
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: సవాంగ్
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో గౌతం సవాంగ్ విలేకర్లతో మాట్లాడుతూ.... పుష్కరాలు నేపథ్యంలో 5 శాటిలైట్ రైల్వేస్టేషన్లు, 6 శాటిలైట్ బస్టాప్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పుష్కరాల్లో 17500 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారన్నారు.
18 డ్రోన్ కెమెరాలు, 1400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 19 మంది ఐపీఎస్లతోపాటు 14 మంది ఎస్పీ స్థాయి అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. 7 వేల మంది వాలంటీర్లను కూడా నియమించినట్లు గౌతం సవాంగ్ వివరించారు.