
సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. రాష్ట్రంలో టీడీపీ తన కిరాయి మనుషులతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ...టీడీపీ వ్యూహాత్మకంగా దాడులు చేసి, వాటిని వైఎస్సార్ సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తమ పార్టీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ ముఖ్యమంత్రి, హోంమంత్రిలపై దారుణంగా అసత్యాలు దుష్ప్రచారం చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోందన‍్నారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా తమపై అక్కసుతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment