కర్నూలు: పోలీసులంటే కఠిన హృదయులని.. వారిలో మానవత్వం ఉండబోదనే అపవాదు ఉంది. అయితే సోమవారం పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని తమ వాహనంలో ఆసుపత్రికి చేర్చి వీరు మానవత్వం చాటుకున్నారు. ఆ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంలో పోలీసుల సేవ కూడా ఉంది. వివరాలు.. ఉరుకుందలో వెలసిన ఈరన్నస్వామిని దర్శించుకోనేందుకు సోమ వారం కర్ణాటక రాష్ట్రం మాన్వి పట్టణానికి చెందిన ఉల్లేష్, ఉలిగమ్మ దంపతులు వచ్చారు.
నిండు గర్భిణి అయిన ఉలిగమ్మ ఉపవాస దీక్షతో ఉదయం స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో నిలిచి ఉన్నారు. ఉన్నట్టుండి ఆమెకు పురుటినొప్పులు రావడంతో క్యూలైన్‌లో ఉన్న భక్తులు విషయాన్ని అక్కడే ఉన్న పోలీసులకు చెప్పారు. వెంటనే స్పందించిన కౌతాళం ఎస్‌ఐ నరేంద్రకుమార్ కానిస్టేబుళ్లు రంగన్న, నరేంద్రగౌడ్ సాయంతో పోలీసు వాహనంలో ఆమెను కౌతాళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆసుపత్రికి తీసుకెళ్లడంతో తల్లీబిడ్డకు వైద్యులు చికిత్స చేశారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో వీరు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. భార్య ప్రాణం నిలవడంతోపాటు కుమారుడు పుట్టడంతో పోలీసులకు ఉల్లేష్ కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment