డ్రంకన్‌ డ్రైవింగ్‌ పరీక్షలతో కష్టాలు.. పోలీసులను చుట్టేస్తున్న కోవిడ్‌ | Covid Speed Spreading To Police Over Drunk And Driving Test Hyderabad | Sakshi
Sakshi News home page

డ్రంకన్‌ డ్రైవింగ్‌ పరీక్షలతో కష్టాలు.. పోలీసులను చుట్టేస్తున్న కోవిడ్‌

Published Sat, Jan 15 2022 7:00 AM | Last Updated on Sat, Jan 15 2022 4:00 PM

Covid Speed Spreading To Police Over Drunk And Driving Test Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం పోలీసు విభాగంపైనా తీవ్రంగా ఉంది. వెరీ ఫాస్ట్‌గా చుట్టేస్తున్న ఈ వైరస్‌ బారిన ఇప్పటికే 650 మందికి పైగా పడ్డారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లతో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి దీని కాటు తప్పలేదు. అయితే నిందితులు లేదా ఫిర్యాదుదారులు ఇలా..ఎవరో ఒకరి ద్వారా అధికారులు, సిబ్బందికి ఈ మహమ్మారి సోకుతోంది.

ట్రాఫిక్‌ పోలీసులైతే డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలతో కొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. సరూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో పలువురు అధికారులు, సిబ్బందికి పాజిటివ్‌గా శుక్రవారం తేలింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ వైరస్‌ సోకుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. 

నగర పోలీసు విభాగానికి సంబంధించి తొలి పాజిటివ్‌ కేసు 2020 ఏప్రిల్‌లో సైఫాబాద్‌ ఠాణాలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో అత్యధికం రోడ్ల పైకి వచ్చి, గాంధీ ఆసుపత్రిలో డ్యూటీలు చేసే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందే ఎక్కువగా ఉన్నారు.  

 ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తూ కరోనా టీకా వేయించింది. సిటీ పోలీసు విభాగంలో నిర్బంధ విధానం అమలు చేయడంతో అంతా రెండో డోస్‌ కూడా వేయించుకున్నారు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మూడో డోస్‌ వేస్తున్నారు. 

 మొదటి, రెండో వేవ్‌ మాదిరిగా ఈసారి ఇంకా గాంధీ డ్యూటీలు, కంటైన్‌మెంట్‌ ఏరియాల, చెక్‌పోస్టుల విధులు ఇప్పటి వరకు లేకపోయినా... పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పలేం. అయినప్పటికీ «థర్డ్‌ వేవ్‌ ప్రభావం పోలీసుల్లో తీవ్రంగా కనిపిస్తోంది. గతానికి భిన్నంగా వరుసపెట్టి వైరస్‌ బారినపడుతున్నారు.  

 పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రధానంగా ఫిర్యాదుదారులు, బాధితులతో సంభాషించేటప్పుడు, నిందితుల్ని అరెస్టు చేసే సందర్భంల్లో ఈ వైరస్‌ సంక్రమిస్తోందని భావిస్తున్నారు. మరోపక్క విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వాళ్లల్లో 95 శాతం మందికి పాజిటివ్‌గా తేలుతోంది. 

 మరోపక్క రహదారులపై ఉండి డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకూ ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఎదుటి వారి శ్వాస పరీక్ష చేసేప్పుడు వారితో మాస్కులు తీసేస్తున్నారు. ఆపై సంభాషించేటప్పుడు పోలీసులకు ఈ వైరస్‌ వ్యాపిస్తోందని సమాచారం.  

థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో రానున్న రోజుల్లో పోలీసులు ఎలాంటి విధులు నిర్వర్తించాలనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇలా అధికారులు, సిబ్బంది వైరస్‌ బారినపడుతుండటంతో ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. ఎవరికీ తీవ్రమైన ఇబ్బందులు లేకున్నా క్వారంటైన్‌తో విధుల్లో ఉండే వారి సంఖ్య తగ్గుతోంది.  

 పోలీసుస్టేషన్లు, వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్‌ తేలిగ్గా వ్యాపించే ప్రమాదం ఉంది. అదే జరిగితే పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనూ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌తో పరిస్థితులు చేయి దాటుతాయి. దీంతో చక్కదిద్దే చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

 అధికారులు, సిబ్బందిలో ఎవరికి లక్షణాలు ఉన్నా, అనుమానం కలిగినా తక్షణం సెలవు తీసుకోవాలని, పరీక్షలు చేయించుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.  

 కోవిడ్‌ పరిస్థితులు చక్కబడే వరకు కేసుల దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రాలు, తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, పోలీసు విభాగంలో అంతర్గతంగానూ ఎలాంటి ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించవద్దని స్పష్టం చేశారు. ప్రత్యేక కంట్రోల్‌ రూమ్స్‌ ద్వారా పాజిటివ్‌ వచ్చిన వారికి సహాయం అందిస్తున్నారు. 

 రహదారులపై ఉండి శ్వాస పరీక్ష యంత్రాలు వినియోగించే వారికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. అవసరమైన ప్రతి చోటా శానిటైజర్లు, మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్స్, పీపీఈ కిట్లు వినియోగించాలని సూచించారు.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement