వెబినార్‌లో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్. చిత్రంలో ఎన్‌సీపీసీఆర్ సభ్యుడు ఆర్.జి.ఆనంద్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి జరుగుతోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) సభ్యుడు డాక్టర్ ఆర్‌జీ ఆనంద్ కితాబిచ్చారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని డీజీపీతో చర్చించారు. ‘బాలల హక్కులు, రక్షణ, అక్రమ రవాణా నివారణ’ అంశాలపై డీజీపీ సవాంగ్‌తో కలిసి వెబినార్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ ఆఫీసర్లు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, దిశ పోలీస్ స్టేషన్ల అధికారులతో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మహిళలు, బాలల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంత మంచి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్న సీఎం జగన్, డీజీపీ సవాంగ్ అభినందనీయులన్నారు.
‘దిశ’ పనితీరు అద్భుతం
ఆపరేషన్ ముస్కాన్ నిరంతర ప్రక్రియతో బాలబాలికలకు విముక్తి కల్పించడం, పునరావాసం కల్పించడంలో ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే ముందుందన్నారు. మహిళల రక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఏపీ పోలీసుల పనితీరు దేశానికే రోల్ మోడల్ అన్నారు. దిశ చట్టం మహిళల రక్షణకు ఉపయోగపడుతున్న తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు సమర్థంగా పనిచేసి బాలల అక్రమ రవాణాను అడ్డుకున్నారని తెలుసుకున్నానన్నారు. పిల్లలకు మానసిక, సాంఘిక సమస్యల గురించి ఏపీ పోలీస్ చేపట్టిన సైకో సోషల్ కౌన్సెలింగ్ సెంటర్ పనితీరు అద్భుతమన్నారు. పిల్లలకు కౌన్సెలింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 18001212830 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందన్నారు. చదవండి: (అమరావతి అందరిదీ కాకుంటే ఎలా?)
సచివాలయ వ్యవస్థ భేష్
గుంటూరు వెస్ట్: రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్.జి.ఆనంద్ కొనియాడారు. గుంటూరు కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా చిన్నారులకు చక్కని పోషకాహారం లభిస్తోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. గుంటూరులో జాతీయ బాలల హక్కుల కమిషన్ బెంచ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment