సాక్షి, అమరావతి: పోలీసులకు వీక్లీఆఫ్ విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చినట్టు రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. దీని అమలు విషయంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి అయ్యన్నార్ చైర్మన్‌గా 21 మందితో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగింది. డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవిశంకర్ అయ్యన్నార్ మీడియాకు వివరించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలోని విశాఖ, కడప, ‘ప్రకాశం’ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి మొత్తం 70 వేల మంది పోలీసులకు వీక్లీఆఫ్ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మొత్తం 19 ఆప్షన్స్ (మోడల్స్)ని ఎంపిక చేశామన్నారు. ప్రతీ యూనిట్ ఆఫీసర్ వాటిలో ఏదో ఒకటిని ఎంపిక చేసుకోవచ్చన్నారు. ప్రతి యూనిట్ నుండి రెండు నెలలకోసారి సమాచారం తీసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ఈ నిర్ణయం కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు వర్తిస్తుందన్నారు. వీక్లీఆఫ్ అమలుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటామన్నారు. అలాగే, వీఆర్‌లో ఉన్నవారిని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీక్లీఆఫ్‌లతో షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉంటాయన్నారు. ఐటీ ప్లాట్‌ఫారం తయారుచేసి పారదర్శకంగా డాష్ బోర్డును అమల్లోకి తీసుకు రాబోతున్నట్టు చెప్పారు.
ఖాళీల భర్తీకి సర్కారుకు నివేదన
ఇదిలా ఉంటే.. పోలీసు శాఖలో ఉన్న 20 శాతం ఖాళీలను భర్తీచేసేలా ప్రభుత్వానికి నివేదించినట్టు రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. మొత్తం 12,300 ఖాళీలున్నాయని తమ కమిటీ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిపారు. వీఐపీ, యాంటీ నక్సల్స్ విధులకు ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ప్రభుత్వం ఖాళీలు భర్తీచేసేలా చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే, పనిఒత్తిడి కారణంగా పోలీసులు గుండె, కిడ్నీ, సుగర్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వీరి సంక్షేమానికి చర్యలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు అయ్యన్నార్ తెలిపారు.
చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు
‘సాక్షి’తో ఏపీ డీజీపీ సవాంగ్
ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు పోలీసు భద్రత తగ్గించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని, ఆయనకు భద్రత తగ్గించలేదని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది కూడా అవాస్తవమన్నారు. శాంతిభద్రతల విషయంలో నిష్పాక్షికంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని డీజీపీ స్పష్టంచేశారు. ఇకపై పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండబోదన్నారు. రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గతంలో జరిపిన దాడులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, పోలీస్ శాఖలో వీక్లీఆఫ్ అమలుచేసేలా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగని ఆయన అభివర్ణించారు.
పోలీసు సంఘం కృతజ్ఞతలు
వీక్లీఆఫ్ అమలుకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లకు ఏపీ పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఏపీ పోలీసు అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సవాంగ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ఇచ్చిన హామీని అమలుచేయడం గొప్ప విషయమని చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. వీరిని పోలీసులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చంద్రశేఖర్‌రెడ్డి కితాబిచ్చారు. అలాగే, ఇది చాలా సాహసోపేత నిర్ణయమని సీఐడీ ఐజీ కాళిదాసు రంగారావు అన్నారు. తాను కూడా వరంగల్, విజయనగరం జిల్లాల ఎస్పీగా పనిచేసినప్పుడు పోలీసులకు
వీక్లీఆఫ్ ఇద్దామని ప్రయత్నించి పూర్తిస్థాయిలో అమలుచేయలేకపోయానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment