సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన మహిళ మిత్ర (సైబర్ మిత్ర)లు సమాజ మిత్రలుగా మన్ననలు పొందుతున్నారు. వీరు.. పోలీసులు, బాధిత మహిళలకు వారధిగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మహిళా మిత్ర (సైబర్ మిత్ర) కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. అంతకుముందు దేశవ్యాప్తంగా మహిళా వలంటీర్ల వ్యవస్థ మాత్రమే ఉండేది. అది క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి మహిళా మిత్ర (సైబర్ మిత్ర) పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కూడా కల్పించింది. గతేడాది నవంబర్ నుంచి మహిళా మిత్రల నియామకాలను చేపట్టి పూర్తి చేసింది. 1,097 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 10 వేల మంది మహిళా మిత్ర(సైబర్ మిత్ర)లను నియమించింది. వీరిలో ఎక్కువ మంది స్వయం సహాయక సంఘాలకు చెందినవారే ఉండటం విశేషం. వీరంతా మహిళల సమస్యలపై అవగాహన కలిగి ఉండటంతో క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయి.
ప్రతి పోలీస్‌స్టేషన్‌కు పది మంది
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిది నుంచి పది మంది మహిళా మిత్ర (సైబర్ మిత్ర)లు ఉన్నారు. ప్రతి గ్రామానికి/ వార్డుకు ప్రాధాన్యత కల్పించేలా ఒకరి చొప్పున నియమించారు. స్థానికంగా ఉంటూ.. కనీసం 19 ఏళ్లు నిండి, ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగి, ఏ రాజకీయ పార్టీకి చెందని వారికి మహిళా మిత్రలుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి ఆయా పోలీస్‌స్టేషన్‌లల్లోని మహిళా ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లో ఒకరు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు.
మహిళా మిత్ర (సైబర్ మిత్ర) విధులు..
- తమ పరిధిలోని విద్యార్థినులు, మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
- కోడళ్లను వేధింపులకు గురి చేసే అత్తమామలు, భర్తల గురించిన సమాచారం పోలీసులకు చేరవేయాలి.
– గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి.
– బడికి వెళ్లని బడి ఈడు పిల్లల వివరాలను పోలీసుల ద్వారా విద్యా శాఖకు చేరవేసి.. చదివించేందుకు కృషి చేయాలి.
– వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తు¯ంటాయి. ఇలాంటి ఘటనల్లో బాధ్యులను గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలి.
– సోషల్ మీడియా (అసభ్య పోస్టులు, అసభ్య వీడియోలు, వేధింపులు, తదితర) ద్వారా ఇబ్బందిపడుతున్న బాధిత మహిళలను కాపాడాలి. వారిలో ఆత్మస్థైర్యం కలిగించడంతోపాటు తక్షణ సహాయాన్ని అందించడానికి పోలీసులకు సమాచారమందించాలి.
మహిళా మిత్ర సేవలు విస్తరిస్తాం..
–డీజీపీ గౌతమ్ సవాంగ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళా మిత్ర, సైబర్ మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో మహిళల సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించే వీరి సేవలను మరింత విస్తరిస్తాం. గ్రామాల్లోని ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో మహిళా మిత్రలను సమన్వయం చేస్తాం. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా రక్షణ కార్యదర్శులకు మహిళా మిత్రలను అప్పగిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment