కర్రల సమరం.. జన సంద్రంగా దేవరగట్టు | Devotees Came In Large In Devaragattu Stick Fight Festival | Sakshi
Sakshi News home page

కర్రల సమరం.. జన సంద్రంగా దేవరగట్టు

Published Sat, Oct 12 2024 7:43 PM | Last Updated on Sat, Oct 12 2024 8:18 PM

Devotees Came In Large In Devaragattu Stick Fight Festival

సాక్షి, కర్నూలు: దేవరగట్టు జనసంద్రంగా మారింది. బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఊరేగింపుతో బన్నీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా కర్రల సమరం సాగనుంది. కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..
గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది.  దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్‌ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.

అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో  వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య  అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.

అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.

ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది.  

ఉత్సవ వివరాలు ఇలా..
12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది  
13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 
14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం
15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన  
16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి

 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement