ఎమ్మెల్యే శిల్పాతో మాట్లాడుతున్న ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి
సాక్షి, శ్రీశైలం (కర్నూలు): బుధవారం అర్ధరాత్రి.. అందరూ నిద్రమత్తులో ఉన్న వేళ.. లక్షలాది మంది కన్నడిగులు.. రెచ్చగొట్టిన అల్లరి మూకలు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.. వాహనాల అద్దాలు పగిలిపోయాయి.. అలజడి విషయం తెలిసి అధికారులు వెంటనే స్పందించారు. సమన్వయంతో వ్యవహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు వెంటనే తొలగిపోయాయి.
ఏం జరిగిందంటే...
బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పాతాళగంగ మార్గంలోని బీరప్ప సదన్ పక్కనే ఉన్న టీదుకాణం వద్ద నీళ్ల బాటిల్ విషయమై వివాదం చెలరేగింది. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న విషయంపై దుకాణం యజమానితో కన్నడిగులు గొడవపడ్డారు. దుకాణ యజమాని భార్యను కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో యజమాని పక్కనే ఉన్న గొడ్డలితో దాడికి దిగడంతో కన్నడిగులు రెచ్చిపోయారు. టీ దుకాణాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. అలాగే శివసదనం కూడలి వద్ద టైర్లను వేసి కాల్చారు. ఆ తర్వాత క్షేత్ర వ్యాప్తంగా అన్ని కూడళ్లు, పార్కులు, వివిధ ప్రదేశాలు, ప్రధాన పురవీధుల్లో ఉన్న కన్నడిగులందరినీ రెచ్చగొట్టారు. దీంతో వారంత ఏకమై ముందుగా పరిపాలనా భవన్‌రోడ్డులో ఉన్న దుకాణాలపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాలు, కార్లు, జీపుల అద్దాలను పగులగొట్టారు. అక్కడ నుంచి పోస్టాఫీస్ రోడ్డు, పాతాళగంగ మార్గంలో మూసివేసిన దుకాణాలపై కూడా వారు ప్రతాపం చూపించారు. దుకాణ యజమానులు సైతం కన్నడిగులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్త స్థాయికి చేరుకుంది.
పోలీస్ సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎస్పీ శృతి
అధికారులు ఏం చేశారంటే..
విషయం తెలుసుకుని ఆత్మకూరు డీఎస్పీ శృతి, శ్రీశైల దేవస్థాన ఈఓ ఎస్ లవన్న, డిప్యుటేషన్‌పై వచ్చిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు, స్పెషల్‌ఫోర్స్ సిబ్బంది వెంటనే స్పందించారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి అల్లరి మూకలను అదుపు చేశారు. ఇందుకోసం శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్దరామ శివాచార్యమహాస్వామి సహకారాన్ని తీసుకున్నారు. గుంపులుగా ఉన్న వారి వద్దకు వచ్చి కన్నడంలో ప్రశాంతంగా ఉండాలని పీఠాధిపతి ఆదేశించడంతో కన్నడిగులు శాంతించారు. దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహకారంతో డీఎస్పీ శృతి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచారు. తమకు రక్షణ కరువైందని దుకాణ యజమానులు గురువారం సాయంత్రం 4 గంటల వరకు షాపులను తెరవలేదు. దీంతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డీఎస్పీ శృతి, ఈఓ లవన్న దుకాణదారులతో చర్చించారు. షాపులు తెరుచుకోవాల్సిందిగా సూచించి, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో దుకాణాలను సాయంత్రం 5 గంటల నుంచి తెరిచారు.
మాట్లాడుతున్న పీఠాధిపతి
చదవండి: (రణరంగంగా మారిన శ్రీశైలం..)
ఎస్పీ సమీక్ష
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో పరిస్థితులపై ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. గురువారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న ఆయన భ్రమరాంబా అతి«థిగృహంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థాన ఈఓ ఎస్.లవన్నతో చర్చించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నపాటి ఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా, దేవస్థాన ఈవో ఎస్.లవన్నతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో తిరిగి పరిస్థితిని ఎస్పీ సమీక్షించారు.
క్షతగాత్రులకు పరామర్శ
శ్రీశైలంప్రాజెక్ట్/కర్నూలు(హాస్పిటల్): శ్రీశైలంఘటనలో గాయాలపాలైన కన్నడ భక్తులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఘటనలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరోసర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న రాముడు, క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న శ్రీశైలంను ఆయన ప్రత్యేకంగా కలిసి వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తుడిని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామశివాచార్య మహాస్వామీజీ పరామర్శించారు.
శ్రీశైలంలో ప్రశాంత వాతావరణం
శ్రీశైలంటెంపుల్: క్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, భక్తులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. గురువారం శ్రీశైలంలోని భ్రమరాంబా అతిథి గృహంలో దేవస్థాన ఈఓ ఎస్.లవన్న, ఆత్మకూరు డీఎస్పీ శృతితో కలిసి ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బుధవారం అర్ధరాత్రి శ్రీశైలంలో జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. గాయపడిన కన్నడ భక్తుడు చనిపోయాడని సోషల్ మీడియాలో అసత్య ప్రసారాలు చేస్తున్నారని, ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని వీడియోను చూపించారు. కొన్ని అసాంఘిక శక్తులు క్షేత్ర ప్రతిష్టతను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. ముస్లింలు కన్నడ భక్తులను కొట్టారని విషప్రచారం చేస్తున్నారని, దానిని ఖండిస్తున్నామన్నారు. గొడవకు బందోబస్తుకు ముడిపెట్టడం సబబుకాదని డీఎస్పీ శృతి అన్నారు. ఉగాది మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు్త ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నామని ఈఓ లవన్న తెలిపారు. క్షేత్రానికి ఎంతమందైనా రావచ్చని, ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని సూచించారు.
భక్తులంతా శాంత చిత్తులై ఉండాలి
శ్రీశైలం చేరుకున్న కన్నడ భక్తులంతా శాంతచిత్తులై ఉండాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామీజీ తెలిపారు. గురువారం కన్నడ భక్తుల కోసం పీఠాధిపతి శాంతి సందేశాన్ని వీడియో రికార్డు చేసి పంపించారు. ఉగాది ఉత్సవాలు మూడు రోజల పాటు జరగనున్నాయని, భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment