క్షేత్ర ప్రదర్శనలతో రైతులకు మెరుగైన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): క్షేత్ర ప్రదర్శనలతో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆచార్యా ఎన్‌జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ తెలిపారు. సోమవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని సమావేశ మందిరంలో ఏరువాక కేంద్రం జిల్లా స్థాయి సమన్వయ సంఘం సమావేశం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఎం.జాన్షన్ అధ్యక్షతన నిర్వహించారు. యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు అందజేశారు. శనగలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ద్వారా విడుదలైన ఎన్‌బీఈజీ 857, 1267 రకాలతో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించారన్నారు. వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు కలుపు మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్షన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో నంద్యాలలోని ఏరువాక కేంద్రాన్ని గత ఏడాది ఆగస్టు 1 నుంచి కర్నూలుకు తరలించామన్నారు. మొక్కజొన్నలో కెమికల్ వినియోగం పెరిగిపోయిందని, వచ్చే ఏడాది వీటిని తగ్గించి జీవన ఎరువుల వాడకాన్ని పెంచుతామన్నారు. సమావేశంలో ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కో–ఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, ఆత్మ డీపీడీ శ్రీలత, ఏడీఏ వెంకటేశ్వర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment