బతుకుబండి.. పట్టాలెక్కిందండి! | Increasing economic activities in AP | Sakshi
Sakshi News home page

బతుకుబండి.. పట్టాలెక్కిందండి!

Published Mon, Jul 13 2020 3:47 AM | Last Updated on Mon, Jul 13 2020 4:48 AM

Increasing economic activities in AP - Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు సత్ఫలితాలి స్తున్నాయి. శ్రీసిటీలో మా ప్యాకేజింగ్‌ యూనిట్‌ ఉత్పత్తులను 110 కంపెనీలకు సరఫరా చేస్తాం. ఏప్రిల్‌లో 40 మంది కార్మికులతోనే పనిచేసింది. ప్రస్తుతం 287 మంది  పనిచేస్తున్నారు.  
 – శశి రావాడ, ఎండీ, వైటల్‌ పేపర్‌ ప్రొడక్ట్స్, శ్రీసిటీ, చిత్తూరు

(వడ్డాది శ్రీనివాస్, డొక్కా రాజగోపాల్‌) సాక్షి, అమరావతి: అది విజయవాడ ఆటోనగర్‌లోని సాంబశివా ఇండస్ట్రీస్‌.. ఆటో మొబైల్‌ విడి పరికరాలు తయారుచేసే ఈ యూనిట్‌లో పనిచేసే 50మంది కార్మికుల్లో 40మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. లాక్‌డౌన్‌తో వీరిలో సగం మంది తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వం అన్‌లాక్‌ ప్రక్రియను ప్రకటించడంతో జూన్‌ మొదటివారం తరువాత వారంతా మళ్లీ విజయవాడ చేరుకున్నారు. అక్కడ మళ్లీ పనులు మొదల య్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాగుతోంది. 

..ఇది ఒక్క సాంబశివా ఇండస్ట్రీసే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉత్పాదక, వాణిజ్య కార్యకలాపాలను అన్ని చోట్లా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. 

10 కీలక సూచీల వృద్ధి
ప్రభుత్వ నిర్మాణాత్మక విధానాలు రాష్ట్రం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాయి. 2.70 ట్రిలియన్‌ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని నిపుణులు చెప్పడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం అన్‌లాక్‌ ప్రక్రియను చేపట్టిన తరువాత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గీటురాళ్లు వంటి పది కీలక అంశాల్లో స్పష్టమైన వృద్ధి కనిపించిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు, ఇ–వే బిల్లులు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలు, విద్యుత్తు వినియోగం, టోల్‌ గేట్‌ ఫీజులు, ఎరువుల అమ్మకాలు, ట్రాక్టర్లు–వాహనాల అమ్మకాలు, ఖరీఫ్‌లో నాట్లు వేసిన ప్రాంతం, ఉత్పాదక పీఏంఐ రేటు, ఉపాధి అవకాశాలు.. ఈ కీలకాంశాల్లో రాష్ట్రంతోపాటు దేశం  గణనీయ పురోగతి సాధిస్తుండటం గమనార్హం.

పెరుగుతున్న జీఎస్టీ వసూళ్లు
గత రెండేళ్లతో పోలిస్తే ఈ జూన్‌లో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నమాట వాస్తవమే. కానీ, ఏప్రిల్, మేతో పోలిస్తే పెరిగిన జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగం పుంజుకుంటోందన్న భరోసా కలుగుతోంది. అందులోనూ జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఏప్రిల్, మేలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఏపీలో ఆరు శాతం పెరిగింది. 

ఎగుమతులు.. దిగుమతులూ ఆశాజనకం
దేశంలో ఎగుమతులు, దిగుమతులు కూడా ఆశాజనకంగా ఉన్నాయి.  జాతీయ రహదారులపై నెలకు సగటు టోల్‌ పన్ను వసూళ్లు మేలో 60 శాతమే రాగా.. జూన్‌లో 80 శాతం వసూలయ్యాయి. అలాగే, రైల్వే రవాణా కూడా బాగా పుంజుకుంటోంది. మేలో 82 మిలియన్‌ టన్నులు లోడ్‌ కాగా.. జూన్‌లో అది 93.27 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 

వినియోగ వస్తువులకూ గిరాకీ
దేశంలో వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా క్రమంగా పెరుగుతోంది. దుకాణాలు, షోరూంలలో అమ్మకాలు జూన్‌లో జోరందుకున్నాయని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నివేదిక వెల్లడించింది. ఇ–కామర్స్‌ రంగంలో రోజుకు 35 లక్షల షిప్‌మెంట్స్‌ డెలివరీ చేస్తున్నాయి. ఏప్రిల్, మే కంటే వివిధ రంగాల్లో జూన్‌లో కనిపించిన సానుకూలత ఇలా ఉంది..
వినియోగ వస్తు తయారీ రంగం : 5% పెరుగుదల
రిటైల్‌ మార్కెట్‌ రంగం : 10% పెరుగుదల
స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు : 12% పెరుగుదల

వీటి అమ్మకాల్లో బూమ్‌ 
కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిష్‌ వాషర్లు వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు, ట్రిమ్మర్లు వంటి గ్రూ మింగ్‌ ఉత్పత్తుల అమ్మకాలు బాగా పెరిగాయి. గత ఏడాది దీపావళి సీజన్‌తో పోలిస్తే ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసి కంలో ఆ ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదల ఇలా ఉంది..
డిష్‌ వాషర్లు : 500%             – వాషింగ్‌ మెషిన్లు : 100%
ఎయిర్‌ ప్యూరిఫయర్లు :200%  – గ్రూమింగ్‌ ఉత్పత్తులు : 50%

తయారీ రంగం ‘రీస్టార్ట్‌’
ఏప్రిల్, మేలో దాదాపు స్తంభించిపోయిన దేశంలోని వస్తూత్పత్తి రంగం మళ్లీ కళకళలాడుతోంది. నవోదయం కార్యక్రమం కింద చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏపీ సర్కార్‌ ‘రీస్టార్ట్‌’ ప్యాకేజీ ప్రకటించడం పారిశ్రామిక రంగానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. అందుకే దేశంలో వస్తూత్పత్తి రంగ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ జూన్‌లో గణనీయమైన పెరుగుదల సూచించింది. 

ఊపందుకున్న వస్తు రవాణా
దేశంలో వస్తు రవాణా రంగం కార్యక్రమాలు మెల్లగా ఊపందుకుం టున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. వస్తు రవాణాకు కీలకమైన ఇ–వే బిల్లుల జారీ ఏప్రిల్, మేలలో బాగా తగ్గిపోగా జూన్‌లో పెరగడమే దీనికి నిదర్శనం. 

నిరుద్యోగం తగ్గుముఖం
ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో నిరుద్యోగం తగ్గుముఖం పడుతోందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. దేశంలో నిరుద్యోగం అత్యధికంగా మేలో 23 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించింది. జూన్‌లో ఉపాధి అవకాశాలు పెరగడం ప్రారంభించాయి. దాంతో నిరుద్యోగం 11 శాతానికి తగ్గింది. జాతీయ సగటు కంటే ఏపీలో నిరుద్యోగం తక్కువగా అంటే 9 శాతమే ఉండటం గమనార్హం.

‘ఉపాధి హామీ’లో ఏపీ అగ్రగామి
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఈ పనుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటిస్థానంలో ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా ఈ మూడు నెలల్లో రూ.34,849 కోట్లు ఖర్చు చేయగా.. దేశంలోనే అత్యధికంగా ఏపీలో రూ.5,130 కోట్లు ఖర్చుచేశారు. గత ఏడాది అంతా కలిపి రూ.5,050 కోట్లు ఖర్చుచేస్తే.. ఈసారి తొలి మూడు నెలల్లోనే రూ.5,130 కోట్లు ఖర్చుచేయడం ప్రభుత్వం పేదలకు ఉపాధి కల్పనపట్ల చూపిన శ్రద్ధను సూచిస్తోంది. 

వెన్నుదన్నుగా గ్రామీణం
ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 15 శాతం ఎక్కు వగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది ఖరీఫ్‌ లో దేశంలో 39 శాతం నాట్లు ఎక్కువగా వేశారు. మన రాష్ట్రంలో అయితే 50 శాతం పెరిగింది.  వ్యవసా య సంబంధమైన ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయి. వ్యవసాయ కూలీలకు డిమాండ్‌ పెరిగింది. 

అన్నీ గాడిన పడుతున్నాయి 
యూపీ వెళ్లిన కార్మికులను లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక వెనక్కి తీసుకువచ్చాం. ఇక్కడ మిగతా యూనిట్లలో కూడా పనులు మొదలయ్యాయి. మున్ముందు మరింత బాగుంటుందన్న నమ్మకం ఉంది.
– అన్నే శివనాగేశ్వరరావు, సాంబశివా ఇండస్ట్రీస్‌ యజమాని, ఆటోనగర్, విజయవాడ
 
గ్రానైట్‌ ఎగుమతులు పెరిగాయి
గ్రానైట్‌ ఎగుమతులు పుంజుకున్నాయి. మరింత మంది కార్మికులకు ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం.
– శిద్ధా సూర్యప్రకాశ్, యాపిల్‌ గ్రానైట్స్‌ యజమాని, చీమకుర్తి

ఊరిలోనే పనులు దొరుకుతున్నాయి
ఇంతకుముందు పనుల కోసం విజయవాడకు వెళ్లేవాడిని. కరోనా వల్ల అక్కడకు వెళ్లాలంటే భయమేస్తోంది. ప్రభుత్వం ఊర్లోనే పని కల్పిస్తోంది. 
– కోసుల రామాంజనేయులు, బల్లిపర్రు, గన్నవరం మండలం, కృష్ణాజిల్లా

రైతులకు మళ్లీ మంచిరోజులు
నాకు ఐదెకరాల పొలం ఉంది. రైతు భరోసా అందించడంతో అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సాగు పనులు మొదలుపెట్టాను. ప్రభుత్వం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు ఇచ్చింది. వర్షాలు బాగా పడుతున్నాయి. రైతులకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి.
– ఆది నారాయణ, రైతు, వెంకటాపురం, డోన్‌ మండలం, కర్నూలు జిల్లా

లాక్‌డౌన్‌ నుంచి వివిధ రంగాలు కోలుకుంటోంది ఇలా..
అన్‌లాక్‌ ప్రక్రియతో దేశంలో వివిధ రంగాలు కోలుకుని లాక్‌డౌన్‌ ముందు పరిస్థితికి క్రమంగా చేరుకుంటున్నాయి. ఏఏ రంగాలు ఈ జూన్‌లో ఎలా పురోగమించాయంటే.. 
ఆటోమొబైల్‌ అమ్మకాలు : 80 శాతం
పెట్రోలియం అమ్మకాలు :  60 శాతం
విద్యుత్‌ వినియోగం :        90 శాతం
టోల్‌ఫీజుల వసూళ్లు :      70 శాతం
జీఎస్టీ వసూళ్లు :              90 శాతం
ఇ–వే బిల్లులు :                70 శాతం
ఇ–కామర్స్‌ :                   90 శాతం
రిటైల్‌ అమ్మకాలు :         100 శాతం
ఉపాధి అవకాశాలు :      92 శాతం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement