స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసం
కర్నూలు: స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.42 లక్షలు మోసం చేశారని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన బాధితురాలు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్‌లో తెలియని వ్యక్తులు లింకులు పంపి.. బ్లాక్ ట్రేడింగ్ అని, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వంటి వాటితో నమ్మించారని, పెట్టుబడి పెట్టిన డబ్బుకు రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నందున మహిళను పూర్తిస్థాయిలో విచారించి దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని సైబర్ ల్యాబ్ పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 102 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐ శ్రీనివాస నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● అమడగుంట్ల గ్రామంలో తన 6 ఎకరాల పొలాన్ని దస్తగిరి అనే వ్యక్తి కౌలుకు తీసుకుని కౌలు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని కర్నూలు వెంకటరమణ కాలనీలో నివాసముంటున్న ప్రభావతమ్మ ఫిర్యాదు చేశారు.
● తన పేరుతో ఉన్న ఆస్తి, పెన్షన్ కోసం పెద్ద కుమార్తె, అల్లుడు, చిన్న కుమార్తె పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కర్నూలు గఫూర్ నగర్‌కు చెందిన సుబ్బారావు ఫిర్యాదు చేశారు.
● తనకు సంబంధించిన 30 గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని, విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన పల్‌దొడ్డి జమ్మన్న ఫిర్యాదు చేశారు.
● ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని నందవరం గ్రామానికి చెందిన సావిత్రమ్మ, తన ఇంటికి రస్తా ఇవ్వకుండా వేరే వ్యక్తులు అడ్డంగా ఇల్లు నిర్మించుకుంటున్నారని పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన బోయ లక్ష్మి ఫిర్యాదు చేశారు.
రూ.42 లక్షలు స్వాహా చేసిన
సైబర్ నేరగాళ్లు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment