మాట్లాడుతున్న డీజీపీ సవాంగ్, పక్కన ప్రభుత్వ విప్ ఉదయభాను
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట: మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా రాష్ట్రానికి కరోనా వైరస్ వచ్చిందని, ఈ పరిస్థితి చక్కబడుతున్న దశలో ఊహించని విధంగా ఢిల్లీలో మత సమావేశానికి హాజరైన వారి ద్వారా కొత్త సవాలు ఎదురైందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఛాలెంజ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద గల ఏపీ–తెలంగాణ బోర్డర్ చెక్‌పోస్ట్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. గరికపాడు చెక్‌పోస్ట్ నుంచి ల్యాప్‌ట్యాప్ ద్వారా రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల పోలీస్ ఇన్‌చార్జిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఏమన్నారంటే..
► ఏపీ నుంచి 1,085 మంది ఢిల్లీ సమావేశానికి హాజరైనట్లు గుర్తించాం. ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
► వైరస్ బాధితులు ఆలస్యం చేసేకొద్దీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి వారు ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలని, క్వారంటైన్‌కు వెళ్లాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
► బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య చాలా బాధాకరమని సీఎం ఈ రోజు ఉదయం నాతో అన్నారు. దీనిపై వివరాలడిగి.. పోలీస్ సిబ్బంది ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించారు.
► బాపట్ల ఘటనపై విచారణకు ఆదేశించాం. లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై పోలీసులకు సహకరించాలి.
► కరోనా కేసుల విషయంలో కులం, మతం, ప్రాంతం, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం.
► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి ద్వారా వైరస్ విస్తరించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర సరుకులు, అత్యవసర పనులపై వచ్చే వాహనాలకు అనుమతి.
Comments
Please login to add a commentAdd a comment