ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నూతన యూనిఫామ్‌లు
పోలీసుల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించిన సీఎం జగన్
ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల యూనిఫామ్‌లో మార్పులు
సరెండర్ లీవులు మంజూరు.. అమరవీరుల పిల్లలకు 2 శాతం రిజర్వేషన్
ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా.. ఆ శాఖకు మరింత గౌరవం.. సంక్షేమం
సాక్షి, అమరావతి: పోలీసులు ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే యోధులు... కానీ వారి ఆత్మగౌరవం, సంక్షేమం గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలే లేవు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసుల ఆత్మగౌరవాన్ని పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా ఇనుమడింపజేశారు. పోలీసుల సంక్షేమం కోసం కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నారు. సర్వీసు నిబంధనలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇతరత్రా ప్రయోజనాలు కల్పించే విధాన నిర్ణయాలను సత్వరం ఆమోదించడంపట్ల దాదాపు లక్షమంది పోలీసు అధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కోరిన వెంటనే పరిష్కారం
బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన తమ యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) కానిస్టేబుళ్లు 16ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ యూనిఫామ్ తమ ఆత్మగౌరవానికి భంగకరంగా ఉందని చెబుతూ వచ్చినా ఇన్నేళ్లు ఫలితం లేకపోయింది. కానీ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోమన్‌రెడ్డిని కలసి తమ యూనిఫామ్‌లో మార్పులు చేయాలని కోరారు.
వారు కోరిన 16రోజుల్లోనే ఏఆర్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుళ్ల యూనిఫామ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బ్యారెట్ టోపీ స్థానంలో పీక్ టోపీని ప్రవేశపెట్టింది. కానిస్టేబుల్ నుంచి రిజర్వ్ ఎస్‌ఐ స్థాయివరకు నలుపు రంగు విజిల్ కార్డ్‌ను తీసుకువచ్చింది. ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు విజిల్ కార్డ్‌తోపాటు పోలీస్ యాంబ్లమ్ ఉన్న నలుపు బకిల్ ఉన్న బెల్ట్‌ను యూనిఫామ్‌లో భాగం చేసింది. దాంతో ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల ఆత్మ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా
రాష్ట్రంలో ఎస్‌ఐలకు గెజిటెడ్ అధికారి హోదా కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త పీఆర్సీ ద్వారా ఆమేరకు సిఫార్సు చేయనున్నట్టుగా ప్రకటించింది.
ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట
పోలీసుల ఆర్థిక ప్రయోజనాలు కల్పించే డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సత్వరం చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఎల్‌ఆర్, ఏఎస్‌ఎల్‌ఎస్ బిల్లులను మార్చి 31లోగా చెల్లించాలని ఆర్థిక శాఖను వారం రోజుల క్రితమే ఆదేశించారు.
► పోలీసులకు వివిధ రిస్క్ అలవెన్సుల మంజూరు.
► పోలీసులకు 24 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్‌ను కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్వీసుకు ప్రత్యేక ఇంక్రిమెంట్.
► ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్ల మంజూరు
అమరవీరుల పిల్లలకు రిజర్వేషన్
విధి నిర్వహణలో ఆశువులు బాసిన పోలీసు అమరవీరుల కుంటుంబాలకు మరింత ప్రయోజనం కలిగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల కుటుంబాల పిల్లలకు ఇంజినీరింగ్, వైద్య విద్య తదితర కోర్సుల్లో 2శాతం రిజర్వేషన్ కల్పించారు. దశాబ్దాలుగా అమరవీరుల కుటుంబాల పిల్లలకు కేవలం 0.25 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్‌ను ఏకంగా 2 శాతానికి పెంచడంతో అమరవీరుల కుటుంబాల్లోని పిల్లలు ఇంజినీరింగ్, వైద్య విద్య, ఇతర ఉన్నత కోర్సుల్లో చేరి ఉజ్వల భవిష్యత్‌ను సాధించేందుకు ముఖ్యమంత్రి అండగా నిలిచారు.
ఇతర ప్రయోజనాలు
► సర్వీసుకు సంబంధించిన సమస్యలను విన్నవించుకునేందుకు ఇప్పటివరకు సరైన వేదికలేకపోవడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దీనికి పరిష్కారంగా డీజీపీ కార్యాలయంలో, జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు.
► కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో పోలీసు ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతోపాటు వైద్య అధికారులను నియమించాలని సీఎం ఆదేశం.
► మహిళా పోలీసులకు అదనంగా ఏడాదికి అయిదు క్యాజువల్ లీవులు మంజూరు చేయడంతోపాటు చైల్డ్ కేర్ లీవులను 150 రోజుల నుంచి 180 రోజులకు పెంపు.
► విధి నిర్వహణలో భాగంగా రాజధానికి వచ్చే మహిళా పోలీసులకు ప్రత్యేక వసతి సౌకర్యం.
► పోలీసులకు ఎల్‌టీసీ సౌకర్యం పునరుద్ధరణ
► పోలీసు అధికారుల సంఘానికి తొలిసారిగా రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో భాగం చేశారు. ఇటీవల నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment