సాక్షి, తాడేపల్లి: పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని.. వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ సరికొత్త సేవా యాప్‌ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. యాప్ ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులు బాగా తగ్గించగలిగామని, పోలీసులు అందించే సేవలను ఒకే ఫ్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా పొందవచ్చన్నారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఏ దశలో కేసు ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని ఈ యాప్ తగ్గిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర పోలీస్‌శాఖకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment