రికవరీ చేసిన ఫోన్‌లను బాధితులకు అందజేస్తున్న ఎస్పీ జాషువ
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సెల్‌ఫోన్ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు.
ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల రికవరీపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు.
డేటాతోనే ఆందోళన..
జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వాటి ఖరీదు గురించి ఆలోచించనప్పటికీ ఫోన్‌లో భద్రపరచుకుంటున్న డేటా విషయంలో ఎక్కువ ఆవేదనకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న హితులు, స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్‌లతో పాటు పలు విలువైన, అత్యంత కీలకమైన పత్రాలను సైతం సెల్‌ఫోన్‌లోనే భద్రపరచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారింది.
వినియోగంలో ఉంటేనే..
జిల్లాలో 200 సెల్‌ఫోన్‌లు రికవరీ చేసిన పోలీసులు మిగిలిన ఫోన్‌లు వాడుకలో లేకపోవటంతో రికవరీ చేయటం ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దొంగిలించిన మొబైల్‌ను ఏ క్షణాన ఉపయోగించినా రికవరీ చేస్తారు.
అయితే బాధితులు ఫిర్యాదులో పూర్తి పేరు, చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబరు, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియజేయాలి. పై వాటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫోన్‌లు రికవరీ చేయటం కష్టం. ఈ నేపథ్యంలో వాట్సాప్ నంబర్‌లో సమాచారం పొందుపరిచేటప్పుడు బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇలా ఫిర్యాదు చేయాలి..
సెల్‌ఫోన్‌లను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్పీ అందుకోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 9490617573 అనే వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పెట్టి యాప్ అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చి, ఫిర్యాదును ఆన్‌లైన్ చేసుకోవాలి.
వాట్సాప్ నంబరు ద్వారా అందిన ఫిర్యాదును ఐటీ కోర్ టీం సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది స్వీకరించి సెల్‌ఫోన్‌లను రికవరీ చేసేందుకు చర్యలు చేపతారు. ఈ విధానాన్ని జనవరి మాసంలో ఎస్పీ ప్రారంభించగా.. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 1700 ఫిర్యాదులు జిల్లా పోలీసులకు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకూ దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే సుమారు 200 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశారు.
ఉపయోగంలో ఉంటే వెంటనే రికవరీ..
జిల్లాలో ఇప్పటి వరకు 1700 ఫిర్యాదులు అందాయి. వీటిని ఐటీ కోర్ టీంకు అందజేస్తున్నాం. ఫోన్‌లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాం. రూ. 50 లక్షల విలువ చేసే 200 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. అతి త్వరలోనే మిగిలిన ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తాం.
– జాషువ, ఎస్పీ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment