సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పేరుతో లేఖను లీక్ చేసిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గురువారం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై డీజీపీ దృష్టి సారించారు. ఎస్‌ఈసీ లేఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలన్నీ పథకం ప్రకారమేననే అనుమానాలు బలపడుతున్నాయి. లేఖ లీక్ వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీసులు ప్రధానంగా మీడియా వైపు నుంచి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
- మీడియాకు ఆ లేఖ ఎలా చేరింది? ఎవరు చేరవేశారు? అలా చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అందువల్ల కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
- రాష్ట్రంలో ప్రధానంగా ఐదు మీడియా సంస్థలకు ఈ లేఖ లీకైనట్టు పోలీసులు గుర్తించారు. ఆయా మీడియా ప్రతినిధులకు వాట్సాప్ ద్వారా రాజకీయ నాయకుల నుంచి ఈ లేఖ వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీడీపీ అనుకూలమైన మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనం కోసం ఇదంతా చేశాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.
- ఎస్‌ఈసీ లేఖ మీడియాలో ప్రసారం అయ్యేలా ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చక్రం తిప్పినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులకు మొదట ఆయన ఫోన్ చేసి లేఖ విషయంలో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దాదాపు 30 నిముషాల వ్యవధిలో ఐదుగురు మీడియా ప్రతినిధులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి ఈ విషయాన్ని బ్లాస్ట్ చేయాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే వారి వాట్సాప్‌లకు లేఖ లీక్ చేయడం, ఓ వర్గం మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడం జరిగిపోయాయి.
- ఎస్‌ఈసీ ఇదే లేఖను కేంద్ర హోంశాఖకు మెయిల్ ద్వారా పంపి ఉంటే ఎలా లీకైందనే అంశంపైనా దృష్టి పెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మెయిల్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగానే జరుపుతారు. అలాంటప్పుడు లేఖను లీక్ చేయడం పెద్ద నేరమే అవుతుంది. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
- ఈ లేఖను అడ్డుపెట్టుకుని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా సంస్థలు కలసికట్టుగా పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే యత్నం చేశాయి. ఇందులో ప్రధానంగా ఓ మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత ఒకరు చక్రం తిప్పినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో లేఖ లీకుపై పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment