
ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాన్ని ఈవోకు అందజేస్తున్న ప్రతినిధి
శ్రీశైలం టెంపుల్: భక్తులకు వైద్య ఆరోగ్య పరంగా కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతున్న రక్షణ చర్యలకుగాను శ్రీశైల దేవస్థానానికి ఐఎస్‌వో (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ ధ్రువీకరణ (ఐఎస్‌వో–45001) లభించింది. అలాగే క్షేత్రపరిధిలో పారిశుధ్య నిర్వహణ, కోవిడ్ నిబంధనల అమలు తదితర చర్యలకుగాను జీహెచ్‌పీ (గుడ్ హైజెనిక్ ప్రాక్ట్రీసెస్) ధ్రువీకరణ కూడా లభించింది. ఈ మేరకు ఆదివారం ఐఎస్‌వో ప్రతినిధి ఎ.శివయ్య ధ్రువీకరణ పత్రాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావుకు అందజేశారు. రాష్ట్రంలో జీహెచ్‌పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం కావడం విశేషం.
చదవండి: Vijayawada: చందమామ నీలి వర్ణంలో కనువిందు
ఈ సందర్భంగా ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలు ఎప్పటికప్పుడు తగు సలహాలు, సూచనలు చేస్తూ క్షేత్రాభివృద్ధికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. దేవస్థాన సిబ్బంది కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అందరి కృషితోనే ఐఎస్‌వో ధ్రువీకరణ లభించిందన్నారు.