సాక్షి, విజయవాడ: కాలానికి అనుగుణంగా సరికొత్త కట్టడాలతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దేశంలోనే అదర్శంగా నిలుస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్‌లో 150 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్స్యూరెన్స్ బాండ్‌లు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంచి కార్పొరేషన్‌గా అందరి మన‍్ననలు పొందుతోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కట్టడాలతో ముందంజలో ఉందన్నారు.
సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న సిబ్బంది సంక్షేమం కూడా తమకు ముఖ్యమే అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్యూరెన్స్ బాండ్లను అందించామన్నారు. సంస్థపై ఉన్న నమ్మకం వల్లే నేడు నిర్మాణం కోసం అనేక మంది సంప్రదిస్తున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో సంస్థ టర్నోవర్ కూడా బాగా పెరిగిందని వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన సంస్థ వైస్ చైర్మన్ సునీల్ కుమార్, ఇతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మంచి పని తీరుతో రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పీవీ సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తున్నామని ప్రకటించారు. ‘బ్యాంకులు కేవలం పర్మినెంటు ఉద్యోగులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పినప్పటికీ, కొటక్ మహీంద్రతో ఒప్పందం చేసుకుని మరీ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్సూరెన్స్ బాండ్లను అందిస్తున్నాం. ప్రమాదవశాత్తూ మరణించిన ఉద్యోగికి 20లక్షలు అందజేస్తాం. ఇటీవల హరికృష్ణ అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే తోటి ఉద్యోగులు చందాలు వేసుకుని అతని కుటుంబానికి ఏడు లక్షలు ఇచ్చాం. ఈ విషయం తెలిసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్‌ను అందజేశారు. ఇక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అధునాతన భవనాలు నిర్మిస్తాం. ఇతర ప్రభుత్వ శాఖలు కూడా మా పని తీరు చూసి నిర్మాణ బాధ్యత అప్పగించాలి’ అని సునీల్ కుమార్ కోరారు.
జరిగింది పార్టీల మధ్య గొడవ కాదు..
గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముగేంత వరకు పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉంటుందని డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు. ‘ఆత్మకూరులో రెండు వర్గాల మద్య గొడవ జరిగిందే తప్ప పార్టీలకు సంబంధం లేదు. వైన్ వెల్ఫేర్ బిల్డింగ్‌లో ఉన్నవారందరినీ పోలీసులే స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లారు. అతి త్వరగా ఆత్మకూరులో పరిస్దితులు సాధారణ స్థితికి వస్తాయి. కొందరు నేతలు పొలీసులపై అసభ్యకరంగా మాట్లాడడంపై ఫిర్యాదులు వచ్చాయి. వివాదం పెద్దది కాకూడదని సంయమనాన్ని పాటించాం. నిన్న పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం. తిడుతున్నా కూడా చాలా ఓర్పుగా వ్యవహరించారు. పోలీసులు ఏకపక్షం అని ఆరోపించడం సరికాదు.. పోలీసులు ప్రజల పక్షంగానే వ్యవహరిస్తారు. ఆత్మకూరు దాడిలో కొందరు మీడియా ముందు ప్రవేశపెట్టిన బాధితుల లిస్ట్‌ను మేము తెప్పించుకున్నాం. దాడిలో బాధితులని చెబుతున్నవారిలో సగానికి పైగా ఇతర ఇబ్బందులతో వచ్చినవాళ్లే. ప్రతి ఒక్కరి గురించి రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుంటున్నారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment