AP Police Seva App
-
ఖాకీల సాయం.. జన్మనిచ్చిన మానవత్వం
కర్నూలు: పోలీసులంటే కఠిన హృదయులని.. వారిలో మానవత్వం ఉండబోదనే అపవాదు ఉంది. అయితే సోమవారం పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని తమ వాహనంలో ఆసుపత్రికి చేర్చి వీరు మానవత్వం చాటుకున్నారు. ఆ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంలో పోలీసుల సేవ కూడా ఉంది. వివరాలు.. ఉరుకుందలో వెలసిన ఈరన్నస్వామిని దర్శించుకోనేందుకు సోమ వారం కర్ణాటక రాష్ట్రం మాన్వి పట్టణానికి చెందిన ఉల్లేష్, ఉలిగమ్మ దంపతులు వచ్చారు. నిండు గర్భిణి అయిన ఉలిగమ్మ ఉపవాస దీక్షతో ఉదయం స్వామి దర్శనం కోసం క్యూలైన్లో నిలిచి ఉన్నారు. ఉన్నట్టుండి ఆమెకు పురుటినొప్పులు రావడంతో క్యూలైన్లో ఉన్న భక్తులు విషయాన్ని అక్కడే ఉన్న పోలీసులకు చెప్పారు. వెంటనే స్పందించిన కౌతాళం ఎస్ఐ నరేంద్రకుమార్ కానిస్టేబుళ్లు రంగన్న, నరేంద్రగౌడ్ సాయంతో పోలీసు వాహనంలో ఆమెను కౌతాళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లడంతో తల్లీబిడ్డకు వైద్యులు చికిత్స చేశారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో వీరు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. భార్య ప్రాణం నిలవడంతోపాటు కుమారుడు పుట్టడంతో పోలీసులకు ఉల్లేష్ కృతజ్ఞతలు చెప్పారు. -
ఫోన్ పోయిందా.. నో వర్రీస్.. ఏపీ పోలీసులు పట్టేస్తారు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సెల్‌ఫోన్ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు. డేటాతోనే ఆందోళన.. జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వాటి ఖరీదు గురించి ఆలోచించనప్పటికీ ఫోన్లో భద్రపరచుకుంటున్న డేటా విషయంలో ఎక్కువ ఆవేదనకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న హితులు, స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్లతో పాటు పలు విలువైన, అత్యంత కీలకమైన పత్రాలను సైతం సెల్ఫోన్లోనే భద్రపరచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. వినియోగంలో ఉంటేనే.. జిల్లాలో 200 సెల్ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు మిగిలిన ఫోన్లు వాడుకలో లేకపోవటంతో రికవరీ చేయటం ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దొంగిలించిన మొబైల్‌ను ఏ క్షణాన ఉపయోగించినా రికవరీ చేస్తారు. అయితే బాధితులు ఫిర్యాదులో పూర్తి పేరు, చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబరు, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియజేయాలి. పై వాటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫోన్లు రికవరీ చేయటం కష్టం. ఈ నేపథ్యంలో వాట్సాప్ నంబర్లో సమాచారం పొందుపరిచేటప్పుడు బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయాలి.. సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్పీ అందుకోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 9490617573 అనే వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పెట్టి యాప్ అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చి, ఫిర్యాదును ఆన్లైన్ చేసుకోవాలి. వాట్సాప్ నంబరు ద్వారా అందిన ఫిర్యాదును ఐటీ కోర్ టీం సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది స్వీకరించి సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపతారు. ఈ విధానాన్ని జనవరి మాసంలో ఎస్పీ ప్రారంభించగా.. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 1700 ఫిర్యాదులు జిల్లా పోలీసులకు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకూ దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే సుమారు 200 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఉపయోగంలో ఉంటే వెంటనే రికవరీ.. జిల్లాలో ఇప్పటి వరకు 1700 ఫిర్యాదులు అందాయి. వీటిని ఐటీ కోర్ టీంకు అందజేస్తున్నాం. ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాం. రూ. 50 లక్షల విలువ చేసే 200 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. అతి త్వరలోనే మిగిలిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తాం. – జాషువ, ఎస్పీ, కృష్ణా జిల్లా -
అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే!
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఈ యాప్ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి ప్రమాదం, సమస్య వచ్చినా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే క్షణాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అద్బుతమైన అవకాశం ఇందులో ఉంది. అదే ‘ఏపీ పోలీస్ సేవ’యాప్. అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్ రూపొందించారు. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. పోలీస్‌స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. అందుకే మొబైల్లో ఈ యాప్ ఉంటే.. మన వెంట పోలీస్ ఉన్నట్టే! ఆరు విభాగాల్లో 87 రకాల పోలీస్ సేవలు పోలీస్ స్టేషన్లో ప్రజలకు అందే సేవలను ఆరు విభాగాలుగా విభజించారు. శాంతిభద్రతలు. ఎన్ఫోర్స్మెంట్, పబ్లిక్ సేవలు, రహదారి భద్రత, ప్రజా సమాచారం, పబ్లిక్ అవుట్ రీచ్ ఇలా ఆరు విభాగాల్లో పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. శాంతి భద్రతలు నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ స్థితిగతులు, దొంగతనాలపై ఫిర్యాదులు, రికవరీలు, తప్పిపోయిన కేసులు, దొరికిన వారు, గుర్తు తెలియని మృతదేహాలు, అరెస్ట్ వివరాలు, అపహరణకు గురైన వాహనాల వివరాలను పొందవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ ఇంటి పర్యవేక్షణ, ఈ–బీట్, ఈ–చలానా స్టేటస్‌లను తెలుసుకోవచ్చు. పబ్లిక్ సేవలు నేరాలపై ఫిర్యాదులు, సేవలకు సంబంధించిన దరఖాస్తులు, ఎన్వోసీలు, వెరిఫికేషన్లు, లైసెన్స్‌లు, అనుమతులు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. రహదారి భద్రత బ్లాక్ స్పాట్లు, ప్రమాదాల మ్యాపింగ్, రోడ్డు భద్రతా గుర్తులు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆస్పత్రులు, మందుల దుకాణాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రజా సమాచారం పోలీస్ డిక్షనరీ, సమీప పోలీస్ స్టేషన్ల వివరాలు, టోల్ ఫ్రీ నంబర్లు, వెబ్సైట్ల వివరాలు, న్యాయ సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ అవుట్ రీచ్ సైబర్ భద్రత, సోషల్ మీడియా, కమ్యూనిటీ పోలీసింగ్, స్పందన వెబ్సైట్, ఫ్యాక్ట్ చెక్ సేవలు, తదితరవన్నీ పొందుపర్చారు. ఎక్కడ ఉన్నా.. ఫిర్యాదు చేసుకోవచ్చు.. పోలీస్ సేవ యాప్ ద్వారా ఉన్న చోట నుంచే వేధింపులు, నేరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పోలీస్ సేవల్లో లోపాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఐడీ నంబర్‌తో సహా ఫిర్యాదుదారుడి మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అలాగే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్ని కూడా మెసేజ్‌లో తెలియజేస్తారు. పిటిషన్ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసలుబాటును కలి్పంచారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు నుంచీ.. ఏదైనా కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి నిందితులను కోర్టులో హాజరుపరచడం విచారణ, సాక్షులు, కేసులో ట్రయల్స్, ఇలా మొత్తం 24 దశల్లో కేసు సమగ్ర సమాచారం మెసేజ్ రూపంలో తెలుస్తుంటాయి. ఎఫ్ఐఆర్ కోసం స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. యాప్ ద్వారా సులభంగా ఎఫ్ఐఆర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ–చలానా వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న చలానాలను పరిశీలించి చెల్లించవచ్చు. మహిళ భద్రతకు ప్రాధాన్యం పోలీస్ సేవ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. సేఫ్టీ సేవ ద్వారా 12 రకాల సేవలను అందుబాటులో ఉంచారు. దిశ, సైబర్ మిత్ర యాప్, వన్ స్టాప్ సెంటర్, ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్, ఉమెన్ ప్రొటెక్షన్ తదితర 12 మాడ్యూళ్లను అనుసంధానం చేశారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘పోలీస్ సేవ’యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులపై తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ‘పోలీస్ సేవ’ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దిశ యాప్‌ను తప్పకుండా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. తద్వారా క్షణాల్లో పోలీసు సాయం పొందుతారు. – సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
నేరస్తులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: వరలక్ష్మి కేసులో నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, దిశ చట్టం ప్రకారం ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాజువాక మండలం చినగంట్యాడ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని మంత్రి సుచరిత సోమవారం పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించిన రూ.10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మప్రియ, సత్యగురునాథ్కు కలెక్టర్ వినయ్‌చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఆమె అందించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వరలక్ష్మి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. తక్షణమే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం స్ఫూర్తితో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు. నిందితుడు అఖిల్ సాయిని రిమాండ్‌కు తరలించారని.. అతని తండ్రి, వారి కుటుంబసభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. వరలక్ష్మి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న హోంమంత్రి సుచరిత దిశ యాప్‌లో ఫిర్యాదు చేయండి.. చిత్తూరులో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడికి 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారైందని.. విజయవాడలో 4 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడిందని హోం మంత్రి సుచరిత గుర్తు చేశారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను కూడా వివరించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థినీ దిశ యాప్, ఏపీ పోలీస్ సేవా యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా, దిశ చట్టం ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా ఎం.పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, సౌత్ ఏసీపీ రామాంజనేయరెడ్డి, ఆర్డీవో కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
సాక్షి, అమరావతి : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ పోలీస్ ఒకేసారి 48 జాతీయ అవార్డులు పొందటం గర్వించదగ్గ విషయయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోగలిగామని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశామన్నారు. 'మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా యాప్‌కి బంగారు పతకం వచ్చింది. పోలీస్ సేవలను ప్రజలకు అందించేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇంటినుంచే కావాల్సిన సమాచారం తెలుసుకొనే అవకాశం కల్పించాం. యాప్ ద్వారా 29 రోజుల్లోనే 32000 ఎఫ్ఐఆర్లు డౌన్ లోడ్ చేశారు. దాంతో పోలీస్ సేవా యాప్‌కి కూడా బంగారు పతకం వచ్చింది' అని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. (ఏపీ పోలీస్ నంబర్ వన్ ) సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సేవలు అందాలన్నది ప్రభుత్వ ఆదేశమని, టెక్నాలజీ వినియోగంతో అవినీతిని రూపుమాపాలన్నది సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు పారదర్శకత ,జవాబుదారీతనంతో ఏపీ పోలీస్ ముందుకు సాగుతోందని భవిష్యత్తులో టెక్నాలజిని పూర్తి స్థాయిలో వినియోగించి ఇంకా మార్పులు తెస్తామన్నారు. ఆన్లైన్ గేమింగ్ ,గ్యాంబ్లింగ్ ,బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని గంజాయి, డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి వాటిపై కూడా ఉక్కుపాదం మోపుతామని డీజీపీ వెల్లడించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టామని, టెక్నాలజీ వాడి తప్పించుకోవాలని చూసినా ట్రాక్ చేస్తామని హెచ్చరించారు. (48 స్కోచ్ గ్రూపు అవార్డులు దక్కించుకున్న ఏపీ ) -
దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేస్తారని దిశ ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, దీపికా పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వారు విజయవాడలోని దివ్య తేజశ్విని కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాం. ► మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ► ఈ కేసులో నిందితుడిపైన దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తాం. ► ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100, డయల్ 112, డయల్ 181 ద్వారా పోలీసుల సహాయం కోరాలి. దిశ యాప్, పోలీస్ సేవ యాప్ అందుబాటులో ఉన్నాయి. -
ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు
సాక్షి, అమరావతి: ఇప్పటికే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు ‘ఏపీ పోలీస్ సేవా యాప్ (సిటిజన్ సర్వీసెస్ అప్లికేషన్)’ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తోంది. గత నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యాప్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1 నుంచి యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచగా 3 నాటికి.. అంటే కేవలం మూడు రోజుల్లోనే 37 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా.. ► రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన 87 రకాల సేవలను ప్రజలు ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా తాము ఉన్న చోట నుంచే పొందేలా ఈ యాప్ ఉపకరిస్తోంది. ► యాప్ పనితీరు, ప్రయోజనాలపై ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఫైవ్‌స్టార్ రేటింగ్కుగాను 4.8 రేటింగ్ వచ్చింది. ► ‘ఏపీ పోలీస్ సేవా యాప్’ ద్వారా ప్రజలు పొందిన సేవల్లో అత్యధికంగా ఎఫ్ఐఆర్ల డౌన్లోడ్స్ ఉన్నాయి. ► ఆ తర్వాత స్థానంలో తమ వాహనాలకు జరిమానా పడిందా? మరేదైనా నేరంలో ఉందా? అనే అంశాలు ఉన్నాయి. ► యాప్ ద్వారానే నేరుగా ఫిర్యాదులు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ, తప్పిపోయిన వారి గురించి వెతికేస్తున్నారు. అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు పోలీస్ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోలీస్‌శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ ముగిశాక సీసీ కెమెరాల ఏర్పాటును త్వరితగతిన చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగానికి సంబంధించి 964 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. తొలి దశలో ఒక్కో స్టేషన్‌లోని లాకప్‌ల్లో రెండు కెమెరాలను ఏర్పాటు చేస్తారు. తర్వాత రెండో దశలో రిసెప్షన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) గదుల్లో మరో రెండు కెమెరాలు పెడతారు. కెమెరాలు 24 గంటలూ అక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ నిరంతరాయంగా రికార్డు చేస్తాయి. వీటిని ప్రధాన పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. పుటేజీలను ఎప్పటికప్పుడు సీడీల రూపంలో భద్రపరుస్తామని సాంకేతిక విభాగం డీఐజీ జి.పాల్‌రాజ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవల కోసమే.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. ఆయన ఆదేశాల మేరకు ప్రజలకు మా సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేలా ఏపీ పోలీస్ శాఖ అనేక వినూత్న ఆవిష్కరణలు చేసింది. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలు ఉన్న చోట నుంచే 87 సేవలను పొందొచ్చు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ, ఏపీ పోలీస్ -
తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించం
అనంతపురం సప్తగిరి సర్కిల్: తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం అనంతపురం పీటీసీ మైదానంలో నిర్వహించిన స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. ► మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే, తప్పు చేసిన పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేయిస్తున్నాం. ► ‘స్పందన’ ద్వారా 87వేల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటిలో 80% వరకు పరిష్కరించాం. ► కొత్తగా తిరుపతి, అమరావతి, విశాఖ ప్రాంతాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ► 87 పోలీస్ సేవలను ఏపీ పోలీస్ సేవ యాప్ ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. దిశ యాప్‌ను 11 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారు. అట్టహాసంగా పాసింగ్ అవుట్ పరేడ్ అనంతపురం పీటీసీ మైదానంలో 2019–20 ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు పరేడ్ నిర్వహించి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌లకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. 2019–20 బ్యాచ్‌లో మొత్తం 273 మంది ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేయగా, ఇందులో సివిల్ 138 మంది, ఏఆర్ 69 మంది, ఏపీఎస్పీ ఎస్ఐలు 66 మంది ఉన్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఈసారి 55 మంది మహిళా ఎస్ఐలు ఉండటం గమనార్హం. కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దేశంలోనే మొదటిసారిగా...ఏపీ పోలీస్‌శాఖ సరికొత్త యాప్
-
పోలీస్.. మరింత ఫ్రెండ్లీ
పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసమే. వారికి మరింత సమర్థవంతంగా సేవలు అందించడంలో భాగంగా ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఇవాళ ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఈ సందర్భంగా పోలీసులు చట్టాన్ని కాపాడటం కోసమే అధికారాలు ఉపయోగించాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పోలీసులు అంటే సేవకులని, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వారు కూడా మన కుటుంబ సభ్యులే అని భావించి ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందన్నారు. పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఏపీ పోలీస్ సేవ (సిటిజెన్ సర్వీసెస్ అప్లికేషన్) యాప్’ను సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కేంద్రాల నుంచి పాల్గొన్న 46 వేల మంది పోలీస్ యంత్రాంగాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు – పోలీసులు అంటే ఒక బలగం లేదా ఒక శక్తిగా కాకుండా, సేవలందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్ ఫ్రెండ్లీకి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్ ద్వారా పౌరులకు ఆరు విభాగాలలో 87 రకాల సేవలు అందుతాయి. ఇళ్ల భద్రత మొదలు ఏ అవసరం కోసం అయినా యాప్ ఉపయోగపడుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. – సర్టిఫికెట్ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్స్‌లు రెన్యువల్ చేయించుకోవాలన్నా, ఎన్ఓసీ కావాలన్నా పోలీస్ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్ఐఆర్ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం – మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్ చేర్చారు. దిశ యాప్ కూడా అనుసంధానం చేశారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా 6 మాడ్యూల్స్ ఉన్నాయి. చిన్న ప్రమాదం జరిగినా, దాన్ని రిపోర్టు చేయడంతోపాటు, ఆస్పత్రికి తరలించే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. – సైబర్ నేరాలకు సంబంధించి కూడా దాదాపు 15 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ నేరాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా యాప్ ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంలో వాస్తవం ఏమిటన్నది కూడా తెలుసుకోవచ్చు. “ఫ్యాక్టŠస్ చెక్’ అన్న ఫీచర్ కూడా ఇందులో ఉంది. – పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్ మీడియా కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రామ పోలీసులతో అనుసంధానం – ఇప్పటికే పోలీస్ సేవలు గ్రామ గ్రామానికి చేరాయి. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వాటిలో మహిళా పోలీసులను కూడా నియమించాం. వీరి ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. ఈ యాప్‌లో గ్రామ పోలీసులను కూడా అనుసంధానం చేశాం. – దేశంలోనే తొలిసారిగా దిశ యాప్ తీసుకొచ్చాం. ఇది ఎంతో సక్సెస్ అయింది. 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది గర్వకారణం. దిశ యాప్ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం. – సైబర్ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్ నంబర్‌ను ఫేస్బుక్లో అందుబాటులోకి తెచ్చాం. – న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలో “ఇంటర్–ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్’ (ఐసీజెఎస్) ప్రవేశపెట్టాం. ఈ విధానం ద్వారా ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది. ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ – నేరాన్ని నిరోధించడం, నేరాలపై విచారణ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, సమాజంలో నేరాలు జరగకుండా చేయడమే లక్ష్యం. వారి పని ఇంకా సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థను తెచ్చాము. – వీలైనంత పారదర్శకంగా వ్యవస్థను మార్చుకోవడం, ఒక ఫిర్యాదు చేయాలన్నా, ఒక ఎఫ్ఐఆర్ కాపీ పొందాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు. – ఈ కార్యక్రమంలో సీఎం జగన్ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోలీస్ ఫీల్డ్ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లను అందజేశారు. పోలీస్ శాఖ పక్షాన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక శాటిలైట్ ఫోన్‌ను సీఎంకు అందజేశారు. మహిళలకు మరింత భద్రత మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశారు. ఇప్పుడు 6 విభాగాల్లో 87 రకాల సేవలందించేలా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ఒక వారోత్సవం నిర్వహిస్తే బాగుంటుంది. – మేకతోటి సుచరిత, హోం మంత్రి పోలీస్ చరిత్రలో మరిచిపోలేని రోజు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నందుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇవాళ ఈ యాప్ ఆవిష్కరణ వల్ల ఏపీ పోలీస్ చరిత్రలో మరిచిపోలేని రోజు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘‘ఏపీ పోలీస్ సేవా యాప్’’ను రూపకల్పన చేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండానే సేవలు పొందే విధంగా యాప్ రూపకల్పన చేశామని చెప్పారు. దిశ వంటి చట్టాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ఏపీ పోలీస్ పలు ప్రశంసలు పొందిందని తెలిపారు. మరోమారు ప్రజలకు చేరువలో ఏపీ పోలీస్ పనిచేయనుందన్నారు. మహిళా భద్రత విషయంలో ‘దిశ’ యాప్‌తో పాటు ఈ యాప్ కూడా పనిచేస్తుందని సుచరిత వెల్లడించారు. (చదవండి: పోలీసులంటే భయం వద్దు: సీఎం జగన్) అందుబాటులోకి 87 సేవలు:డీఐజీ పాల్ రాజ్ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో 87 సేవలను తీసుకువచ్చామని డీఐజీ పాల్ రాజ్ చెప్పారు. ఫిర్యాదు నుంచి కేసు ట్రయిల్ స్టేటస్ వరకూ యాప్ ద్వారా అప్డేట్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు రసీదు కూడా ఈ యాప్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు.మహిళ రక్షణ, చోరీలు, రోడ్డు భద్రత వంటి అనేక అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అవసరం లేకుండా యాప్ ఉపయోగపడుతుందని పాల్ రాజ్ వెల్లడించారు. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) -
పోలీసులంటే భయం వద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని.. వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ సరికొత్త సేవా యాప్‌ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. యాప్ ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులు బాగా తగ్గించగలిగామని, పోలీసులు అందించే సేవలను ఒకే ఫ్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా పొందవచ్చన్నారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఏ దశలో కేసు ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని ఈ యాప్ తగ్గిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర పోలీస్‌శాఖకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. -
దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్
సాక్షి, అమరావతి : పాలనలో ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త యాప్‌ను పరిచయం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన కొత్త యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతోపాటు ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. (సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు కళ్లెం) దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత,.. సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. వీటితో పాటు ఎన్వోసీలు, లైసెన్సులు,పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను కూడా అందుబాటులో ఉంటాయి. మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో మహిళల కు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది. తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్త్ పాటు డీజీపీ గౌతవ్ సవాంగ్ ముఖ్య పోలీసు అధికారులు పాల్గొన్నారు. యాప్ విశిష్టతను సీఎంకు వివరించారు. ఈ యాప్ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ పోలీస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ’రాష్ట్రంలోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ (ఎస్ఓఎస్) స్వల్ప వ్యవధి లోనే పదకొండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించగా 117 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్స్మెంట్ వెహికల్స్ (రేస్) విధానం అందుబాటులో ఉంద’న్నారు. నిరంతర నిఘా కోసం డ్రోన్ల నుండి ప్రత్యక్ష ప్రసారం. అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు .ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. స్వల్ప సమయంలో అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఇప్పటికే 3500 వాహనాలను జీపీఎస్ పరికరాలు & స్మార్ట్ఫోన్లతో అనుసంధానం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకుంది. ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు మరియు మ్యాన్‌ప్యాక్‌లు) ఆరు విభాగాల్లో ఏపీ పోలీస్ సేవ యాప్ 87 రకాల సేవలు శాంతి భద్రతలు.. ♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు ♦ఎఫ్ఐఆర్ స్థితిగతులు, డౌన్లోడ్ ♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు ♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు ♦అరెస్టుల వివరాలు ♦వాహనాల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ సేవలు.. ♦ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్ సర్వీసు(ఎల్ఎంఎస్) , ఇ–బీట్) ♦ఈ–చలానా స్టేటస్ పబ్లిక్ సేవలు.. ♦నేరాలపై ఫిర్యాదులు ♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు ♦ఎన్వోసీ, వెరిఫికేషన్లు ♦లైసెన్సులు, అనుమతులు ♦పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ రహదారి భద్రత.. ♦బ్లాక్ స్పాట్లు ♦యాక్సిడెంట్ మ్యాపింగ్ ♦రహదారి భద్రత గుర్తులు ♦బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు ప్రజా సమాచారం.. ♦పోలీస్ డిక్షనరీ ♦సమీపంలోని పోలీస్‌స్టేషన్ ♦టోల్‌ఫ్రీ నంబర్లు ♦వెబ్సైట్ల వివరాలు ♦న్యాయ సమాచారం ♦ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు