పోలీస్‌.. మరింత ఫ్రెండ్లీ | CM YS Jagan Mohan Reddy launches AP Police Seva app | Sakshi
Sakshi News home page

పోలీస్‌.. మరింత ఫ్రెండ్లీ

Published Tue, Sep 22 2020 3:11 AM | Last Updated on Tue, Sep 22 2020 10:11 AM

CM YS Jagan Mohan Reddy launches AP Police Seva app - Sakshi

ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్‌

పోలీస్‌ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసమే. వారికి మరింత సమర్థవంతంగా సేవలు అందించడంలో భాగంగా ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఇవాళ ఈ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ యాప్‌ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఈ సందర్భంగా పోలీసులు చట్టాన్ని కాపాడటం కోసమే అధికారాలు ఉపయోగించాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా.
–ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పోలీసులు అంటే సేవకులని, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వారు కూడా మన కుటుంబ సభ్యులే అని భావించి ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందన్నారు. పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఏపీ పోలీస్‌ సేవ (సిటిజెన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌) యాప్‌’ను సోమవారం ఆయన తన క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కేంద్రాల నుంచి పాల్గొన్న 46 వేల మంది పోలీస్‌ యంత్రాంగాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

యాప్‌ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు
– పోలీసులు అంటే ఒక బలగం లేదా ఒక శక్తిగా కాకుండా, సేవలందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్‌ ఫ్రెండ్లీకి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్‌ ద్వారా పౌరులకు ఆరు విభాగాలలో 87 రకాల సేవలు అందుతాయి. ఇళ్ల భద్రత మొదలు ఏ అవసరం కోసం అయినా యాప్‌ ఉపయోగపడుతుంది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. 
– సర్టిఫికెట్‌ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్స్‌లు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్‌ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు. మొబైల్‌ యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్‌ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతుంది.

మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం
– మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్‌ చేర్చారు. దిశ యాప్‌ కూడా అనుసంధానం చేశారు. రోడ్‌ సేఫ్టీకి సంబంధించి కూడా 6 మాడ్యూల్స్‌ ఉన్నాయి. చిన్న ప్రమాదం జరిగినా, దాన్ని రిపోర్టు చేయడంతోపాటు, ఆస్పత్రికి తరలించే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
– సైబర్‌ నేరాలకు సంబంధించి కూడా దాదాపు 15 మాడ్యూల్స్‌ ఉన్నాయి. ఆ నేరాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా యాప్‌ ఉపయోగపడుతుంది. సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారంలో వాస్తవం ఏమిటన్నది కూడా తెలుసుకోవచ్చు. “ఫ్యాక్టŠస్‌ చెక్‌’ అన్న ఫీచర్‌ కూడా ఇందులో ఉంది.
– పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్‌ మీడియా కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

గ్రామ పోలీసులతో అనుసంధానం
– ఇప్పటికే పోలీస్‌ సేవలు గ్రామ గ్రామానికి చేరాయి. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వాటిలో మహిళా పోలీసులను కూడా నియమించాం. వీరి ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. ఈ యాప్‌లో గ్రామ పోలీసులను కూడా అనుసంధానం చేశాం. 
– దేశంలోనే తొలిసారిగా దిశ యాప్‌ తీసుకొచ్చాం. ఇది ఎంతో సక్సెస్‌ అయింది. 11 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇది గర్వకారణం. దిశ యాప్‌ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం.
– సైబర్‌ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్‌ నంబర్‌ను ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చాం. 
– న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలో “ఇంటర్‌–ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌’ (ఐసీజెఎస్‌) ప్రవేశపెట్టాం. ఈ విధానం ద్వారా ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది.

ప్రజల కోసమే పోలీస్‌ వ్యవస్థ
– నేరాన్ని నిరోధించడం, నేరాలపై విచారణ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, సమాజంలో నేరాలు జరగకుండా చేయడమే లక్ష్యం. వారి పని ఇంకా సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థను తెచ్చాము. 
– వీలైనంత పారదర్శకంగా వ్యవస్థను మార్చుకోవడం, ఒక ఫిర్యాదు చేయాలన్నా, ఒక ఎఫ్‌ఐఆర్‌ కాపీ పొందాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు.  
– ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ యాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోలీస్‌ ఫీల్డ్‌ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లను అందజేశారు. పోలీస్‌ శాఖ పక్షాన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఒక శాటిలైట్‌ ఫోన్‌ను సీఎంకు అందజేశారు.  

మహిళలకు మరింత భద్రత
మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశారు. ఇప్పుడు 6 విభాగాల్లో 87 రకాల సేవలందించేలా యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ఒక వారోత్సవం నిర్వహిస్తే బాగుంటుంది. 
– మేకతోటి సుచరిత, హోం మంత్రి

పోలీస్‌ చరిత్రలో మరిచిపోలేని రోజు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నందుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇవాళ ఈ యాప్‌ ఆవిష్కరణ వల్ల ఏపీ పోలీస్‌ చరిత్రలో మరిచిపోలేని రోజు.  
– గౌతమ్‌ సవాంగ్, డీజీపీ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement