సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై చెప్పులతో, రాళ్లతో దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రైతు కాగా, రాళ్లు విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి తాను నష్టపోయినట్లుగా చెబుతున్నారని పోలీసులు తెలిపారు. చంద్రబాబు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అందుకే అలా చేశానని వారు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. డీజీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాజకీయ కామెంట్లపై తాము మాట్లాడమని అన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తమ విచారణలో పెద్దగా వివాదాలు జరగవని తేలిందని, అందుకే చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చామని తెలిపారు.
అదేవిధంగా.. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా నిర్మూలనకు సీఐడీ ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గురువారం స్మగ్లింగ్ సమాచారం కోసం సీఐడి విభాగంలో 7382296118 అనే వాట్సప్ నెంబర్‌ను ఆయన ప్రారంభించారు. గంజాయి, మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, అమ్మకాల సమాచారాన్ని వాట్సప్ ద్వారా నార్కోటిక్ సెల్, సీఐడీకి తెలియజేయవచ్చని తెలిపారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించినవారికి పారితోషకం అందజేస్తామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. యూనివర్శిటీలలో, కళాశాలలో యువత గంజాయి సేవిస్తున్నారని, గంజాయి సరఫరా ఏజెన్సీ నుండి సప్లై అవుతుందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి సరఫరాపై పోలీస్ నిఘా పెరగబోతోందని వెల్లడించారు. గంజాయిని నిర్మూలించాలంటే ప్రజల సహకారం కూడా కావాలన్నారు. నార్కొటెకె సెల్‌ను ఇంకా బలపరుచనున్నామని, యూనివర్శిటి మెనేజ్‌మెంట్ కూడా డ్రగ్స్ కంట్రోల్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment