
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలో 55 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలున్న వారిని కరోనా విధుల నుంచి తప్పించి పోలీస్ స్టేషన్‌లోనే ఉండేలా విధులు అప్పగిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ప్రతి జిల్లాలోనూ పోలీస్ ఫ్యామిలీ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 7,060 మందిపై కేసులను నమోదు చేశామన్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులను ఆదేశించారు.
విజయవాడలో డీజీపీ సవాంగ్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని రాణిగారితోట, పాత పోలీస్ కంట్రోల్ రూమ్ సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, పీవీపీ మాల్ సెంటర్, రైల్వే స్టేషన్, మున్సిపల్ సర్కిల్ సెంటర్, బెంజ్ సర్కిల్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రతి సెంటర్‌లోనూ ఆగి లాక్‌డౌన్ అమలు తీరును విధుల్లో ఉన్న పోలీసులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఆదివారం కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ప్రజలెవరూ బయటకు రాకుండా ఉంటేలా లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని సూచించారు. పలు చోట్ల ప్రజలను కలిసి వారి నుంచి వివరాలు సేకరించిన డీజీపీ లాక్‌డౌన్ సమయంలో బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అనుమతించిన వేళల్లో నిత్యావసర సరుకుల కోసం వెళితే భౌతిక దూరం పాటించాలని డీజీపీ కోరారు.
కరోనాపై పోలీస్ కంట్రోల్ రూమ్‌లు
రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తిని నిరోధించేందుకు, ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన డీజీపీ కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. ఏపీ స్టేట్ కోవిడ్–19 ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ 08662469926, 9182361331తోపాటు ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ 08632340471, 08632340473, 7382938775 నంబర్లు పని చేస్తాయని తెలిపారు. వీటితోపాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చెందిన డయల్ 1902 ద్వారా తక్షణ సేవలు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment