‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి.
‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు.
మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది.
ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది.
పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు.
బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు.
‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు.
‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.
తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు.
అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.
‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి.
ప్రపంచ వచనాలు
Published Mon, Sep 16 2024 12:21 AM | Last Updated on Mon, Sep 16 2024 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment