మంచి, చెడు స్పర్శపై అవగాహన
కర్నూలు(హాస్పిటల్): మంచి, చెడు స్పర్శపై బాలికలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. శాంతికళ తెలిపారు. లైంగిక దాడుల నివారణపై సోమవారం కర్నూలు మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్, విద్య, వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. శాంతికళ మాట్లాడుతూ.. బాల్యవిహాలు చేసినా, బాలికలను లైంగికంగా వేధించినా 1098, 100, 181 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పిల్లలు లైంగికదాడులకు గురైనప్పుడు ఆందోళనకు గురవుతారని, వారిని గుర్తించి ఎలా కౌన్సిలింగ్ చేయాలో మానసిక వైద్యనిపుణులు డాక్టర్ చైతన్య వివరించారు. ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శైలేష్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమంతో పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి వైద్యం అందిస్తారన్నారు. డీపీఎంఓ డాక్టర్ ఉమ, డైస్ మేనేజర్ ఇర్ఫాన్, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఆర్‌బీఎస్‌కే కన్సల్టెంట్ మల్లికార్జున పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పిల్లలు కాలేదని, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఉప్పర సందీప్(25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండవీటి ప్రాంతానికి చెందిన కుమారుడు ఉప్పర సందీప్(25)కు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ ప్రాంతానికి చెందిన మానసతో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సందీప్ హోటల్ వ్యాపారం చూసుకునే వాడు. హోటల్ సరిగా నడవకపోవటంతో రెండు నెలల నుంచి మూసివేసి వేరే పనికి వెళ్లేవాడు. ఆర్థిక ఇబ్బందులు, రెండు సంవత్సరాలు కావస్తు న్నా పిల్లలు పుట్టకపోవటంతో తీవ్ర మనస్తానికి గురయ్యాడు. ఆదివారం ఇంటి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు బద్దకొట్టి సందీప్‌ను కిందకు దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సందీప్ భార్య మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఏఎస్‌ఐ క్రిష్టప్ప తెలిపారు.
రైల్వే ట్రాక్‌పై మృతదేహం
తుగ్గలి: లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించిన గ్యాంగ్ మెన్లు డోన్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే కానిస్టేబుల్ నరసింహ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఆచూకీపై ఆరా తీశారు. మొహంపై తీవ్రగాయాలై మృతి చెందాడు. రైలులో నుంచి జారి పడ్డాడా, మరేదైనా కారణమా అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు చిరునామా మేరకు ఒడిశా రాష్ట్రం రాజ్‌గంగపూర్ కిషన్‌పాడకు చెందిన రటియా బాడెక్(33)గా గుర్తించారు. సెంట్రింగ్ కూలీ నిమిత్తం గదగ్ వెళుతున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. మృతుడు జనరల్ టికెట్‌పై ప్రయాణిస్తున్నారని తోటి ప్రయాణికుడి వద్ద టికెట్ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ రైల్వే ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment