సాక్షి, అమరావతి: ఇప్పటికే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు ‘ఏపీ పోలీస్ సేవా యాప్ (సిటిజన్ సర్వీసెస్ అప్లికేషన్)’ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తోంది. గత నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ యాప్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1 నుంచి యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచగా 3 నాటికి.. అంటే కేవలం మూడు రోజుల్లోనే 37 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా..
► రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన 87 రకాల సేవలను ప్రజలు ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా తాము ఉన్న చోట నుంచే పొందేలా ఈ యాప్ ఉపకరిస్తోంది.
► యాప్ పనితీరు, ప్రయోజనాలపై ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఫైవ్‌స్టార్ రేటింగ్‌కుగాను 4.8 రేటింగ్ వచ్చింది.
► ‘ఏపీ పోలీస్ సేవా యాప్’ ద్వారా ప్రజలు పొందిన సేవల్లో అత్యధికంగా ఎఫ్‌ఐఆర్‌ల డౌన్‌లోడ్స్ ఉన్నాయి.
► ఆ తర్వాత స్థానంలో తమ వాహనాలకు జరిమానా పడిందా? మరేదైనా నేరంలో ఉందా? అనే అంశాలు ఉన్నాయి.
► యాప్ ద్వారానే నేరుగా ఫిర్యాదులు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ, తప్పిపోయిన వారి గురించి వెతికేస్తున్నారు.
అన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు
పోలీస్ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోలీస్‌శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ ముగిశాక సీసీ కెమెరాల ఏర్పాటును త్వరితగతిన చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగానికి సంబంధించి 964 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. తొలి దశలో ఒక్కో స్టేషన్‌లోని లాకప్‌ల్లో రెండు కెమెరాలను ఏర్పాటు చేస్తారు. తర్వాత రెండో దశలో రిసెప్షన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) గదుల్లో మరో రెండు కెమెరాలు పెడతారు. కెమెరాలు 24 గంటలూ అక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ నిరంతరాయంగా రికార్డు చేస్తాయి. వీటిని ప్రధాన పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. పుటేజీలను ఎప్పటికప్పుడు సీడీల రూపంలో భద్రపరుస్తామని సాంకేతిక విభాగం డీఐజీ జి.పాల్‌రాజ్ తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవల కోసమే..
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. ఆయన ఆదేశాల మేరకు ప్రజలకు మా సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేలా ఏపీ పోలీస్ శాఖ అనేక వినూత్న ఆవిష్కరణలు చేసింది. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలు ఉన్న చోట నుంచే 87 సేవలను పొందొచ్చు.
– గౌతమ్ సవాంగ్, డీజీపీ, ఏపీ పోలీస్
Comments
Please login to add a commentAdd a comment