ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా విడుదల చేస్తున్న హోంమంత్రి సుచరిత, చిత్రంలో డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్‌ఐ ఫలితాల సీడీని అసెంబ్లీ చాంబర్‌లో సీఎంకు హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్, స్టేట్‌లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ కుమార్ విశ్వజిత్ అందజేశారు. ఈ పోస్టుల భర్తీ పెండింగ్‌లో ఉండడంపై దృష్టి సారించిన సీఎం వెంటనే ఫలితాలు విడుదల చేయాలంటూ కొద్దిరోజుల క్రితం అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో 333 సబ్‌ఇన్‌స్పెక్టర్ (సివిల్), రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్, ఏపీఎస్‌పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఎస్‌ఐ పోస్టుల కోసం మొత్తం 1,35,414 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ పరీక్షలు పూర్తయ్యాక అర్హత పొందిన 32,745 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరంతా 149 సివిల్ ఎస్‌ఐ, 75 రిజర్వ్ ఎస్‌ఐ, 75 ఏపీ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన ఎస్‌ఐ, 10 మంది డిప్యూటీ జైలర్లు (పురుషులు), మరో నలుగురు డిప్యూటీ జైలర్లు (మహిళలు), 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీపడ్డారు. ఎస్‌ఐ పోస్టుల ఫలితాల్లో ఎంపికైన వారికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. పౌరులకు సేవ చేయడానికి ఇదొక మంచి అవకాశమని, వృత్తిపట్ల అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం సూచించారు.
టాపర్లు వీరే..: నెల్లూరుకు చెందిన పరుచూరు మహేష్, వైఎస్సార్ జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్, పాలెం రవికిశోర్‌లు 255 మార్కులతో అగ్రస్థానం (టాపర్లు)లో నిలిచారు. ఎస్‌ఐ పోస్టులకు 15,775 మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా వారిలో 61 మంది ఎంపికయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజ్ఞ 224 మార్కులతో టాపర్‌గా నిలిచారు.
వారంలో కానిస్టేబుల్స్ ఫలితాలు
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2,200 కానిస్టేబుల్ సహా 2,808 పోస్టుల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్టు హోంమంత్రి సుచరిత చెప్పారు. ఎస్‌ఐ పోస్టుల్లో ఎంపికైన వారికి పరిశీలన పూర్తయ్యాక శిక్షణ ఇస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఇంకా 17 శాతం ఖాళీలున్నాయని, సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన భర్తీ చేస్తామని తెలిపారు.
పేదలకు న్యాయం చేస్తా
సంగం: తాను సబ్‌ఇన్‌స్పెక్టర్ అయిన తరువాత పేదలకు న్యాయం చేస్తానని ఎస్‌ఐ రాత పరీక్షలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పరుచూరు మహేష్‌కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుపాడు గ్రామానికి చెందిన మహేష్‌కుమార్ సోమవారం వెలువడిన ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాల్లో 255 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. తాను పేదరికంలో పుట్టి పెరిగానని, పేదల కోసం పనిచేస్తానన్నారు. తన తల్లి లక్ష్మీకాంతమ్మ, తండ్రి మాల్యాద్రి కష్టపడి తనను చదివించారని, వారి దయతోనే తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment