పోలీసులూ.. ప్రజా సేవకులే! | DGP Gautam Sawang interview with Sakshi | Sakshi
Sakshi News home page

పోలీసులూ.. ప్రజా సేవకులే!

Published Sat, Aug 3 2019 3:12 AM | Last Updated on Sat, Aug 3 2019 10:34 AM

DGP Gautam Sawang interview with Sakshi

‘పోలీసులు ప్రజా సేవకులుగా పనిచేసి మన్ననలు అందుకోవాలి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్లలో అందుకు భిన్నమైన పరిస్థితులు కొనసాగాయి. కొందరు అధికారులు వ్యక్తిగత ప్రాపకం కోసం మొత్తం వ్యవస్థనే అభాసు పాలయ్యేలా చేశారు. ఎన్నికల సమయంలో ఇది పరాకాష్టకు చేరింది. పోలీసులంటే ప్రజల్లో వ్యతిరేక భావన పెరగటంపై ఒక పోలీసుగా చాలా బాధపడుతున్నా. కచ్చితంగా ఈ పరిస్థితిలో మార్పు తెస్తాను. ప్రజలు ఎంత మార్పు కోరుకుంటున్నారో సార్వత్రిక ఎన్నికల్లో వారిచ్చిన మ్యాండెట్‌ చెబుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పోలీసులూ ప్రజా సేవకులే అనే నమ్మకాన్ని కలిగిస్తా’నని రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు.‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలివీ.. 
– సాక్షి, అమరావతి 

సాక్షి: డీజీపీగా ప్రాధామ్యాలు ఏమిటి?  
డీజీపీ: పోలీసు ఆఫీసర్‌ కావాలని పాఠశాల వయసులోనే కలలు కన్నాను. 23 ఏళ్ల వయసులో ఐపీఎస్‌ అయ్యాను. డీజీపీగా నాకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన అవకాశం ఇది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడమే నా ముందున్న కర్తవ్యం. రాష్ట్ర విభజన అనంతరం పోలీసు శాఖ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. 16 శాతానికి పైగా సిబ్బంది కొరత ఉంది. వైఫల్యాలను చక్కదిద్ది, విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి తిరిగి ప్రజల మన్ననలు అందుకునేలా పనిచేస్తాం.  

సాక్షి : గతంలో కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్‌ చేసిన దృష్టాంతాలున్నాయి. ఆ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు?  
డీజీపీ: కొందరు ఉద్దేశపూర్వకంగా పోలీసు శాఖలో కులాల వారీగా లెక్కలు తీసి.. కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్‌ చేసి.. అప్రధాన పోస్టుల్లో వేసి ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారు. అలాంటి పోకడలు ఇక ఉండవు. గతంలో అన్యాయానికి గురైన పోలీసు అధికారులకు న్యాయం చేస్తాం. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. సమర్థతే ప్రామాణికంగా పోస్టింగ్‌లు ఇస్తాం.  

సాక్షి: పోలీసు వ్యవస్థను టీడీపీ నేతలు చేతుల్లోకి తీసుకున్నారనే ఆరోపణలపై ఏమంటారు?  
డీజీపీ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వంటి స్వయం ప్రతిపత్తి శాఖలు, విభాగాలను కొందరు చేతుల్లోకి తీసుకుని తమకు నచ్చని, తమను ఎదిరించిన వారిపై కక్ష సాధింపునకు వాడుకున్నారనే ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. వాటిపై అవసరమైతే విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తాం. 

సాక్షి: రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం సమస్య ఎలా ఉంది?  
డీజీపీ: వామపక్ష తీవ్రవాదం పురుడు పోసుకున్న ఏపీలోనే ఉనికి కోల్పోయింది. ప్రజల కోసమే పోరాటం చేస్తున్నామని చెబుతున్న మావోయిస్టులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఏజెన్సీల నుంచి రాష్ట్రంలోకి వచ్చి వెళ్తున్నారు. మైదాన ప్రాంతాల్లో వారి ఉనికి లేదు. ఏజెన్సీ ప్రాంతంలో అడపాదడపా ఉన్నా వారి కార్యకలాపాలు రానున్న కాలంలో కనుమరుగవుతాయి. 

సాక్షి: రాష్ట్రంలో ఏ తరహా నేరాలు ఎక్కువంటారు?  
డీజీపీ: కొన్నేళ్లుగా సైబర్‌ క్రైమ్, వైట్‌ కాలర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిన విషయాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రైమ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మహిళలను కించపర్చడం, చిన్నారులు, వృద్ధులపై వేధింపులు వంటి నేరాల్లో దేశంలో పదో స్థానంలోపు ఉన్నాం. మహిళల అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరంగా మారింది. మైనర్‌ బాలికలను అపహరించి వ్యభిచార కూపాలకు తరలించే ముఠాలు ఉన్నాయని గుర్తించాం.    

సాక్షి: ‘ప్రవాసీ’ మోసాలు, నేరాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 
డీజీపీ: నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ), నాన్‌ రెసిడెంట్‌ తెలుగు(ఎన్‌ఆర్‌టీ)ల కోసం ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తోంది. వివాహాలకు సంబంధించిన వివాదాలు, ఆస్తి వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఉన్నతవిద్య, ఉద్యోగం కోసం డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడటం లాంటి విషయాలపై సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. 

సాక్షి: రియల్‌ ఎస్టేట్‌ మోసాలు, సివిల్‌ దందాలపై ఏ విధంగా స్పందిస్తారు? 
డీజీపీ: రాష్ట్రంలో కొందరు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వెంపర్లాడుతుండటంతో సివిల్‌ తగాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా భూ దందాలు, ఆస్తిపరమైన సెటిల్‌మెంట్లు, వడ్డీ వ్యాపారం వంటి అనేక విషయాల్లో కేసుల వరకు వచ్చినా ఆధారాలు సరిగ్గా లేక నిందితులు తప్పించుకుంటున్నారు. కొన్నిచోట్ల పోలీసు స్టేషన్లలో సెటిల్‌మెంట్లు జరుగుతున్నట్టు ఫిర్యాదులున్నాయి. వీటన్నింటిపైనా దృష్టి పెడతాం.  

సాక్షి: చలానాలతో సరిపెడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను ఎలా అరికడతారు? 
డీజీపీ: టాఫిక్‌ నిబంధనలపై అప్రమత్తం చేసేందుకు, వాహన చోదకుల్లో ఒక రకమైన భయం, బాధ్యత పెంచేందుకే జరిమానాలు విధిస్తుంటాం. యాక్సిడెంట్స్‌ అరికట్టేందుకు చలానాలు ఒక్కటే సరిపోదు. వాహన చోదకులు, ప్రయాణికుల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపడతాం.  

సాక్షి: భద్రత తగ్గించారని కొందరు నాయకులు విమర్శిస్తున్నారు? 
డీజీపీ: ప్రజాప్రతినిధులకు భద్రత తగ్గించామనే విమర్శల్లో నిజం లేదు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోని ప్రత్యేక విభాగాలు ఎప్పటికప్పుడు సమీక్షించి అప్పటి పరిస్థితిని బట్టి గన్‌మెన్ల కేటాయింపు, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటాయి. 

సాక్షి: ఐక్యరాజ్య సమితి పోలీస్‌ కమిషనర్‌గా మీ అనుభవం ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది? 
డీజీపీ: ఐక్యరాజ్య సమితి పోలీస్‌ కమిషనర్‌గా నాలుగేళ్లు పని చేశా. 46 దేశాలకు చెందిన 1,325 పోలీసు అధికారులకు నేతృత్వం వహించా. ప్రపంచ వ్యాప్తంగా పోలీసింగ్‌పై అవగాహన ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తాను. ఇక్కడ ఉన్న విస్తారమైన వనరులు, సమర్థత కలిగిన మానవ వనరులను ఉపయోగించుకుంటే దేశం యావత్తు మనవైపు చూస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలు మాలో స్ఫూర్తి నింపాయి. అందుకు అనుగుణంగా మాకున్న అనుభవాన్ని జోడించి పనిచేస్తాం. 

సాక్షి: ప్రభుత్వం తాజాగా చేపట్టిన ‘స్పందన’పై మీ స్పందన ఏమిటి? 
డీజీపీ: చాలా మంది ప్రజలు తమ సమస్యలను నేరుగా, ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి చెప్పుకోలేకపోతున్నారు. అటువంటి వారికి ఒక భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, నగర కమిషనరేట్ల పరిధిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. స్పందనలో వచ్చిన ప్రజల విజ్ఞప్తులను ఆన్‌లైన్‌ చేసి ప్రతి నెల నేర సమీక్ష సమావేశాల్లో ఎంత వరకు పరిష్కరించింది ఆరా తీస్తాం. దీనివల్ల న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే ప్రతి ఒక్కరికీ ఒక భరోసా ఇచ్చి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచుతాం. 

వీక్లీ ఆఫ్‌ అమలుపై మీ కామెంట్‌?  
పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పోలీసులకిచ్చిన వీక్లీ ఆఫ్‌ హామీని సీఎం అయిన కొద్ది రోజులకే అమలు చేయడం పోలీసు సంక్షేమంలో ముందడుగు. అంతటితో సరిపెట్టకుండా ఆరోగ్య భద్రత, పోలీసు కుటుంబాల సంక్షేమం వంటి అనేక కార్యక్రమాలను చేపడతామని సీఎం చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement