధ్యత’అంటూ సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ సందేశంతో కూడిన రెండు నిమిషాల నిడివిగల వీడియోను శనివారం యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ► కుటుంబాలకు దూరంగా రోడ్డుపైనే విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల చిత్రాలు, అన్న పానీయాలు రోడ్డు పక్కనే తింటున్న దృశ్యాలతో పాటు.. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటిద్దాం.. మన దేశాన్ని రక్షించుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం.. అనే సందేశంతో ఈ వీడియో ముగుస్తుంది. ► పోలీసులకు 50 వేల మాస్కులు అందించిన ‘స్పిన్టెక్స్’ ► పోలీస్ సిబ్బంది కోసం స్పిన్టెక్స్ లిమిటెడ్ అధినేత ఎంవీ సుధాకర్ 50 వేల మాస్క్‌లను అందించారు. ► మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌కు వీటిని అందజేశారు. ► పోలీస్ శాఖలోని నాలుగు వేల మంది మహిళలకు, వారి కుటుంబాలకు వీటిని అందజేయాలని పోలీస్ అధికారులను డీజీపీ ఆదేశించారు. -
కొత్త సవాల్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాం
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట: మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా రాష్ట్రానికి కరోనా వైరస్ వచ్చిందని, ఈ పరిస్థితి చక్కబడుతున్న దశలో ఊహించని విధంగా ఢిల్లీలో మత సమావేశానికి హాజరైన వారి ద్వారా కొత్త సవాలు ఎదురైందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఛాలెంజ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద గల ఏపీ–తెలంగాణ బోర్డర్ చెక్‌పోస్ట్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. గరికపాడు చెక్‌పోస్ట్ నుంచి ల్యాప్‌ట్యాప్ ద్వారా రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల పోలీస్ ఇన్చార్జిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఏమన్నారంటే.. ► ఏపీ నుంచి 1,085 మంది ఢిల్లీ సమావేశానికి హాజరైనట్లు గుర్తించాం. ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ► వైరస్ బాధితులు ఆలస్యం చేసేకొద్దీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి వారు ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలని, క్వారంటైన్‌కు వెళ్లాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ► బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య చాలా బాధాకరమని సీఎం ఈ రోజు ఉదయం నాతో అన్నారు. దీనిపై వివరాలడిగి.. పోలీస్ సిబ్బంది ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించారు. ► బాపట్ల ఘటనపై విచారణకు ఆదేశించాం. లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై పోలీసులకు సహకరించాలి. ► కరోనా కేసుల విషయంలో కులం, మతం, ప్రాంతం, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి ద్వారా వైరస్ విస్తరించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర సరుకులు, అత్యవసర పనులపై వచ్చే వాహనాలకు అనుమతి. -
లారీ డ్రైవర్లకు ఆహార పొట్లాట్లు అందించిన డీజీపీ
-
ధైర్యంగా ఉండండి
సాక్షి, అమరావతి: ‘మీరెవరూ నిబ్బరం కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయ్’ అని లండన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ భరోసా ఇచ్చారు. కోవిడ్–19 కారణంగా ఈనెల 20 నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో చివరి నిమిషంలో హిత్రూ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు, ప్రయాణికులు ప్రస్తుతం లండన్‌లోనే ఉంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఏపీకి చెందిన 29 మంది అక్కడే ఉండిపోయారు. విమానాలు నిలిపివేయడంతో తామంతా అక్కడ చిక్కుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్ఆర్టీ కంట్రోల్ రూమ్, సీఐడీ ఎన్ఆర్ఐ సెల్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన డీజీపీ సవాంగ్ ఏపీ సీఐడీ (ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీల సమన్వయంతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. విద్యార్థుల గోడు ఇది.. అల్లూరి గోపాల్ అనుకోకుండా లండన్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాం. ఈ నెల 20 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన చొరవతో ఇక్కడ ఐదు రోజులు మాకు ఏర్పాట్లు బాగానే చేశారు. తర్వాత కొంత ఇబ్బందిగా మారింది. తాత్కాలిక షెల్టర్లలో ఉంటున్నాః. ఆహారం ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. యుగసాయి, కార్తీక్‌రెడ్డి, గంగిరెడ్డి ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆహారానికి ఇబ్బందిగా ఉంది. బయటకెళ్లి ఆహారం తెచ్చుకుందామంటే పోలీసులు పట్టుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా వైరస్ వస్తుందనే భయం వెంటాడుతోంది. నెలనూతల కార్తీక్, మరి కొందరు విద్యార్థులు దేశంలో ఎవరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్య తెలుసుకుని స్పందించడం, వెంటనే డీజీపీ మాతో మాట్లాడటం చాలా ధైర్యాన్నిచ్చింది. కరోనా వైరస్ ప్రభావం మాపైనా పడుతుందేమోననే భయమేస్తోంది. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తక్షణమే మమ్మల్ని ఇండియా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. డీజీపీ ఏం భరోసా ఇచ్చారంటే.. ► మీరెవరూ ఆందోళన చెందొద్దు. ధైర్యంగా ఉండండి. మీ ఇబ్బందులను తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాను. ► వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ► మీకు ఏపీ సీఐడీ (ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీ అందుబాటులో ఉంటాయి. ► ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి వారితో వీడియో కాల్లో మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది లండన్‌లో చిక్కుకున్న మన వాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. అక్కడ చిక్కుకున్న వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. విదేశాంగ శాఖ, హోం శాఖ అధికారులు, లండన్‌లోని ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు లండన్‌లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. వీరిని వీలైనంత త్వరగా ఏపీకి పంపేలా చేస్తున్నాం. – యూరప్‌లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కందుల రవీందర్‌రెడ్డి -
వారికి స్టేషన్లోనే విధులు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలో 55 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలున్న వారిని కరోనా విధుల నుంచి తప్పించి పోలీస్ స్టేషన్లోనే ఉండేలా విధులు అప్పగిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ప్రతి జిల్లాలోనూ పోలీస్ ఫ్యామిలీ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 7,060 మందిపై కేసులను నమోదు చేశామన్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. విజయవాడలో డీజీపీ సవాంగ్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని రాణిగారితోట, పాత పోలీస్ కంట్రోల్ రూమ్ సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, పీవీపీ మాల్ సెంటర్, రైల్వే స్టేషన్, మున్సిపల్ సర్కిల్ సెంటర్, బెంజ్ సర్కిల్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రతి సెంటర్లోనూ ఆగి లాక్డౌన్ అమలు తీరును విధుల్లో ఉన్న పోలీసులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఆదివారం కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ప్రజలెవరూ బయటకు రాకుండా ఉంటేలా లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని సూచించారు. పలు చోట్ల ప్రజలను కలిసి వారి నుంచి వివరాలు సేకరించిన డీజీపీ లాక్డౌన్ సమయంలో బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అనుమతించిన వేళల్లో నిత్యావసర సరుకుల కోసం వెళితే భౌతిక దూరం పాటించాలని డీజీపీ కోరారు. కరోనాపై పోలీస్ కంట్రోల్ రూమ్‌లు రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తిని నిరోధించేందుకు, ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన డీజీపీ కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. ఏపీ స్టేట్ కోవిడ్–19 ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ 08662469926, 9182361331తోపాటు ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ 08632340471, 08632340473, 7382938775 నంబర్లు పని చేస్తాయని తెలిపారు. వీటితోపాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చెందిన డయల్ 1902 ద్వారా తక్షణ సేవలు అందిస్తామన్నారు. -
అమరావతిలో ‘కరోనా’ అనుమానితులు!
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం చెప్పకుండా అమరావతి, గుంటూరులో రహస్యంగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వారంతా కరోనా అనుమానిత జాబితాలో ఉన్నందున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలకు సహకరించాలన్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్లో లాక్డౌన్ అమలు తీరును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. - డయల్ 100లో వచ్చిన 320 కాల్స్ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం వచ్చింది. అలాంటి వారు వారంతా స్వయంగా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. - అనుమానితులకు వైద్య పరీక్షలు చేసి కరోనా పాజిటివ్ వస్తే హాస్పిటల్‌కు, లేకుంటే హౌస్ క్వారంటైన్‌కు తరలిస్తామే తప్ప ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు. - విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ‘హౌస్ క్వారంటైన్ యాప్’లో నమోదు చేస్తున్నాం. - కరోనా వైరస్ తీవ్రతను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించినందున లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం. నిత్యావసర సరుకుల వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. - ఇప్పటి వరకు వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చర్యలు ఉంటాయి. -
ఆశ్రయమిచ్చిన వారిపై కేసులు : డీజీపీ
సాక్షి, విజయవాడ : ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణలో మనల్ని మనం కాపాడుకుందామని సూచించారు. అమరావతి గ్రామాల్లో కొందరు సమాచారం ఇవ్వకుండా దాక్కున్నారని తెలిసిందన్నారు. ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిపై కేసుల నమోదు చేస్తామన్నారు. చుట్టూ ఉన్న సమాజానికి నష్టం చేయొద్దన్నారు. 45 వేల మందికిపైగా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. వీరంతా వెంటనే వైద్య బృందాలకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని కోరారు. ఇదంతా మీ కుటుంబ సభ్యుల కోసమేనని తెలుసుకోవాలని పేర్కొన్నారు. పోలీసులకు అందరూ సహకరించాలన్నారు. వైరస్ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్ చేద్దామని తెలిపారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉందామన్నారు. ఖాళీ రోడ్లపై యాక్సిడెంట్లు జరిగిన విషయం తెలిసిందన్నారు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండేలా ఆదేశాలిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. -
విదేశాల నుంచి వచ్చిన వారికి లక్ష్మణరేఖ
సాక్షి, విజయవాడ : ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక నిపుణులతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసుశాఖను ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా వ్యాప్తిని ఆరికట్టే నేపథ్యంలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. దీనిలో భాగంగా విదేశాలనుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి పోలీసులు లక్ష్మణరేఖ గీస్తున్నారు. హౌస్ క్వారంటైన్ యాప్ పేరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను పోలీసులు పొందుపరిచారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను పోలీసులు నమోదు చేయనున్నారు. అప్లికేషన్లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్‌కు ఆటో మేటిక్‌గా సమాచారం వస్తుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో తన మేధస్సును నిబద్ధతను చాటి చెబుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
సహకరించకపోతే కేసులు తప్పవు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు కేసులు తప్పవని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతంలో లాక్డౌన్ అమలు జరుగుతున్న తీరును మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. కరోనా వైరస్ బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రధాని మోదీ, రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలంతా సహకరించాలన్నారు. మనందరి కోసం ఇలా.. - చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని గుర్తించి ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. - విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని పోలీసులు, వైద్యులు, రెవెన్యూ అధికారులకు చెప్పి తీరాల్సిందే. రహస్యంగా ఉంచితే కేసులు పెట్టి, పాస్‌పోర్టులు సీజ్ చేస్తాం. - అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలి. అప్పుడు కూడా కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి. అవసరం లేకున్నా బయటకు వస్తే కేసులు పెట్టి, వాహనాలు సీజ్ చేస్తాం. ఇలా ఇప్పటి వరకు 2,300 కేసులు పెట్టాం. మంగళవారం ఒక్క రోజే 330 కేసులు నమోదు చేశాం. - నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఉదయం 6 గంటల నుంచి 8 వరకు పాలు, కూరగాయలు వంటివి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నాం. అవసరాన్ని బట్టి వేళలు సడలిస్తాం. రాష్ట్రమంతటా ఒకే వేళల్లో నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేలా ఒక పద్దతి పెట్టాలని భావిస్తున్నాం. - ఏ ఇబ్బంది వచ్చినా కోవిడ్ –19 కంట్రోల్ రూమ్, 104కు కాల్ చేయాలని సూచించాం. డయల్ 100ను కూడా ఉపయోగించుకుంటున్నారు. జిల్లాల్లో రాకపోకలు బంద్: డీజీపీ రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను రాకపోకలు నిలిపివేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ ప్రమాదం తీవ్రంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను బయట తిరిగేందుకు అనుమతించబోమన్నారు. జనతా కర్ఫ్యూకు బాగా సహకరించిన ప్రజలు సోమవారం రోడ్లపైకి రావడం ప్రమాదభరితంగా మారిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం పోలీసు ఆంక్షలు కఠినతరం చేయడంతో ప్రజలు అత్యధికశాతం ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పారు. కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జర్నలిస్టులకు నిబంధనలు సడలించి అనుమతిస్తామన్నారు. అయితే వారంతా విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నప్పుడు గుర్తింపు కార్డు వెంట తీసుకుని వెళ్లాలని డీజీపీ చెప్పారు. -
ప్రజల కోసమే పోలీస్ ఆంక్షలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కఠినమైన ఆంక్షలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా విజయవంతం చేసిన ప్రజలు ఈ నెల 31 వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. లాక్డౌన్ అమలుకు స్వచ్ఛందంగా ప్రజలు సహకరించే పరిస్థితి లేకపోవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు రోడ్లపైకి వచ్చి తగు చర్యలు చేపట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాలతోపాటు అనేక పట్టణాలు, జిల్లా కేంద్రాలు, గ్రామాల్లోనూ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు కరోనా పాజిటివ్ కేసులు ఏమైనా ఉన్నాయా? అనే విషయమై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. గ్రామ, వార్డు వలంటీర్ల సాయంతో ఆయా ప్రాంతాల్లో వైద్య, రెవెన్యూ సిబ్బంది, తదితరులతో కూడిన టీమ్‌కు పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పించారు. విదేశాల నుంచి ఇటీవల ఎవరైనా వచ్చారా? అనే విషయాన్ని ఆరా తీసేందుకు పోలీసులు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ కాలంనాటి 1897 చట్టాన్ని ‘ఆంధ్రప్రదేశ్ అంటు వ్యాధి కొవిడ్–19 రెగ్యులేషన్ 2020’గా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటు వ్యాధుల చట్టం –1897లోని సెక్షన్ 2,3,4 ప్రకారం కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. తద్వారా గాలి, మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసరం మినహా సకల వ్యవస్థలను దిగ్బంధించే ప్రయత్నం చేస్తారు. దీన్నే లాక్‌డౌన్‌గా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితి, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ తీవ్రత ప్రజలకు అర్థమయ్యేలా తొలుత సహనంతోనే సమాధానం చెప్పాలని, స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సహకరించకపోతే కఠినంగానే వ్యవహరించాలన్నారు. దుకాణదారులు, వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. -
మీడియాకు ఎలా లీకైంది?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పేరుతో లేఖను లీక్ చేసిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గురువారం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై డీజీపీ దృష్టి సారించారు. ఎస్ఈసీ లేఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలన్నీ పథకం ప్రకారమేననే అనుమానాలు బలపడుతున్నాయి. లేఖ లీక్ వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీసులు ప్రధానంగా మీడియా వైపు నుంచి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. - మీడియాకు ఆ లేఖ ఎలా చేరింది? ఎవరు చేరవేశారు? అలా చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అందువల్ల కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. - రాష్ట్రంలో ప్రధానంగా ఐదు మీడియా సంస్థలకు ఈ లేఖ లీకైనట్టు పోలీసులు గుర్తించారు. ఆయా మీడియా ప్రతినిధులకు వాట్సాప్ ద్వారా రాజకీయ నాయకుల నుంచి ఈ లేఖ వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీడీపీ అనుకూలమైన మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనం కోసం ఇదంతా చేశాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. - ఎస్ఈసీ లేఖ మీడియాలో ప్రసారం అయ్యేలా ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చక్రం తిప్పినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులకు మొదట ఆయన ఫోన్ చేసి లేఖ విషయంలో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దాదాపు 30 నిముషాల వ్యవధిలో ఐదుగురు మీడియా ప్రతినిధులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి ఈ విషయాన్ని బ్లాస్ట్ చేయాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే వారి వాట్సాప్‌లకు లేఖ లీక్ చేయడం, ఓ వర్గం మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడం జరిగిపోయాయి. - ఎస్ఈసీ ఇదే లేఖను కేంద్ర హోంశాఖకు మెయిల్ ద్వారా పంపి ఉంటే ఎలా లీకైందనే అంశంపైనా దృష్టి పెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మెయిల్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగానే జరుపుతారు. అలాంటప్పుడు లేఖను లీక్ చేయడం పెద్ద నేరమే అవుతుంది. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. - ఈ లేఖను అడ్డుపెట్టుకుని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా సంస్థలు కలసికట్టుగా పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే యత్నం చేశాయి. ఇందులో ప్రధానంగా ఓ మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత ఒకరు చక్రం తిప్పినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో లేఖ లీకుపై పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. -
ఆ లేఖ వెనుక రాజకీయ కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్నంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. లేఖపై ఎస్ఈసీ స్పష్టత ఇవ్వకున్నా ఎల్లో మీడియా కథనాలు వండి వార్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల కమిషనర్ లేఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయటాన్ని ఖండించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జోగి రమేష్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కైలే అనిల్‌కుమార్ తదితరులు డీజీపీ సవాంగ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. డీజీపీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులో ముఖ్యాంశాలు .. 1 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారిక లెటర్ హెడ్‌పై, ఆయన చేశారంటున్న సంతకంతో ఓ వర్గం మీడియా ద్వారా విడుదలైన లేఖ రాజ్యాంగబద్ధ పదవి హోదాను దిగజార్చేలా ఉంది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన అధికారి ఉపయోగించే పదజాలం కాకుండా రాజకీయ శత్రువులు, కుట్రదారులు వాడే భాషతో ఈ లేఖ విడుదలైంది. టీడీపీ అనుకూల మీడియా ఓ పథకం ప్రకారం దీనిపై బుధవారం మూడు గంటల పాటు పనిగట్టుకుని కథనాలు ప్రసారం చేసింది. 2 జాతీయ మీడియాకు చెందిన కొన్ని పత్రికలు గురువారం ఈ లేఖను ప్రచురించాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టకు ఈ వ్యవహారం భంగం కలిగిస్తోంది. రమేశ్‌కుమార్ పేరుతో విడుదలైన లేఖపై రాష్ట్ర ప్రయోజనాల రీత్యా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నాం. 3 ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కాకుండా టీడీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుకు సన్నిహితులైన ఐదుగురు పాత్రికేయుల ద్వారా మిగతా మీడియాకు చేరినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఎవరెవరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో, ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని అస్థిరపరచటానికి ఎవరు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారో సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. 4 ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనరే రాశారా? లేక ఇతరులు రాశారా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల ఊహాగానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ కాకుండా తానే నేరుగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరి రాజకీయంలో ఆయన భాగం అయ్యారు? బయటకు వచ్చిన లేఖపై ఔననో కాదనో వివరణ ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అనే అనుమానాలను నిగ్గు తేల్చాలి. 5 రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అసెంబ్లీలో 86 శాతం సీట్లు, 51 శాతం ఓట్లు, 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే దాదాపు 90 శాతం మేనిఫెస్టో వాగ్దానాలను అమలు చేయడంతో ప్రజల సంతృప్తి మరింత పెరిగి ఏకగ్రీవాలు కావటం సహజ పరిణామం. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలపై విభేదిస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ లేఖ పేరుతో ప్రచారం చేయడం అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెప్పటమే. 6 ఎస్ఈసీ రమేష్‌కుమార్ ప్రతిపక్ష టీడీపీ కక్ష సాధింపు వ్యూçహాలు, కుట్రల్లో తానూ భాగమైనట్లుగా వ్యవహరిస్తున్నారు. చివరికి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున ఎందుకు కేవియట్ వేశారు? టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నాయి? 7 రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వహించాల్సిన వ్యక్తికి ఉండాల్సిన స్వతంత్రత, నిష్పాక్షికతకు ఇంతగా భంగం కలగటం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, కమిషనర్ పదవికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోరుతున్నాం. 8 ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంతోపాటు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేలా ఈ కాలానికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పక్కనపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలతో తీవ్ర ఆరోపణలు చేస్తూ గంటల వ్యవధిలోనే ఆయన పేరుతో లేఖ విడుదల కావడం అనుమానాలకు తావిస్తోంది. 9 టీడీపీ అనుకూల మీడియా ఈ లేఖను ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి వాడుకుంది. ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఆ లేఖ తాను రాసిందో కాదో చెప్పకుండా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యారంటే ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమని భావిస్తున్నాం. 10 నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆ లేఖను ధ్రువీకరించటంగానీ, నకిలీ ఉత్తరం అయితే బహిరంగంగా ఖండించటంగానీ చేయాలి. ఆ రెండూ చేయకుండా టీడీపీ రాజకీయ ఎత్తుగడల్ని బలపరిచేలా, ప్రభుత్వాన్ని అస్థిరపరచేలా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన భౌతికంగా, మానసికంగా ఎవరికి బందీగా ఉన్నారు? ఈ విషయాలపై ఒక పనిగా పెట్టుకుని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న పాత్రికేయుల మీద సత్వరం విచారణ జరపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుని నిజాలను బహిర్గతం చేయాలని అభ్యర్థిస్తున్నాం. -
వదంతులు ప్రచారం చేస్తే కేసులు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగిపోయినట్టు కొందరు ప్రచారం చేస్తుండటం సరికాదని, పని కట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల ఏడీజీ అయ్యన్నార్, విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావుతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నపాటి ఘటనలను పెద్దవిగా చూపుతూ, పుకార్లతో అలజడి రేపే ప్రయత్నాలు సరికాదన్నారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుద్దా వెంకన్న, బొండా ఉమా కాల్ డేటా పరిశీలిస్తాం.. - మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ నుంచి మాచర్ల ఎందుకు వెళ్లారో.. అక్కడ దాడి జరిగితే ఎవరికీ ఫిర్యాదు చేయకుండా విజయవాడ ఎలా వచ్చారో.. ఇతరత్రా అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. - వారిని మాచర్ల నుంచి పోలీసు వాహనంలోనే బయటకు తీసుకొచ్చాం. - ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 307 కింద సుమోటోగా కేసు నమోదు చేసి, ముగ్గురిని తక్షణం అరెస్టు చేశాం. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తే ఎలా? - బొండా ఉమ, బుద్దాల నుంచి స్టేట్మెంట్ తీసుకుంటాం. వారి కాల్ డేటా పరిశీలిస్తాం. - పుంగనూరు ఘటనపై టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు. మహిళా అభ్యర్థి చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే. (వీడియో క్లిప్పింగ్ చూపారు) - ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్పీల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు. చిన్న ఘటన జరిగినా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తాం. నిష్పక్షపాతంగా కేసుల నమోదు - వారం రోజుల్లో 57 కేసులు (ఇందులో హత్యాయత్నం ఘటనలు 8) నమోదు చేశాం. - 11,386 బైండోవర్ కేసులు నమోదు చేసి 1,09,801 మందిని బైండోవర్ చేశాం. - 10,514 ఆయుధాల్లో (లైసెన్స్డ్ వెపన్స్) 8,015 ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నాం. - నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న 3,184 మందిని, నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న 1,117 మందిని బైండోవర్ చేశాం. - ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను రప్పిస్తు న్నాం. - సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, తప్పుడు విషయాలను వైరల్ చేయడం వంటి వాటిపై సుమోటోగా కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం. - ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేశాం. నిఘా యాప్ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశాం. -
ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఏ క్షణంలోనైనా అమల్లోకి రావచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని, అందుకు అనుగుణంగా అంతా పని చేయాలన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు వద్దన్నారు. ఎన్నికలు ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా విషయంలోనూ సీరియస్‌గా ఉండాలని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ట్వంటీ ట్వంటీ.. ఉమెన్ సేఫ్టీ ట్వంటీ ట్వంటీ.. ఉమెన్ సేఫ్టీ (2020 మహిళల భద్రతా సంవత్సరం)గా ప్రకటించినట్లు సవాంగ్ చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఏమన్నారంటే.. నిర్భయ చట్టం ఆశించిన ఫలితాలివ్వలేదు - 2012లో వచ్చిన నిర్భయ చట్టం 8 ఏళ్లలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. - అందుకే దిశ–2019 చరిత్రాత్మక బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. - మహిళా పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించి ‘దిశ’ పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నాం. - ఇప్పటికే ఆరు దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించాం. మరో 12 స్టేషన్లను మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న ప్రారంభిస్తాం. మహిళా దినోత్సవ వేడుకల్లో.. - పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం డీజీపీ ప్రారంభించారు. - మహిళల భద్రత కోసం దిశతో పాటు మహిళా మిత్ర, సైబర్ మిత్ర తీసుకొచ్చామని తెలిపారు. -
ఏపీ పోలీస్‌కు అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఇప్పటికే అనేక విభాగాల్లో జాతీయస్థాయి గుర్తింపును పొందడంతోపాటు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు తాజాగా మరో ఐదు అవార్డులు వచ్చాయి. ఓ ప్రైవేటు సంస్థ ఒడిశాలోని భువనేశ్వర్‌లో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన జాతీయ సెమినార్ సందర్భంగా ‘టెక్నాలజీ సభ అవార్డ్స్–2020’ను ప్రదానం చేశారు. ఇందులో ఏపీ పోలీసులకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి. సాంకేతికపరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకుగాను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు ఈ అవార్డులు దక్కాయి. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న పోలీసు వీక్లీ ఆఫ్ విధానానికి తొలి అవార్డు లభించింది. అలాగే దర్యాప్తులో భాగంగా అమలు పరుస్తున్న ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకర్’, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం, ఎన్నికల్లో పోలీసు విధులు(బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్), ఎస్సీ, ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు విధానానికి కూడా అవార్డులు లభించాయి. ఒడిశా ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా ఏపీ పోలీసు ప్రతినిధులు ఈ అవార్డులను అందుకున్నారు. డీజీపీ అభినందనలు.. ఏపీ పోలీసులు వరుసగా జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం ఒక ప్రకటనలో వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ పోలీసింగ్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపట్టారని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న పోలీసు శాఖ ఇటీవలి కాలంలో ఎన్నో జాతీయ అవార్డులను అందుకుందని డీజీపీ గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖతోపాటు జాతీయస్థాయి ప్రైవేటు సంస్థల నుంచి కూడా ఏపీ పోలీసులు సాంకేతిక, దర్యాప్తు తదితర అంశాల్లో అవార్డులు అందుకున్నారన్నారు. ఏపీ పోలీసులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచిపేరు తేవాలని ఆయన కోరారు. -
భరోసా కల్పించిన దిశ యాప్..
-
కర్నూలు లైంగికదాడి కేసు సీబీఐకి..
కర్నూలు: కర్నూలు శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2017లో జరిగిన పదోతరగతి విద్యార్థిని లైంగికదాడి, హత్య అభియోగాలు ఉన్న కేసును సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థిని తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిసి న్యాయం చేయాల్సిందిగా గత ఏడాది ఆగస్టులో వినతిపత్రం సమర్పించారన్నారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది అక్టోబర్ 21వ తేదీన కేసు తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయన్నారు. అప్పటికే కేసు ట్రయల్‌లో ఉన్నప్పటికీ కోర్టులో జడ్జి అనుమతి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిజాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అత్యాధునిక సాంకేతిక సహాయంతో దర్యాప్తు చేపట్టిందన్నారు. అయితే కేసును సీబీఐకి అప్పగించాలన్న బాధితురాలి కుటుంబీకులు, దళిత సంఘాల డిమాండ్‌తో డీజీపీ సానుకూలంగా స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిందిగా సిఫారసు చేస్తూ డీజీపీకి నివేదించగా తదుపరి చర్యల నిమిత్తం వాటిని హోం సెక్రటరీకి పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కరస్పాండెంట్ వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేశారు. -
6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్ ఆటకట్టు
తెల్లవారుజాము 4.21 గంటల సమయం.. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు..ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌ప్లాజా..ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు... ఓ పోకిరిలో మాత్రం కామ పిశాచి నిద్ర లేచింది..!ఉన్నతమైన అధ్యాపక వృత్తిలో ఉన్నా వివేకం నశించడంతో అసభ్య చేష్టలకు దిగాడు..ధైర్యాన్ని కూడదీసుకున్న బాధిత మహిళ ‘దిశ యాప్’ ద్వారా సమాచారం ఇచ్చారు...ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను క్షేమంగా గమ్య స్థానానికి పంపించారు. సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ ఏలూరు టౌన్ : ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘దిశ’ యాప్ సత్ఫలితాన్నిచ్చింది.. వేళకాని వేళ మహిళపై వేధింపులకు దిగిన ఓ పోకిరీ భరతం పట్టింది.. తక్షణ రక్షణ తథ్యం.. అని నిరూపించింది.. కేవలం ఆరు నిమిషాల్లో పోలీసులను బాధితురాలి వద్దకు చేర్చి అభయమిచ్చింది.. తద్వారా అక్కచెల్లెమ్మల జోలికొస్తే ఖబడ్దార్.. అని హెచ్చరించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్ ప్రారంభమైన నేపథ్యంలో తొలిసారి ఓ మహిళకు అండగా నిలిచింది. భరోసా కల్పించిన దిశ యాప్.. ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున మహిళా అధికారి సీటు వద్దకు చేరుకుని పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రారంభించిన దిశ యాప్ గుర్తుకురావటంతో బాధితురాలు 4.21 గంటల సమయంలో తన మొబైల్ ఫోన్‌ను ఐదు పర్యాయాలు అటుఇటు కదిలించారు. యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కటంతో ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు(కాల్ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ధైర్యం చెప్పి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కె.బసవయ్య నాయక్‌పై ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తెలిపారు. అనంతరం పెదపాడు పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేయడంతో క్రైమ్ నెంబర్ 52/2020 సెక్షన్ 354, 354(ఏ) కింద కేసు నమోదు చేశారు. బసవయ్య నాయక్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న బసవయ్యపై చర్యలు తీసుకుంటామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆకతాయి ప్రొఫెసర్ అరెస్టు వరకు దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్ పర్యవేక్షించారు. పోలీసులకు సీఎం జగన్ అభినందనలు దిశ యాప్ ద్వారా అందిన తొలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. పోలీసులు అతి తక్కువ సమయంలో స్పందించి ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచారని ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులను కోరారు. ఘటన వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు నిమిషాల్లో ఆరు కి.మీ – బాధితురాలు ఆపదలో ఉన్నట్లు దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్ కానిస్టేబుల్ నాగదాసి రవి ఆరు కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లో చేరుకున్నాడు. – త్రీటౌన్ ఎస్ఐ బీఎస్‌డీఆర్ ప్రసాద్, మరో కానిస్టేబుల్ టి.సతీష్ కూడా స్వల్ప వ్యవధిలోనే అక్కడకు చేరుకుని నిందితుడిని బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్నారు. – బాధిత అధికారి 4.10 గంటల సమయంలో తొలుత విశాఖ మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్కాజల్కి ఫోన్ చేయగా డయల్–100కి కాల్ చేయాలని సూచించారు. ఆ వెంటనే బాధితురాలు దిశ యాప్‌ను వినియోగించడంతో అతి వేగంగా సాయం అందింది. -
‘మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు’
సాక్షి, తూర్పుగోదావరి: దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి 18 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దిశ పోలీసు స్టేషన్లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, 38 కానిస్టేబుళ్లతో సహా పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండే విధంగా చూస్తున్నామని తెలిపారు. దిశ పోలీసు స్టేషన్లు మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తాయని అన్నారు. త్వరలో దిశ యాప్ కూడా ప్రారంభం కానుందని.. దీని ద్వారా బయట ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని డీజీపీ గౌతంమ్ సవాంగ్ తెలిపారు. -
సమాజానికి.. ‘మహిళా మిత్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన మహిళ మిత్ర (సైబర్ మిత్ర)లు సమాజ మిత్రలుగా మన్ననలు పొందుతున్నారు. వీరు.. పోలీసులు, బాధిత మహిళలకు వారధిగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మహిళా మిత్ర (సైబర్ మిత్ర) కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. అంతకుముందు దేశవ్యాప్తంగా మహిళా వలంటీర్ల వ్యవస్థ మాత్రమే ఉండేది. అది క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి మహిళా మిత్ర (సైబర్ మిత్ర) పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కూడా కల్పించింది. గతేడాది నవంబర్ నుంచి మహిళా మిత్రల నియామకాలను చేపట్టి పూర్తి చేసింది. 1,097 పోలీస్స్టేషన్ల పరిధిలో 10 వేల మంది మహిళా మిత్ర(సైబర్ మిత్ర)లను నియమించింది. వీరిలో ఎక్కువ మంది స్వయం సహాయక సంఘాలకు చెందినవారే ఉండటం విశేషం. వీరంతా మహిళల సమస్యలపై అవగాహన కలిగి ఉండటంతో క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు పది మంది ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిది నుంచి పది మంది మహిళా మిత్ర (సైబర్ మిత్ర)లు ఉన్నారు. ప్రతి గ్రామానికి/ వార్డుకు ప్రాధాన్యత కల్పించేలా ఒకరి చొప్పున నియమించారు. స్థానికంగా ఉంటూ.. కనీసం 19 ఏళ్లు నిండి, ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగి, ఏ రాజకీయ పార్టీకి చెందని వారికి మహిళా మిత్రలుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి ఆయా పోలీస్స్టేషన్లల్లోని మహిళా ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్లో ఒకరు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. మహిళా మిత్ర (సైబర్ మిత్ర) విధులు.. - తమ పరిధిలోని విద్యార్థినులు, మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. - కోడళ్లను వేధింపులకు గురి చేసే అత్తమామలు, భర్తల గురించిన సమాచారం పోలీసులకు చేరవేయాలి. – గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి. – బడికి వెళ్లని బడి ఈడు పిల్లల వివరాలను పోలీసుల ద్వారా విద్యా శాఖకు చేరవేసి.. చదివించేందుకు కృషి చేయాలి. – వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తు¯ంటాయి. ఇలాంటి ఘటనల్లో బాధ్యులను గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలి. – సోషల్ మీడియా (అసభ్య పోస్టులు, అసభ్య వీడియోలు, వేధింపులు, తదితర) ద్వారా ఇబ్బందిపడుతున్న బాధిత మహిళలను కాపాడాలి. వారిలో ఆత్మస్థైర్యం కలిగించడంతోపాటు తక్షణ సహాయాన్ని అందించడానికి పోలీసులకు సమాచారమందించాలి. మహిళా మిత్ర సేవలు విస్తరిస్తాం.. –డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళా మిత్ర, సైబర్ మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో మహిళల సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించే వీరి సేవలను మరింత విస్తరిస్తాం. గ్రామాల్లోని ఏఎన్ఎంలు, అంగన్వాడీ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో మహిళా మిత్రలను సమన్వయం చేస్తాం. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా రక్షణ కార్యదర్శులకు మహిళా మిత్రలను అప్పగిస్తాం. -
రక్షణ కల్పించటమే ‘దిశ’ చట్టం ముఖ్య ఉద్దేశం
సాక్షి, అమరావతి: మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ‘దిశ’ చట్టం ముఖ్య ఉద్దేశమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన ‘దిశ’ చట్టంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టంపై జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులతో ‘వర్క్ షాప్’ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ‘దిశ ’చట్టం ఉద్దేశమని.. వేగంగా కేసు దర్యాప్తు జరపడంతో పాటు నిందితులను తక్షణమే అరెస్ట్ చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదికలు, డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నిర్ణీత సమయంలో వయస్సు నిర్ధారణ, పోస్ట్ మార్టం, అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్‌ను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ సదుపాయం ఏర్పాటు చేయబోతున్నామని డీజీపీ వెల్లడించారు. విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను మరింతగా పటిష్టపరచనున్నామని ఆయన తెలిపారు. అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలలో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హోంగార్డుల సంక్షేమంలో మనమే బెస్ట్
సాక్షి, అమరావతి: హోంగార్డ్‌ల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 6న నిర్వహించే హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ప్రభుత్వం హోంగార్డులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతోపాటు పోలీసులతో సమానంగా యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షలకు ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు వివరించారు. హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
వారి బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులదే: డీజీపీ
సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామంలోని మహిళల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. గురువారం డీజీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల సమస్యలు తీర్చే బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో మహిళలకు, బాలికలకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వీటిని అధిగమించడానికి మహిళా సంరక్షణ కార్యదర్శులు తోడ్పాటుగా ఉండాలని సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల వల్ల సమాజంలో సమాజంలో పెను మార్పులు తీసుకురావలని పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్రంలో 14967 మంది కార్యదర్శులు ఉన్నారని వీరికి ఆరు నెలల్లో 10 బ్యాచ్‌లుగా 11 సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. రెండు వారాల్లో ప్రాక్టికల్ క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మహిళా కార్యదర్శులకు ఆత్మ రక్షణ, యోగా వంటి క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. -
బాబు రాజధాని టూర్: డీజీపీ స్పందన
సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై చెప్పులతో, రాళ్లతో దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రైతు కాగా, రాళ్లు విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి తాను నష్టపోయినట్లుగా చెబుతున్నారని పోలీసులు తెలిపారు. చంద్రబాబు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అందుకే అలా చేశానని వారు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. డీజీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాజకీయ కామెంట్లపై తాము మాట్లాడమని అన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తమ విచారణలో పెద్దగా వివాదాలు జరగవని తేలిందని, అందుకే చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చామని తెలిపారు. అదేవిధంగా.. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా నిర్మూలనకు సీఐడీ ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గురువారం స్మగ్లింగ్ సమాచారం కోసం సీఐడి విభాగంలో 7382296118 అనే వాట్సప్ నెంబర్‌ను ఆయన ప్రారంభించారు. గంజాయి, మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, అమ్మకాల సమాచారాన్ని వాట్సప్ ద్వారా నార్కోటిక్ సెల్, సీఐడీకి తెలియజేయవచ్చని తెలిపారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించినవారికి పారితోషకం అందజేస్తామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. యూనివర్శిటీలలో, కళాశాలలో యువత గంజాయి సేవిస్తున్నారని, గంజాయి సరఫరా ఏజెన్సీ నుండి సప్లై అవుతుందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి సరఫరాపై పోలీస్ నిఘా పెరగబోతోందని వెల్లడించారు. గంజాయిని నిర్మూలించాలంటే ప్రజల సహకారం కూడా కావాలన్నారు. నార్కొటెకె సెల్‌ను ఇంకా బలపరుచనున్నామని, యూనివర్శిటి మెనేజ్మెంట్ కూడా డ్రగ్స్ కంట్రోల్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
మహిళలకు అవగాహన పెరగాలి : డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ : సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. మంగళవారం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం సిద్దార్ధ కళాశాల నుంచి నిర్వహించిన 3k వాక్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. జీవనశైలిలో మార్పుల కారణంగా ఎక్కువమంది మహిళలు రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకొని రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్
సాక్షి, విజయవాడ: కాలానికి అనుగుణంగా సరికొత్త కట్టడాలతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దేశంలోనే అదర్శంగా నిలుస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్లో 150 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్స్యూరెన్స్ బాండ్లు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంచి కార్పొరేషన్‌గా అందరి మన్ననలు పొందుతోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కట్టడాలతో ముందంజలో ఉందన్నారు. సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న సిబ్బంది సంక్షేమం కూడా తమకు ముఖ్యమే అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్యూరెన్స్ బాండ్లను అందించామన్నారు. సంస్థపై ఉన్న నమ్మకం వల్లే నేడు నిర్మాణం కోసం అనేక మంది సంప్రదిస్తున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో సంస్థ టర్నోవర్ కూడా బాగా పెరిగిందని వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన సంస్థ వైస్ చైర్మన్ సునీల్ కుమార్, ఇతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మంచి పని తీరుతో రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పీవీ సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తున్నామని ప్రకటించారు. ‘బ్యాంకులు కేవలం పర్మినెంటు ఉద్యోగులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పినప్పటికీ, కొటక్ మహీంద్రతో ఒప్పందం చేసుకుని మరీ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్సూరెన్స్ బాండ్లను అందిస్తున్నాం. ప్రమాదవశాత్తూ మరణించిన ఉద్యోగికి 20లక్షలు అందజేస్తాం. ఇటీవల హరికృష్ణ అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే తోటి ఉద్యోగులు చందాలు వేసుకుని అతని కుటుంబానికి ఏడు లక్షలు ఇచ్చాం. ఈ విషయం తెలిసిన సీఎం జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్‌ను అందజేశారు. ఇక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అధునాతన భవనాలు నిర్మిస్తాం. ఇతర ప్రభుత్వ శాఖలు కూడా మా పని తీరు చూసి నిర్మాణ బాధ్యత అప్పగించాలి’ అని సునీల్ కుమార్ కోరారు. జరిగింది పార్టీల మధ్య గొడవ కాదు.. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముగేంత వరకు పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉంటుందని డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు. ‘ఆత్మకూరులో రెండు వర్గాల మద్య గొడవ జరిగిందే తప్ప పార్టీలకు సంబంధం లేదు. వైన్ వెల్ఫేర్ బిల్డింగ్‌లో ఉన్నవారందరినీ పోలీసులే స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లారు. అతి త్వరగా ఆత్మకూరులో పరిస్దితులు సాధారణ స్థితికి వస్తాయి. కొందరు నేతలు పొలీసులపై అసభ్యకరంగా మాట్లాడడంపై ఫిర్యాదులు వచ్చాయి. వివాదం పెద్దది కాకూడదని సంయమనాన్ని పాటించాం. నిన్న పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం. తిడుతున్నా కూడా చాలా ఓర్పుగా వ్యవహరించారు. పోలీసులు ఏకపక్షం అని ఆరోపించడం సరికాదు.. పోలీసులు ప్రజల పక్షంగానే వ్యవహరిస్తారు. ఆత్మకూరు దాడిలో కొందరు మీడియా ముందు ప్రవేశపెట్టిన బాధితుల లిస్ట్‌ను మేము తెప్పించుకున్నాం. దాడిలో బాధితులని చెబుతున్నవారిలో సగానికి పైగా ఇతర ఇబ్బందులతో వచ్చినవాళ్లే. ప్రతి ఒక్కరి గురించి రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుంటున్నారు’ అని తెలిపారు. -
పల్నాడులో భౌతిక దాడులు పేరుతో దుష్ప్రచారం
-
అందుకే ‘పెయిడ్’ డ్రామాలు
సాక్షి, అమరావతి: ఒకవైపు నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ, మరోవైపు వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చడం లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. అందుకే పల్నాడులో పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ఫిర్యాదులకు వారంలోగా పరిష్కారం చూపాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గుంటూరు జిల్లాలో భౌతికదాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన గురవాచారి అనే వ్యక్తిని దారుణంగా హింసించారని గుర్తు చేశారు. మరో వ్యక్తిని రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారని, చంపేస్తామని బెదిరించారన్నారు. చంద్రబాబు దుర్మార్గమైన పాలనలో గుంటూరు జిల్లాలో 6 రాజకీయ హత్యలు జరగ్గా, అందులో 5 ఒక్క పల్నాడులో జరిగినవేనని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత పోలీసులు తీసుకున్న జాగ్రత్తల వల్ల ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదన్నారు. పల్నాడులో ఇప్పటివరకు 79 రాజకీయ పరమైన కేసులు నమోదుకాగా, అందులో టీడీపీ నేతలపై 43, వైఎస్సార్సీపీ నేతలపై 36 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సమావేశంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు రామకృష్ణ, జయలక్ష్మీ పాల్గొన్నారు. పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదు పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితులు కల్పిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ర్యాలీలు నిర్వహించాలనుకొంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ప్రస్తు తం పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదని, 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. -
గురువాచారిని దారుణంగా హింసించారు: సుచరిత
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం జరగుతోందని... ఫిర్యాదులకు 15 రోజుల్లో పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై.. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే పల్నాడులో పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా...2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని హోం మంత్రి సుచరిత విమర్శించారు. టీడీపీ నేత యరపతినేని అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేసినందుకు గురువాచారి అనే వ్యక్తిని దారుణంగా హింసించారన్నారు. టీడీపీ పాలనలో గురువాచారిని చిత్ర హింసలకు గురిచేశారని.. ఆయన ఫొటోలను మీడియా ముఖంగా చూపించారు. అదే విధంగా యరపతినేని ఓ వ్యక్తిని కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని... ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారన్నారు. చంద్రబాబు పాలనలో ఇలాంటి మరెన్నో కేసులు నమోదయ్యాయని హోం మంత్రి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి భయానక పరిస్థితులు లేవని, నేరాలు తగ్గి శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు.ఇటువంటి సమయంలో చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి గ్రామాల్లో తమను ఉండనివ్వడం లేదంటూ పునారావాస శిబిరాలు పెడుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఎలాంటి ఘోరాలు జరిగాయో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘పిచ్చి కుక్కను రాయితో కొడితే కేసు పెట్టారు. టీడీపీలో లేని వాళ్లపై అక్రమ కేసులు బనాయించారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు తప్పు చేసిన వారిని ఉపేక్షించకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కానీ చంద్రబాబు వంటి సీనియర్ నాయకులు పోలీసు వ్యవస్థ చిన్నబుచ్చుకునేలా.. వాళ్లు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ విమర్శించడం తగదు. గురజాల ప్రశాంతంగా ఉంది. నిజమైన బాధితులకు తప్పకుండా రక్షణ కల్పిస్తాం. అధికారులు వెళ్లి పరిస్థితులు గమనించి నిజంగా బాధితులు ఉంటే వారిని పోలీసు రక్షణతో గ్రామాల్లోకి తీసుకువెళ్తారు. నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత పల్నాడులో 79 రాజకీయ కేసులు నమోదయ్యాయి. వాటిలో 43 టీడీపీ, 36 వైఎస్సార్ సీపీ చేశాయి’ అని హోం మంత్రి సుచరిత తెలిపారు. ఇక డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. పల్నాడులో 144 సెక్షన్ విధించామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఛలో ఆత్మకూరు కోసం ఎవరూ ఎటువంటి అనుమతి అడగలేదని తెలిపారు. -
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృత రూపం దాల్చిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి బసతోపాటు భోజన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందిం చాలని సూచించారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ గోదావరి వరద పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో శనివారం వాకబు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విపత్తు నిర్వహణ సిబ్బంది, ఉభయగోదావరి జిల్లాల అధికారులను సన్నద్ధం చేయాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనా ల్సిందిగా ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. గోదావరి వరదలకు ప్రభావితమైన దేవీపట్నం మండ లంలోని 32 ఆవాసాలు సహా ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాలకు సహాయం అందించాలని పేర్కొన్నారు. దీంతో ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతోపాటు, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపుల్ సెక్రటరీ, పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్లను ఆదేశించారు. సహాయ బృందాలు సిద్ధం వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఎన్డీఆర్ఎఫ్, 124 మంది ఎస్టీఆర్ఎఫ్, అగ్నిమాపక విభాగం నుంచి 90 మంది సిబ్బంది, పశ్చిమగోదావరిలో 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 34 మంది ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక విభాగం నుంచి 49 మంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శాటిలైట్ ఫోన్లు, డ్రోన్ కెమేరాలను వరద పర్యవేక్షణ కోసం సిబ్బంది వినియోగిస్తున్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తం: డీజీపీ గోదావరికి భారీగా వరద నీరు వస్తుండటంతోపాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని డీజీపీ సవాంగ్ చెప్పారు. ఎటువంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనేందుకు పోలీసులతోపాటు ఎస్డీ ఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసు బృందాలు సమాయత్తంగా ఉన్నాయని తెలిపారు. -
ఎస్ఐ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ ఫలితాల సీడీని అసెంబ్లీ చాంబర్లో సీఎంకు హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్, స్టేట్‌లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ కుమార్ విశ్వజిత్ అందజేశారు. ఈ పోస్టుల భర్తీ పెండింగ్‌లో ఉండడంపై దృష్టి సారించిన సీఎం వెంటనే ఫలితాలు విడుదల చేయాలంటూ కొద్దిరోజుల క్రితం అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో 333 సబ్ఇన్స్పెక్టర్ (సివిల్), రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్, ఏపీఎస్పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఎస్ఐ పోస్టుల కోసం మొత్తం 1,35,414 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ పరీక్షలు పూర్తయ్యాక అర్హత పొందిన 32,745 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరంతా 149 సివిల్ ఎస్ఐ, 75 రిజర్వ్ ఎస్ఐ, 75 ఏపీ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన ఎస్ఐ, 10 మంది డిప్యూటీ జైలర్లు (పురుషులు), మరో నలుగురు డిప్యూటీ జైలర్లు (మహిళలు), 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీపడ్డారు. ఎస్ఐ పోస్టుల ఫలితాల్లో ఎంపికైన వారికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. పౌరులకు సేవ చేయడానికి ఇదొక మంచి అవకాశమని, వృత్తిపట్ల అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం సూచించారు. టాపర్లు వీరే..: నెల్లూరుకు చెందిన పరుచూరు మహేష్, వైఎస్సార్ జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్, పాలెం రవికిశోర్‌లు 255 మార్కులతో అగ్రస్థానం (టాపర్లు)లో నిలిచారు. ఎస్ఐ పోస్టులకు 15,775 మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా వారిలో 61 మంది ఎంపికయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజ్ఞ 224 మార్కులతో టాపర్‌గా నిలిచారు. వారంలో కానిస్టేబుల్స్ ఫలితాలు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2,200 కానిస్టేబుల్ సహా 2,808 పోస్టుల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్టు హోంమంత్రి సుచరిత చెప్పారు. ఎస్ఐ పోస్టుల్లో ఎంపికైన వారికి పరిశీలన పూర్తయ్యాక శిక్షణ ఇస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఇంకా 17 శాతం ఖాళీలున్నాయని, సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన భర్తీ చేస్తామని తెలిపారు. పేదలకు న్యాయం చేస్తా సంగం: తాను సబ్ఇన్స్పెక్టర్ అయిన తరువాత పేదలకు న్యాయం చేస్తానని ఎస్ఐ రాత పరీక్షలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పరుచూరు మహేష్‌కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుపాడు గ్రామానికి చెందిన మహేష్‌కుమార్ సోమవారం వెలువడిన ఎస్ఐ రాత పరీక్ష ఫలితాల్లో 255 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. తాను పేదరికంలో పుట్టి పెరిగానని, పేదల కోసం పనిచేస్తానన్నారు. తన తల్లి లక్ష్మీకాంతమ్మ, తండ్రి మాల్యాద్రి కష్టపడి తనను చదివించారని, వారి దయతోనే తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు. -
చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు: డీజీపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ.. ‘స్పందన కార్యక్రమం’ పేరుతో ప్రతి ఎస్పీ, సీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని డీజీపీ పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో స్పందన కార్యక్రమాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇచ్చామని డీజీపీ చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల మాఫీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నట్లు తెలిపారు. కాగా వైఎస్సార్ సీపీ, టీడీపీ నుంచి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని, వ్యక్తిగత వివాదాలను కూడా కొంతమంది రాజకీయ ముద్ర వేస్తున్నారని ఆయన అన్నారు. -
టీడీపీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. రాష్ట్రంలో టీడీపీ తన కిరాయి మనుషులతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ...టీడీపీ వ్యూహాత్మకంగా దాడులు చేసి, వాటిని వైఎస్సార్ సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తమ పార్టీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ ముఖ్యమంత్రి, హోంమంత్రిలపై దారుణంగా అసత్యాలు దుష్ప్రచారం చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోందన్నారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా తమపై అక్కసుతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. -
నేటి నుంచి ఏపీలో పోలీసులకు వీక్లీఆఫ్
-
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. పోలీసులకు వీక్లీఆఫ్..
సాక్షి, అమరావతి: పోలీసులకు వీక్లీఆఫ్ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చినట్టు రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. దీని అమలు విషయంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి అయ్యన్నార్ చైర్మన్‌గా 21 మందితో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగింది. డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవిశంకర్ అయ్యన్నార్ మీడియాకు వివరించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలోని విశాఖ, కడప, ‘ప్రకాశం’ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి మొత్తం 70 వేల మంది పోలీసులకు వీక్లీఆఫ్ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మొత్తం 19 ఆప్షన్స్ (మోడల్స్)ని ఎంపిక చేశామన్నారు. ప్రతీ యూనిట్ ఆఫీసర్ వాటిలో ఏదో ఒకటిని ఎంపిక చేసుకోవచ్చన్నారు. ప్రతి యూనిట్ నుండి రెండు నెలలకోసారి సమాచారం తీసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ఈ నిర్ణయం కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు వర్తిస్తుందన్నారు. వీక్లీఆఫ్ అమలుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటామన్నారు. అలాగే, వీఆర్‌లో ఉన్నవారిని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీక్లీఆఫ్‌లతో షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉంటాయన్నారు. ఐటీ ప్లాట్ఫారం తయారుచేసి పారదర్శకంగా డాష్ బోర్డును అమల్లోకి తీసుకు రాబోతున్నట్టు చెప్పారు. ఖాళీల భర్తీకి సర్కారుకు నివేదన ఇదిలా ఉంటే.. పోలీసు శాఖలో ఉన్న 20 శాతం ఖాళీలను భర్తీచేసేలా ప్రభుత్వానికి నివేదించినట్టు రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. మొత్తం 12,300 ఖాళీలున్నాయని తమ కమిటీ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిపారు. వీఐపీ, యాంటీ నక్సల్స్ విధులకు ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ప్రభుత్వం ఖాళీలు భర్తీచేసేలా చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే, పనిఒత్తిడి కారణంగా పోలీసులు గుండె, కిడ్నీ, సుగర్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వీరి సంక్షేమానికి చర్యలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు అయ్యన్నార్ తెలిపారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు ‘సాక్షి’తో ఏపీ డీజీపీ సవాంగ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు పోలీసు భద్రత తగ్గించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని, ఆయనకు భద్రత తగ్గించలేదని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది కూడా అవాస్తవమన్నారు. శాంతిభద్రతల విషయంలో నిష్పాక్షికంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని డీజీపీ స్పష్టంచేశారు. ఇకపై పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండబోదన్నారు. రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గతంలో జరిపిన దాడులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, పోలీస్ శాఖలో వీక్లీఆఫ్ అమలుచేసేలా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగని ఆయన అభివర్ణించారు. పోలీసు సంఘం కృతజ్ఞతలు వీక్లీఆఫ్ అమలుకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లకు ఏపీ పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఏపీ పోలీసు అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సవాంగ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ఇచ్చిన హామీని అమలుచేయడం గొప్ప విషయమని చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. వీరిని పోలీసులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చంద్రశేఖర్‌రెడ్డి కితాబిచ్చారు. అలాగే, ఇది చాలా సాహసోపేత నిర్ణయమని సీఐడీ ఐజీ కాళిదాసు రంగారావు అన్నారు. తాను కూడా వరంగల్, విజయనగరం జిల్లాల ఎస్పీగా పనిచేసినప్పుడు పోలీసులకు వీక్లీఆఫ్ ఇద్దామని ప్రయత్నించి పూర్తిస్థాయిలో అమలుచేయలేకపోయానని చెప్పారు. -
పోలీసుల ‘వీక్లీ ఆఫ్’కు కదలిక
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల పరిరక్షణలో వీక్లీఆఫ్ అనేది లేకుండా దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీకి కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించి డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఓ కమిటీ ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పోలీసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన దానిని గాలికొదిలేశారు. అప్పటి డీజీపీగా నండూరి సాంబశివరావు ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకటి రెండు జిల్లాల్లో అరకొరగానే అమలై ఆ తరువాత మరుగున పడింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో పలువురు పోలీసులు, హోంగార్డులు ఆయన్ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీఆఫ్, హోంగార్డులకు మెరుగైన వేతనాలు, పోలీసు కుటుంబాల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం కావడం.. తన హామీని అమలుచేసే దిశగా వైఎస్ జగన్ అడుగులు వేయడంతో పోలీసులు ఇప్పుడు హర్హం వ్యక్తంచేస్తున్నారు. 22మందితో కమిటీ కాగా, సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలుకు డీజీపీ సవాంగ్ 22 మంది పోలీసు ప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి శాంతిభద్రతల ఏడీజీ చైర్మన్‌గా ఉంటారు. పర్సనల్ డిపార్టుమెంట్, గుంటూరు ఐజీలు, ఏలూరు రేంజ్ డీఐజీ, గుంటూరు రూరల్, కృష్ణా జిల్లా ఎస్పీలు, విజయవాడ శాంతిభద్రతల డీసీపీ, ఎస్ఐబీ ఎస్పీ, ఏపీఎస్పీ బెటాలియన్స్ డీఐజీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, కృష్ణాజిల్లా సీసీఎస్ డీఎస్పీ, కమాండ్ కంట్రోల్ డీఎస్పీ, గుంటూరు అర్బన్ ఏఆర్ డీఎస్పీ, గుంటూరు అర్బన్, విజయవాడ సిటీ సీఐలు, గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్ ఎస్సైలు, శ్రీకాకుళం, ప్రకాశం, ఏపీఎస్పీ బెటాలియన్ ఐటీ కోర్ టీమ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పోలీసు శాఖలోని అన్ని విభాగాలను పరిశీలిస్తుంది. ఏ విభాగంలో ఏ రోజు వీక్లీ ఆఫ్ అమలుచేయాలి? రాష్ట్రవ్యాప్తంగా వీక్లీ ఆఫ్ అమలులో ఇబ్బందులేంటి? వాటిని అధిగమించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? సిబ్బంది కొరత, వీక్లీ ఆఫ్ తీసుకుంటే వారి బాధ్యతలు ఎవరు చేపట్టాలి వంటి అన్ని కోణాల్లోను కమిటీ పరిశీలిస్తుంది. వారం రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా పోలీసులకు వీక్లీఆఫ్‌ను ప్రభుత్వం అమలుచేస్తుందని డీజీపీ తన సర్క్యులర్‌లో వివరించారు. -
ఆర్పీ ఠాకూర్ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను గురువారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వర రావును కూడా బదిలీ చేసింది. వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్‌గా కుమార్ విశ్వజిత్‌ను నియమించింది. అలాగే మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ డీజీపీ నియామకంలో లోకేష్ హస్తం!
-
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: సవాంగ్
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో గౌతం సవాంగ్ విలేకర్లతో మాట్లాడుతూ.... పుష్కరాలు నేపథ్యంలో 5 శాటిలైట్ రైల్వేస్టేషన్లు, 6 శాటిలైట్ బస్టాప్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పుష్కరాల్లో 17500 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారన్నారు. 18 డ్రోన్ కెమెరాలు, 1400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 19 మంది ఐపీఎస్‌లతోపాటు 14 మంది ఎస్పీ స్థాయి అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. 7 వేల మంది వాలంటీర్లను కూడా నియమించినట్లు గౌతం సవాంగ్ వివరించారు.