అవార్డు పొందిన విజయనగరం యూత్ ఫేస్‌బుక్ పేజీ
విజయనగరం క్రైమ్: కోవిడ్‌తో బాధపడుతూ మృతి చెందిన వారిని ‘విజయనగరం యూత్ ఫేస్‌బుక్ పేజీ’ పేరుతో తమవంతు బాధ్యతగా అంత్యక్రియలు నిర్వహించి పలువురి మన్ననలు పొందిన ఫేస్‌బుక్ పేజీ బృందాన్ని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విశేషమైన సేవలందించిన స్వచ్ఛంద సంస్థలతో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్ సమయంలో సంస్థలు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని, అభినందించి, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ఉన్నతికి పాటుపడాలన్నారు. జాతి, కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా మానవత్వమే పరమావధిగా వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించి, బాధితుల కుటుంబాల పట్ల ఆపద్బాంధువులయ్యారన్నారు.
(విజయనగరం యూత్ ఫేస్‌బుక్ పేజీ)
ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా పోలీసుశాఖకు పంపిన ‘మానవత్వ ధీర’ అవార్డును ఎస్పీ బి.రాజకుమారి విజయనగరం యూత్ ఫేస్‌బుక్ బృందం సభ్యులు షేక్ ఇల్తమాష్, నడుకూరి ఈశ్వరరావు (శివ), అయ్యప్ప, అమర్‌లకు అందజేశారు. వారిని అభినందించి, శాలువాలతో సత్కరించారు. రెండేళ్లుగా అనేక రకమైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను ఈ పేజీ సభ్యులు పొందారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐలు జి.రాంబాబు, ఎస్‌పీ పీఏ కె.కృష్ణమూర్తి, పోలీసు పీఆర్‌ఓ కోటేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మానవత్వ ధీర అవార్డును ఫేస్‌బుక్ పేజీ ప్రతినిధులకు అందిస్తున్న ఎస్పీ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment