![Goutham Sawang Comments About CM Jagan Governance - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/30/Untitled-2.jpg.webp?itok=pEY5lgUC)
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల క్రితం మొదలైన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. శనివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న పోలీసు శాఖలో క్రమం తప్పకుండా అర్హత ప్రాతిపదికన ప్రతి ఒక్కరికీ సకాలంలో పదోన్నతులు కలిగే పరిపాలన వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 181 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పించడం పోలీస్ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ‘రూల్ ఆఫ్ లా’ను పకడ్బందీగా అమలుపరిచేలా, ప్రజల ధన, మాన, ప్రాణాలకు భరోసాగా ఉండేలా పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుందన్నారు. పోలీసుల మనసెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు పోలీసుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూŠ, మరోవైపు వృత్తి పరమైన అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారని డీజీపీ తెలిపారు.
సత్వర స్పందన, జవాబుదారీతనం పరమావధిగా..
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు, మార్పు అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారని సవాంగ్ తెలిపారు. అందుకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర స్పందన, బాధ్యతాయుతమైన సేవలే పరమావధిగా అడుగులు వేశారన్నారు. ఏళ్ల తరబడి శాఖలో విధులు నిర్వహిస్తూ సరైన సమయంలో పదోన్నతులు లభించకపోవడంతో కానిస్టేబుల్ మొదలుకొని ఎస్పీ స్థాయి అధికారి వరకు నిరాశ, నిస్పృహలతో ఉన్నట్టు గుర్తించిన సీఎం ఏడేళ్లుగా పోలీస్ శాఖలో అసంపూర్తిగా మిగిలిపోయిన పదోన్నతులపై తాను ఇచ్చిన నివేదిక మేరకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారని గుర్తు చేశారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు రేంజ్‌ల పరిధిలోని పోలీస్ అధికారులు, పదోన్నతుల కమిటీ పలుమార్లు సమావేశం నిర్వహించి ఒకేసారి 181 మంది ఎస్సైల పదోన్నతులకు చర్యలు తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం దాదాపు ఏడేళ్ల పాటు ఇరు రాష్ట్రాల డీఎస్పీల మధ్య సీనియారిటీ సమస్య తెగక పదోన్నతులకు నోచుకోలేదన్నారు. అన్ని సమస్యలను అధిగమించి గత సెప్టెంబర్‌లో డీఎస్పీ సీనియారిటీ లిస్టులను సరిచేసి విభజన ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. దీనివల్ల వందలాది మంది డీఎస్పీలు ప్రమోషన్లు పొందినట్టు వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు వంటి వినూత్న చర్యలు తీసుకోవడంతోపాటు ఖాళీ పోస్టుల భర్తీ, పదోన్నతులు, జీతభత్యాలు, అవార్డులు, రివార్డులు, ఇంక్రిమెంట్లు వంటి అనేక విషయాల్లో మరింత ప్రోత్సాహం అందిస్తున్నారని డీజీపీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment