
భీమునికొలను, కత్తులకొండపై ముళ్లకంపలు, గుళకరాళ్లు
జంగిల్ క్లియరెన్స్‌ను, తాగు నీటి ఏర్పాట్లను పట్టించుకోని శ్రీశైలం దేవస్థానం, అటవీశాఖ అధికారులు
పాదయాత్ర భక్తులకు ఏటా తప్పని తిప్పలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.
శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్‌ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.
బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి
వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి.
శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు.
దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి
శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి.
– విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు
తాగు నీరు ఏర్పాటు చేయాలి
యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి.
– సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం
Comments
Please login to add a commentAdd a comment