సాక్షి, విజయవాడ : ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక నిపుణులతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసుశాఖను ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా వ్యాప్తిని ఆరికట్టే నేపథ్యంలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. దీనిలో భాగంగా విదేశాలనుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి పోలీసులు లక్ష్మణరేఖ గీస్తున్నారు. హౌస్ క్వారంటైన్ యాప్ పేరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్‌లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను పోలీసులు పొందుపరిచారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను పోలీసులు నమోదు చేయనున్నారు. అప్లికేషన్‌లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్‌కు ఆటో మేటిక్‌గా సమాచారం వస్తుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో తన మేధస్సును నిబద్ధతను చాటి చెబుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment